May 9 2021 @ 12:35PM

మే 9.. మాకెంతో ప్రత్యేకం: వైజయంతీ మూవీస్

మే 9వ తేది ఎంతో ప్రత్యేకమైనదని.. ఈ తేదీతో ఉన్న అనుబంధం ఎప్పటికీ నిలిచిపోతుందని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ఇదే తేదీన రిలీజై సంచలన విజయాలను అందుకున్న సినిమాలను ట్విట్టర్‌లో వెల్లడించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు డైరెక్ష‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి - అందాల తార శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ - హన్సిక మొత్వాని జంటగా మెహ‌ర్ ర‌మేశ్ తెరకెక్కించిన కంత్రి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిప‌ల్లి రూపొందించిన మహర్షి, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలలో మహానటి సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలు వైజయంతీ మూవీస్ నిర్మాణంలో రూపొంది మే 9వ తేదీన విడుదలయ్యాయి. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమాలు పెద్ద కమర్షియల్ సక్సెస్‌ను సాధించి నిర్మాణ సంస్థ యెక్క ప్రతిష్ఠను మరింతగా పెంచాయి. అందుకే కొన్ని వేల సంవత్సరాలు గుర్తుండిపోయో జ్ఞాపకాలను ఈ నాలుగు సినిమాలు మే 9న రిలీజై ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.