Abn logo
Aug 7 2020 @ 00:27AM

యూరోపియన్ రాజనీతిజ్ఞులు

చితికిపోయిన ఒక జాతిని -సర్వనాశనమైన ఒక జాతిని-సర్వనాశనమైన ఒక దేశాన్ని -పదిహేను సంవత్సరాలలో తిరిగి ఒక మహారాజ్యంగా చేయడం అత్యద్భుత విషయం. ఇంత స్వల్పకాలంలో అంత గొప్ప ఘనవిజయాన్ని సాధించిన జర్మన్ రాజనీతిజ్ఞుడు డాక్టర్ అడెనోవర్.


‘బిస్మార్క్ తర్వాత ఆయన జర్మనులలో మహా రాజనీతిజ్ఞుడు’ అని బ్రిటిష్ కామన్స్ సభలో విన్‌స్టన్ చర్చిల్ కొన్నేళ్లు క్రితం డాక్టర్ అడెనోవర్‌ను ప్రస్తుతించారు. మరొక జర్మన్ ప్రముఖునితో పోల్చవలెనంటే, అడెనోవర్ను బిస్మార్క్ తర్వాత పేర్కొనడం సముచితమే. కానీ, ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఘోరపరాజయం చెందిన తర్వాత ఛాన్సలర్ పదవిని స్వీకరించిన డాక్టర్ అడెనోవర్ మాతృదేశానికి చేసిన ప్రత్యేక సేవలను దృష్టిలో పెట్టుకొన్న పక్షంలో ఆయనకు దగ్గర పోలిక బిస్మార్క్‌తో కాదు, నెపోలియన్ చక్రవర్తి పతనం తర్వాత ఫ్రాన్సు పునరుద్దీపనకు తోడ్పడిన త్యాలీ రాన్తో. 


స్వభావానికి సంబంధించినంతవరకు బిస్మార్క్తో గాని, త్యాలీ రాన్ తో గాని అడెనోవర్తో సాపత్యం లేదు. బిస్మార్క్ ధర్మ సంకోచాలు లేనివాడు. న్యాయమో, అన్యాయమో, తనకు కావలసింది కార్యసాధన మాత్రమే. ఆయన మాట కరకు, చేతలు కరకు, చిత్తమే కరకు. పైగా, ఇరుగుపొరుగు రాజ్యాలపై దెబ్బతీసి, వాటికి తలవంపులు తెచ్చి, జర్మనీ అధికారాన్ని నిరూపించడానికి ఆయన ప్రయత్నించాడే తప్ప, అడెనోవర్ వలె పశ్చిమ యూరోపియన్ రాజ్యాలు కలిసి బ్రతుకకపోతే, కడగండ్ల పాలు కాగలవని గుర్తించలేదు. బిస్మార్క్ కాలం నాటికి జాతీయతా భావానికే అత్యధిక ప్రాబల్యం కలదనుకోండి. అయినా అంతర్జాతీయత మరింత విశాల లక్ష్యమని, మున్ముందు దానినే ప్రపంచం అనుసరించవలసివస్తుందని, చూచాయగా నైనా ఆయన గ్రహించలేదు. నెపోలియన్ పతనం తర్వాత ఘోర నిస్సహాయ స్థితిలో పడిపోయిన ఫ్రాన్స్ ప్రతినిధిగా వియన్నా కాంగ్రెస్కు వెళ్ళిన త్యాలీ రాన్ తన రాజకీయ ప్రతిభా ప్రాగల్భ్యాలతో తనకు, తన దేశానికి అపూర్వ విజయాలను సాధించాడు. పరాజిత దేశ ప్రతినిధిగా తనను చులకన చేయగోరిన వారి నుంచి విజేతలను మించిన మర్యాద మన్ననలను పొంది ఆయన స్వదేశానికి తిరిగి వచ్చాడు. త్యాలి రాన్ పాల్గొన్న కాంగ్రెస్ నిర్ణయాలు యూరప్ ఖండాన్ని దాదాపు ఒక శతాబ్దం పాటు మహాయుద్ధం నుంచి కాపాడగలగినవన్న విషయం కూడా ఈ సందర్భంలో పేర్కొనదగినట్టిదే. నెపోలియన్ పతనం తర్వాత ఫ్రాన్స్కు త్యాలీ రాన్ చేసిన మహత్తర సేవను పోలిన దాన్ని హిట్లర్ పతనం తర్వాత జర్మనీకి అడెనోవర్ చేశాడు. 1949లో ఆయన పశ్చిమ జర్మనీ ఛాన్సలర్ పదవిని స్వీకరించినప్పుడు అది పోరులో ఓడిపోయి, కూడు గుడ్డలకైనా గతిలేని దేశం. ‘రేపు’ అనేది మరి లేదన్నట్టుగా లోకం సంభావించిన దేశం. అదే ఈనాడు- అడెనోవర్ పదవీ విరమణ చేస్తున్ననాడు- సకల సంపత్తులతో తులదూగుతున్న ఒక శక్తిమంతమైన రాజ్యం. 


ఏమైనా 72 యేట గురుతర బాధ్యతను స్వీకరించి, చితికిపోయిన ఒక జాతిని -సర్వనాశనమైన ఒక జాతిని- సర్వనాశనమైన ఒక దేశాన్ని -పదిహేను సంవత్సరాలలో తిరిగి ఒక మహారాజ్యంగా చేయడం అత్యద్భుత విషయం. ఇంత స్వల్పకాలంలో అంత గొప్ప ఘనవిజయాన్ని సాధించడం ద్వారా డాక్టర్ అడెనోవర్ జీవితం ధన్యమైంది.


1963 అక్టోబర్ 17 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘డాక్టర్ అడెనోవర్’ నుంచి

Advertisement
Advertisement
Advertisement