Abn logo
Aug 19 2021 @ 01:57AM

జ్ఞాపకం ఒక రాజకీయ ఆయుధం

ఆ ట్వీటు చదవగానే మొదట కలవరం కలిగింది. ఆలోచిస్తున్న కొద్దీ భయం వేసింది. ఏముంది అంతగా ఆందోళన చెందవలసింది, సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి మాటల్లో మరేదో అర్థమున్నదని శంకించడం ఎందుకు? ట్విటర్‌లో అని ఊరుకోకుండా ఎర్రకోట ప్రసంగంలో కూడా అవే మాటలు చెప్పారు కదా? ఎన్నడూ ఏ ప్రధానమంత్రి చేయనిది, ఈసారి పొద్దున్నే రాజఘాట్‌కు వెళ్లి గాంధీకి నమస్కారాలు చెప్పుకుని మరీ జెండా ఎగరేయడానికి వచ్చిన ప్రధాని మనసులో దురుద్దేశ్యాలెందుకు ఉంటాయి?


ఆగస్టు 14వ తేదీని ఇక నుంచి దేశవిభజన భీతావహాన్ని స్మరించుకునే రోజుగా పరిగణించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దేశవిభజన వేదన మరచిపోయేది కాదని, అర్థరహితమైన హింసాద్వేషాల కారణంగా అమితమయిన ప్రాణనష్టం జరిగిందని మోదీ తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. సమాజం నుంచి విభజన విషాన్ని, వైరభావాన్ని తొలగించి, ఐక్యతను, సామరస్యతను, మానవీయ సాధికారతను సాధించవలసిన అవసరాన్ని ఈ స్మారకదినం గుర్తుచేస్తుంది- అని ప్రధాని అన్నారు. మోదీ ట్వీట్‌లో కానీ, తరువాత గెజిట్ ప్రకటనలో కానీ అన్నీ సాధు వచనాలే. ఎందుకు ఏదో గుబులు కలుగుతోంది? ఆ భయంకర జ్ఞాపకాలను ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా లేమా? జ్ఞాపకంతో ముఖాముఖీ అంటే పాతగాయాలకు కొత్తగా ఉపశమనం ఇవ్వడం మాత్రమే కాదేమో, ఒక్కోసారి పాతగాయాలను బతికించడానికి చేసే ప్రయత్నమేమో?


దేశవిభజన కల్లోలంలో మరణాలు అసంఖ్యాకం, ఉన్న ఊరును వీడి పరాయిచోటుకు తరలివెళ్లి దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నవారి సంఖ్య మరింత అధికం. రెండు నుంచి ఇరవై లక్షల మధ్య మరణాలు ఉండవచ్చు. విభజన హింస గురించి లెక్కల నమోదు ఎంత ఉజ్జాయింపుగా, బలహీనంగా ఉన్నదో ఆ కనీస, గరిష్ఠ సంఖ్యలే చెబుతాయి. నాటి భయానక పరిస్థితులలో కోటి నుంచి రెండుకోట్ల మంది నిర్వాసితులుగా మారారు.  ముఖ్యంగా, పంజాబ్, బెంగాల్‌లలో విభజన హింస పరాకాష్ఠకు చేరగా, అనేక ఇతర ప్రాంతాలలో కూడా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణాది మాత్రం ఆ ప్రభావానికి ఎడంగా ఉన్నది. ఒకపక్కన దేశమంతా స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకుంటుండగా, ఇంత పెద్ద సంఖ్యలో మనుషులు ప్రాణాలు అరచేత పట్టుకుని భయంలో, బీభత్సంలో ఉండడం ఎంతటి విషాదం! స్వాతంత్ర్యపు అనుబంధ పరిణామమైన విభజన విద్వేషఘట్టంలో బాధితులైనవారు దేశనిర్మాణం కోసం సమిధలైనవారు కాదా? స్వాతంత్ర్య సమరయోధులతో పాటు వారిని కూడా స్మరించుకోవలసిన అవసరం లేదా? ఎందుకు వాస్తవాల నుంచి మనం మొహం చాటుచేసుకుంటున్నాము? ఫలానా కాలంలో ఫలానా సమయంలో, మనం ఇంత క్రూరంగా దుర్మార్గంగా అమానవీయంగా ప్రవర్తించాము, అటువంటి ప్రవర్తనలకు బలి అయ్యాము, ఇది సిగ్గుపడవలసిన చరిత్ర ఘట్టం, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృత్తం కాకుండా మనల్ని మనం సరిదిద్దుకోవాలి, వర్తమానంలో అటువంటి విద్వేషశక్తులుంటే వాటి మీద పోరాడాలి--------- అన్న పరిపక్వతను మనం ఎందుకు ప్రదర్శించలేకపోతున్నాము? దాని గురించి మాట్లాడుకోవడమే అపచారం అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నాము?

బహుశా, అన్ని జ్ఞాపకాలూ ఒకేరకమైనవి కావు మనం ప్రశాంతంగా పలకరించడానికి. చరిత్రలో అనేక యుద్ధాలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి. వాటి ఫలితంగా వివిధ సమూహాల మధ్య ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగాయి. వైరుధ్యాలను ఒక కొలిక్కి తెచ్చిన సంఘర్షణలు కొన్ని ఉంటాయి. ఏ పరిష్కారమూ లేకుండానే కాలవశాన ఉద్రేకాలు మాత్రం చల్లారే ఘర్షణలు ఉంటాయి. కొన్ని ఘట్టాలు విజేతలు సగర్వంగా స్మరించుకునేవి, పరాజితులు మౌనంగా అంగీకరించేవి ఉంటాయి. మరికొన్ని, ఘర్షణానంతరం, అప్రియమైన, అవాంఛనీయమైన ప్రస్తావనలుగా కొనసాగుతాయి. ఉద్రిక్తతలు సజీవంగా ఉండి, సామరస్యంగా కొనసాగడానికి ప్రయత్నిస్తున్న సమాజాలు, ఉద్రిక్తతలను తిరిగి రగిలించే జ్ఞాపకాలను వేదిక మీదకు తీసుకురావడానికి అంగీకరించవు. ఘర్షణలను పరిష్కరించకుండా, తాత్కాలికంగా నెగ్గుకురావడానికి ఈ దాటవేత పనికివస్తుంది. కొన్ని సందర్భాలలో, సున్నితమైన పరిస్థితులు కూడా కొన్ని జ్ఞాపకాలను తివాచీ కిందికి తోసేయడానికి కారణమవుతాయి. ఏదో రకమైన విస్మృతిలోకో, నిషేధంలోకో వెళ్లిన జ్ఞాపకం బహిరంగ సంవాదం నుంచి మాయమై, రహస్య, పరిమిత చర్చల్లోకి జారిపోతుంది. కొన్ని సందర్భాలలో అనేక అవాస్తవ, ఊహాజనిత కథనాలను జోడించుకుంటుంది. ఏ సమూహానికి ఆ సమూహం తన విజయాలను లేదా తన నష్టాలను అధికం చేసి చూసుకుంటుంది. ఒక్కోసారి వాస్తవాలు కూడా కథిత అంశాలు అవుతాయి. కేవల కథిత అంశాలు కూడా వాస్తవాలుగా చెలామణి అవుతాయి. పాత జ్ఞాపకాలను వేదిక మీదకు తెస్తున్నప్పుడు, ఆ ఆవాహన, సమస్యల పరిష్కారం కోసమా, కొత్త సమస్యల సృష్టి కోసమా గుర్తించవలసిన అవగాహన అవసరం. ప్రతీకారాలకు ఆజ్యం పోయడానికా, లేక, ఉద్రిక్త సమాజాన్ని మానవీకరించడానికా, ఎందుకు చరిత్రలోకి వెడుతున్నారో నిశితంగా పరిశీలిస్తే సమాధానం తెలుస్తుంది.


విభజనలో ఏ దేశానికి ఏ ప్రాంతం అన్న వివరాలు, 1947 ఆగస్టు 15 నాటికి కూడా ఖరారు కాలేదు. ఆగస్టు 17 నాడు మాత్రమే అవి వెల్లడి అయ్యాయి. అప్పుడే గగ్గోలు మొదలయింది. కాబట్టి, ఆగస్టు 17 నాడు దేశవిభజన భీతావహం స్మారకదినంగా జరపాలని భావించి ఒక స్వచ్ఛంద సంస్థ అట్టా పాటిస్తోంది కూడా. ఆ సంస్థే అమృతసర్‌లో దేశవిభజన మ్యూజియమ్‌ను నెలకొల్పింది, ఢిల్లీలో మరొకటి ఏర్పాటు చేస్తోంది. మరి ఆగస్టు 14ను ప్రధానమంత్రి ఎందుకు ఎంచుకున్నారు? స్మారకదినం గురించి ట్వీట్ చేయడానికి ముందు, మోదీ పాకిస్థాన్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. స్మారకదినాన్ని పాటించడం ద్వారా మోదీ ఆశించిన ప్రయోజనాన్ని ఆగస్టు 14 తేదీ ఎంపిక భంగపరచడం లేదా?


ఎందుకంటే, దేశవిభజన బీభత్సపు రంగస్థలం నేటి భారతదేశం మాత్రమే కాదు. భారత్, నేటి పాకిస్థాన్, నేటి బంగ్లాదేశ్. ఈ మూడూ పంచుకుంటున్న ఉమ్మడి చరిత్ర– దేశవిభజన. ఈ మూడు భూభాగాలలో దేనిలో జరిగిన హింస కూడా తక్కువది కాదు, ఎక్కువది కాదు. హిందువులు, ముస్లిములు, సిక్కులు.. హతులూ వీరే, హంతకులూ వీరే. బాధితులూ నిర్వాసితులూ దౌర్జన్యకారులూ అందరూ వీరే. నరేంద్రమోదీ చెప్పినట్టు విభజనవాద విషాన్ని విరగగొట్టి, ఐక్యతను తీర్చిదిద్దడానికి ఈ మూడు దేశాలూ కలసి పనిచేయాలి. మరి మన‍ అడుగులు ఆ స్ఫూర్తికి అనుకూలంగా ఉన్నాయా? సహృదయత లోపించిందన్న విమర్శకు ఆస్కారం లేదా? ప్రధాని చెప్పినట్టు, సామరస్యం కోసం కదా, ఈ స్మృతి!


ఆనాడు జరిగిన ప్రతి హత్యను, ప్రతి ఘర్షణను, ప్రతి బాధితుడి పేరుని అన్నిటిని చరిత్రకు ఎక్కించాలి. గర్వంగానో, దీనంగానో కాదు, పశ్చాత్తాపంతో నమోదు చేయాలి. జీవితానికి ముగింపు మరణం అయితే, మనిషి మరణం తోటివారికి ఎడతెగని దుఃఖం కలిగిస్తుంది. మరణవేదనకు కూడా ఒక ముగింపు కావాలి. దేశవిభజన సమయంలో మనం మనుషులుగా కాక, హిందువులుగా, ముస్లిములుగా, సిక్కులుగా ఎట్లా ప్రవర్తించాము, విద్వేషంతో, అభద్రతతో, అమానవీయతతో ఎట్లా వ్యవహరించాము- మనల్ని మనం చరిత్ర అద్దంలో చూసుకుంటే ఆ ఘట్టానికి ఒక ముగింపు లభిస్తుంది. అది ముగింపు మాత్రమే, న్యాయం లభించడం కాదు. న్యాయం జరగడమే గత అన్యాయాలకు పరిహారం.


ఆ పరిణామాలకు మూలకారణం ఎవరు, రెండు జాతుల సిద్ధాంతాన్ని నేరుగా ఎవరెవరు రకరకాల పద్ధతులలో ప్రతిపాదించారు, వాటిని ద్వేషాలుగా ఎవరు తీర్చిదిద్దారు? ఒక కీలకసందర్భంలో భగ్గుమనేలా ఎవరు నిప్పురవ్వలను రాజేశారు? నేతల పాపమెంత? దేశాన్ని వదిలివెడుతూ అనేక భవిష్యత్ కల్లోలాలకు బీజాలు వేసిన వలసవాది నేరమెంత? వీటి గురించిన తెలివిడి ఉంటే తప్ప, ఉన్మాదాల నుంచి మనలను మనం రక్షించుకోలేము.

75 ఏళ్ల స్వాతంత్ర్యోత్సవాల ఆరంభంలోనే జరిగిన ఈ స్మారకదిన ప్రకటన దరిమిలా, రానున్న ఏడాదిలో ఆ తరువాత కూడా విస్తృతమైన చర్చ జరగవచ్చు. ఒక పక్క అఫ్ఘానిస్తాన్ సంక్షోభం, మరో పక్క 75 ఏండ్ల మైలురాయి, తొందరపెడుతున్న 2024 ఎజెండా, కేంద్రప్రభుత్వానికి క్రమంగా తగ్గుతున్న ప్రజాదరణ .. వీటన్నిటి మధ్య దేశవిభజన చర్చకు ప్రత్యేకమైన ప్రయోజనం ఏదైనా ఉన్నదా తెలియదు. ప్రధాని ప్రకటనకు, ఆయన మంత్రివర్గ సహచరుల అనంతర వాదనలకు ఉన్న తేడాను గమనిస్తే, పెద్ద స్థానాలలో ఉన్నవారు ఎంత సాధుసంభాషణ చేసినా తక్కిన శ్రేణులవారు ఉద్రేకాలనే ఝళిపిస్తారు. భారతీయ పౌర సమాజం ఈ చర్చాక్రమంలో ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తుందని, ద్వేషశక్తులకు గట్టి సమాధానం ఇవ్వగలుగుతుందని ఆశించడం తప్ప ఏమీ చేయలేము.


ఎంతటి ఉపద్రవంలోనూ మనుషులు మనుషులుగానే మిగిలి ఉండడానికి మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. దేశవిభజన సరే, ఆ తరువాత ఇంకా కొనసాగుతున్న మతవిద్వేషకాండ సంగతేమిటి? గుజరాత్ గాయాన్ని, న్యూఢిల్లీ నరమేధాన్ని ఎట్లా స్మరించుకోవాలి? మానవీయ సమాజాన్ని నిర్మించడానికి కావలసిన ఆకరాలేమిటి? అందమైన భవితవ్యాన్ని భారత్‌కు ఇవ్వాలంటే ఇప్పటికైనా చేయవలసిన అన్వేషణలు ఇవి.


కె. శ్రీనివాస్