Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ మదిలో సిరివెన్నెల స్మృతులు

సీతారామశాస్ర్తికి జిల్లాతో విడదీయరాని అనుబంధం

కాకినాడ నుంచి వచ్చి అనకాపల్లిలో స్థిరపడిన కుటుంబం

ఏఎంఏఎల్‌ కళాశాలలో హిందీ అధ్యాపకునిగా పనిచేసిన తండ్రి 

సీతారామశాస్ర్తి బాల్యం, విద్యాభ్యాసం సాగింది ఇక్కడే... 

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేస్తుండగా ‘సిరివెన్నెల’ సినిమాలో పాటలు రాసే అవకాశం

విశాఖతో వియ్యం

తరచూ సాహితీ కార్యక్రమాలకు హాజరు

చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టులో రాక

కన్నుమూశారని తెలిసి జిల్లా వాసుల దిగ్ర్భాంతి


అనకాపల్లి టౌన్‌/ఎంవీపీ కాలనీ, నవంబరు 30:

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి విశాఖపట్నం జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన బాల్యం అనకాపల్లిలోనే గడిచింది. ఇక్కడే పదో తరగతి వరకు చదువుకున్నారు. పీయూసీ కోసం కాకినాడ వెళ్లిన ఆయన...డిగ్రీ విశాఖపట్నంలో పూర్తిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేస్తుండగా సినిమాల్లో పాటలు రాసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. తన ప్రతిభా పాటవాలతో అత్యున్నత స్థానానికి ఎదిగిన సీతారామశాస్ర్తి మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి జిల్లా వాసులు తీవ్ర దిగ్ర్భాంతి చెందారు.   


సీతారామశాస్త్రి తల్లిదండ్రులు సీవీ యోగి, సుబ్బలక్ష్మి. వీరు కాకినాడ నుంచి అనకాపల్లి వచ్చి స్థిరపడ్డారు. యోగి అనకాపల్లి ఏఎంఏఎల్‌ కళాశాలలో హిందీ అధ్యాపకునిగా పనిచేసేవారు. యోగి భార్య సుబ్బలక్ష్మి తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌లోని సివిని ప్రాంతంలో ఉండేవారు. 1955 మే 20వ తేదీన సీతారామశాస్త్రి అక్కడే జన్మించారు. పదో తరగతి వరకు అనకాపల్లిలోనే విద్యాభ్యాసం సాగించిన సీతారామశాస్త్రి, ఇంటర్మీడియట్‌ కాకినాడలో, బీఏ ఏయూలో పూర్తిచేశారు. ఎంఏ చేస్తుండగా ‘సిరివెన్నెల’ చిత్రానికి పాట రాసే అవకాశం లభించింది. 1986లో విడుదలైన ఆ సినిమాలో ఆయన రాసిన ‘విధాత తలపున...’ అనే పాట తెలుగు ప్రజల హృదయాలను హత్తుకుంది. అప్పటి నుంచి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా ఖ్యాతి గడించారు. అనకాపల్లిలో వుండగానే పద్మావతిని సీతారామశాస్ర్తి వివాహం చేసుకున్నట్టు పట్టణంలోని నరసింగరావుపేటలో వుంటున్న ఆయన పినతల్లి శేషారత్నం చెప్పారు. సినిమా అవకాశాలు రావడంతో గాంధీనగరంలోని ఇంటిని అమ్మేసి కుటుంబమంతా చెన్నై వెళ్లిపోయారని ఆమె తెలిపారు.


స్థానిక వేల్పులవీధికి చెందిన యర్రంశెట్టి సత్యారావు మాస్టారుతో ఆయనకు ఎంతో అనుబంధం వుండేదని చెబుతున్నారు. అనకాపల్లికి ఎంతో కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చిన  సీతారామశాస్త్రి శ్వాసకోశ వ్యాధితో మంగళవారం మృతి చెందారని తెలుసుకున్న పట్టణంలోని సాహితీవేత్తలు, కళాకారులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. సీతారామశాస్త్రి మృతి తీరని లోటని కళ్యాణి నృత్య సంగీత అకాడమీ వ్యవస్థాపకులు, సంగీత దర్శకుడు ఇంద్రగంటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సిరివెన్నెలకు అనకాపల్లి డైమండ్‌ హిట్స్‌ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందించింది. ఆయన మృతిపై సంస్థ చైర్మన్‌ దాడి రత్నాకర్‌ సంతాపం తెలిపారు. 


కుమార్తెను ఇచ్చింది ఇక్కడే...

ఆయనకు విశాఖలోని ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. అయితే తన సోదరీ, సోదరులను చదివించే బాధ్యత తీసుకోవడంతో కాలేజీలో చేరలేదు. ఎంవీపీ కాలనీలో నివాసం వుండే రచయిత, కళావేదిక కల్చరల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్‌ నండూరి రామకృష్ణ ఆయన వియ్యంకుడు. సిరివెన్నెల తన కుమారై లలితాదేవిని నండూరి రామకృష్ణ కుమారుడు నండూరి వెంకటసాయిప్రసాద్‌కు ఇచ్చి 2001లో పెళ్లి చేశారు. కుమార్తెను చూడడానికి తరచూ ఆయన విశాఖపట్నం వస్తూ ఇక్కడ సాహితీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. డాక్టర్‌ నండూరి రామకృష్ణ రచించిన  నా జీవనయానం ఆటో బయోగ్రఫీ (2019) పుస్తక ఆవిష్కరణలో సిరివెన్నెల పాల్గొన్నారు. అలాగే దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్‌ సతీమణి సౌజన్య కూచిపూడి నాట్య ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. ఇది కళాభారతి ఆడిటరియంలో గత ఏడాది జనవరిలో జరిగింది. చివరిగా ఈ ఏడాది ఆగస్టులో నగరంలోని పౌరగ్రంథాలయంలో జరిగిన ‘కరోనాపై నా కవితాఝరి’ అనే 150 కవితల పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీనిని డాక్టర్‌ నండూరి రామకృష్ణ సంకలనం చేశారు. 


పదిహేను రోజుల క్రితం చూసొచ్చాం

- పినతల్లులు ఇవని శేషారత్నం, ప్రవ సత్యవతి

సీతారామశాస్త్రి మృతిపై ఆయన పినతల్లులు ఇవని శేషారత్నం, ప్రవ సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలోని నరసింగరావుపేటలో సీతారామశాస్ర్తి తమ్ముడు నివాసంలో వుంటున్న వారు మంగళవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. పదిహేను రోజుల క్రితం తాము సీతారామశాస్త్రిని చూసేందుకు హైదరాబాద్‌ వెళ్లానని, కుటుంబసభ్యులు ఆరోగ్యం బాగానే వుందని భయపడొద్దని చెప్పారని తెలిపారు. తమకు అనారోగ్యంగా వుండడంతో అనకాపల్లి వచ్చేశానని ఆమె పేర్కొన్నారు. ఇంతలోనే చావు ముంచుకురావడం తమను తీవ్రంగా కలచివేసిందన్నారు. 


సిరివెన్నెల మృతి సాహితీరంగానికి తీరని లోటు

రచయిత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సాహితీ రంగానికి తీరని లోటని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. మంగళవారం సాయంత్రం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ సీతారామశాస్ర్తి అనకాపల్లికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను మంత్రిగా సీతారామశాస్ర్తికి తొలి నంది అవార్డు ఇవ్వడం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. సీతారామశాస్త్రి తండ్రి సీవీ యోగి, తాను ఏఎంఏఎల్‌ కళాశాలలో హిందీ విభాగంలో అధ్యాపకులుగా పనిచేశామన్నారు. సీతారామశాస్త్రి సాహిత్య రంగంలో విభిన్నమైన ప్రయాణం చేశారన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున

నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్యఘర్షణ

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది యింతకన్న సైన్యముండునా

ఆశనీకు అస్త్రమౌను శ్వాసనీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధవునురా

నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి.

- సిరివెన్నెల సీతారామశాస్త్రి

Advertisement
Advertisement