హైదరాబాద్ : గ్రేటర్ పోలింగ్ పలు చోట్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరేమో తన ఓటు హక్కు ఎవరో వినియోగించుకున్నారని గగ్గోలు పెడుతుంటే.. మరికొందరు పోలింగ్ స్లిప్పుల విషయంలో గొడవలకు దిగారు. అయితే నగరంలోని ఓల్డ్ సిటీలో భారీగా ఓట్లు గల్లంతు అయ్యాయి. పలుచోట్ల ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు కనిపించడం గమనార్హం. మరోవైపు.. కుటుంబంలో కొందరి పేర్లు మాత్రమే జాబితాలో ఉన్నాయని.. మరికొందరి పేర్లు గల్లంతు అయ్యాయని ఓటర్లు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఓట్లు తొలగించారని బాధితులు మండిపడుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకూ ఎన్నికలు అధికారులెవ్వరూ స్పందించలేదు.
కలకలం..
ఇలా గ్రేటర్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఓటు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఓటు గల్లంతైంది. దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. పలు చోట్ల పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. జియాగూడ పోలింగ్ బూత్ నెం.38లో ఓట్లు గల్లంతవడం కలకలం రేపుతోంది. మొత్తం 914 ఓట్లకు 657 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఆన్లైన్ ఓటర్ లిస్ట్‌లో ఓటు ఉన్నా.. పోలింగ్ బూత్ వద్ద లిస్ట్‌లో చూపించడం లేదని ఓటర్ల ఆందోళనకు దిగారు. ఓటర్ స్లిప్‌లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రశాంతంగానే పోలింగ్..
గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ అంజనీకుమార్ మాట్లాడారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు కొనసాగుతోందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అంజనీకుమార్ హెచ్చరించారు.