Abn logo
Dec 2 2020 @ 00:24AM

మెగా పారిశ్రామిక హబ్‌కు శ్రీకారం

3155 ఎకరాలు కేటాయింపు

2.5 లక్షల మంది యువతకు ఉపాధే లక్ష్యం


ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కడప, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కడప నగర సమీపంలో 3155 ఎకరాల్లో మెగా పారిశ్రామిక హబ్‌(ఎంఐహెచ్‌) అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం సీకేదిన్నె, వల్లూరు, పెండ్లిమర్రి మండలాల పరిధిలో కొప్పర్తి, తాడిగొట్ల, యాదవపురం, తోళ్లగంగన్నపల్లె, అంబవరం, రంపతాడు గ్రామాల్లోని ఏపీఐఐసీకి చెందిన 3,155 ఎకరాలు కేటాయిస్తున్నారు. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మంది యువతకు ఉపాధే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్నారు. వెనుకబడిన కడప జిల్లాలో ఈ హబ్‌ ఏర్పాటువల్ల విలువైన ఖనిజ సంపద, వనరులు సద్వినియోగంలోకి వస్తాయని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ హబ్‌కు 10 కి.మీ పరిధిలో కర్నూలు-రాణిపేట వయా కడప జాతీయ రహదారి, 6 కి.మీ దూరంలో కడప విమానాశ్రయం, 145 కి.మీ దూరంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, 13 కి.మీ దూరంలో రైల్వేస్టేషన్‌ ఉంది. ఇది వైఎస్‌ఆర్‌ జగనన్న పారిశ్రామిక హబ్‌గా ఏర్పడనుంది. వివిధ పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే పారిశ్రామిక సంస్థలకు ఏపీఐఐసీ భూమిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్ల వరకు లీజుకు ఇస్తారు. మొదటి లావాదేవీలు, అమ్మకపు, లీజుపై స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ వందశాతం రాయితీ ఉంటుంది. 24 గంటలు విద్యుత్‌ సరఫరాతో పాటు 55 ఏళ్లు యూనిట్‌కు రూ.1 సబ్సిడీ, ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంటు 20 శాతం (రూ.10 కోట్ల వరకు) రాయితీ ఉంటుంది. రూ.500 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే సంస్థలకు మెగా ప్రాజెక్టులుగా హోదా కల్పిస్తామని ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి కరికల వలవన్‌ మంగళవారం జారీ చేసిన జీవోఎంఎస్‌ నెం.87లో స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
Advertisement