Abn logo
Oct 15 2021 @ 00:52AM

పునాదుల్లోనే..

పునాదుల దశ దాటని నిర్మాణ పనులు

మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనుల్లో జాప్యం

పరిమితంగానే కార్మికులు.. యంత్రాలు


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : మచిలీపట్నంలో మెడికల్‌ కళాశాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలోని 24 ఎకరాలను, పక్కనే ఉన్న మరో 40 ఎకరాలను కళాశాల నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం సేకరించింది. నిర్మాణ పనులను మెఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థకు కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ జూమ్‌ యాప్‌ ద్వారా పనులకు శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబరు 31కి పూర్తి చేయాలని ఒప్పందం కుదిరింది. పనులు ప్రారంభించి నాలుగు నెలలు కావస్తున్నా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఆంధ్రజ్యోతి పరిశీలించగా, 20 మంది కార్మికులతోపాటు, మూడు ఎక్స్‌కవేటర్లు, నాలుగు ట్రాక్టర్లు మాత్రమే కనిపించాయి.


13.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు 

మచిలీపట్నం మెడికల్‌ కళాశాల నిర్మాణ అంచనా రూ.550 కోట్లు. 13.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను నిర్మించాల్సి ఉంది. హెచ్‌-1 నుంచిఐదు బ్లాక్‌లలో ఆసుపత్రి భవనాలను నిర్మించాల్సి ఉంది. హెచ్‌-6 నుంచి హెచ్‌-10 వరకు ఉన్న బ్లాక్‌లలో బయోమెడికల్‌ వేస్ట్‌, మార్చురీ, సీ-1, సీ-2 బ్లాక్‌లలో మెడికల్‌ కళాశాల, సీ-3లో నర్సింగ్‌ కళాశాల, ఆర్‌-1 నుంచి ఆర్‌-6 బ్లాక్‌లలో విద్యార్థుల హాస్టల్‌,  ఆర్‌-7లో రెసిడెంట్స్‌ హాస్టల్‌, ఆర్‌-8 నుంచి 11 వరకు ఇంటర్‌నీస్‌ హాస్టల్‌, ఆర్‌-7 నుంచి 10 వరకు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ క్వార్టర్స్‌, ఆర్‌-9 నుంచి 14 వరకు నర్సుల హాస్టల్‌, ఆర్‌-15 బ్లాక్‌లో స్టాఫ్‌ నర్సుల గదులు, ఎ-1, ఎ-2, ఎ-3 బ్లాక్‌లలో గెస్ట్‌హౌస్‌, కిచెన్‌ కం డైనింగ్‌ హాల్‌, సెక్యూరిటీ భవనం నిర్మాణాలు చేయాల్సి ఉంది. ఈ నమూనా  ఘనంగానే ఉన్నా పనులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. వ్యవసాయ పరిశోధనా క్షేత్రం పక్కనే ఉన్న భూమిలో ఒక భవన నిర్మాణానికి అవసరమైన పునాదులను తవ్వి, కంకరపోశారు. ప్రధాన గేటు వద్ద ఉన్న ఖాళీలో నాలుగైదు ట్రాక్టర్ల ద్వారా కంకరను తరలిస్తున్నారు. అంతకు మించి అక్కడ పనులేవీ జరగడం లేదు.   ప్రభుత్వం తీసుకున్న భూమిలో అక్కడక్కడా మట్టి పనులు చేసి నిలిపివేశారు. సరిపడినంత మంది కార్మికులు, అవసరమైనంత మెటిరియల్‌ లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.