Abn logo
Oct 22 2021 @ 01:50AM

బిలియన్ డోసుల బృహత్ విజయం

భారతదేశం టీకాల కార్యక్రమంలో అప్రతిహత విజయం సాధించింది. ప్రారంభించిన 9 నెలల్లో 2021 అక్టోబరు 21నాటికి దేశవ్యాప్తంగా 100 కోట్ల టీకాల మైలురాయిని ఈ కార్యక్రమం అధిగమించింది. కొవిడ్‌-19పై సమష్టి పోరులో ముఖ్యంగా 2020 తొలినాళ్ల నాటి పరిస్థితుల దృష్ట్యా ఇదొక అత్యద్భుత విజయ ప్రస్థానం. దాదాపు వందేళ్ల తర్వాత మానవాళి ఇంతటి పెనువిపత్తును ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా ఈ వైరస్‌ గురించి ప్రపంచానికి ఏమాత్రం తెలియదు. అలాంటప్పుడు పరిస్థితి ఎంత అనూహ్యంగా కనిపించిందో మనం గుర్తుచేసుకోవచ్చు. వేగంగా రూపాంతరం చెందుతున్న అపరిచిత, అదృశ్య శత్రువుతో మనం పోరాడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మన పయనం ఆందోళన నుంచి ఆనందానికి భరోసా దిశగా సాగి, జాతి మరింత బలంగా ఆవిర్భవించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమం ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది.


సమాజంలోని బహుళ వర్గాల కృషిని ప్రోదిచేయడం నిజంగా ఓ భగీరథ ప్రయత్నమే. ఇది ఎంత భారీ ప్రయత్నమో తెలుసుకోవడానికి ఒక ఊహాత్మక అంచనా వేసుకుందాం. ప్రతి టీకా వేయడానికి ఒక ఆరోగ్య కార్యకర్తకు 2 నిమిషాలు పట్టిందనుకుందాం. ఈ వేగంతో వెళ్తే ప్రస్తుత మైలురాయిని అందుకోవడానికి సుమారు 41 లక్షల పనిదినాలు లేదా 11వేల పని సంవత్సరాలు పడుతుంది! అయితే, ఏ ప్రయత్నంలోనైనా నిలవాలన్నా, వేగం నిలబెట్టుకోవాలన్నా భాగస్వాములందరి విశ్వాసం అత్యంత కీలకం. ఒకవైపు ప్రజల్లో అపనమ్మకం, భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు సాగినప్పటికీ టీకాలతోపాటు సంబంధిత ప్రక్రియపై జనంలో ఎంతో నమ్మకం. అదీ అమిత వేగంగా పుంజుకోవడమే ఈ కార్యక్రమ విజయానికి ఒక కారణం. కేవలం దైనందిన అవసరాలకైనా విదేశీ బ్రాండ్లను మాత్రమే విశ్వసించే వారు కొందరుంటారు. కానీ, కొవిడ్‌-19 టీకా విషయంలో మాత్రం భారత పౌరులు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ టీకాలపై ఏకగ్రీవ ఆమోదముద్ర వేశారు. కచ్చితంగా ఇదొక వినూత్న మార్పు.


జన భాగస్వామ్యం స్ఫూర్తితో ఉమ్మడి లక్ష్యం దిశగా ప్రభుత్వం, ప్రజలు ఏకోన్ముఖులై ముందడుగు వేస్తే దేశం ఎంతటి ఘన విజయాన్ని అందుకోగలదో మన టీకాల కార్యక్రమం నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. 


భారతదేశం టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినపుడు మన 130 కోట్ల ప్రజానీకం సామర్థ్యాన్ని అనేకమంది తక్కువగా అంచనా వేశారు. పౌరులందరికీ టీకా ఇవ్వాలంటే కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుందని కొందరు జోస్యం కూడా చెప్పారు. టీకాలు తీసుకోవడానికి జనం ముందుకు రాబోరని ఇంకొందరు భవిష్యవాణి వినిపించారు. మరికొందరైతే టీకాల ప్రక్రియలో గందరగోళం, దుర్వినియోగం తప్పవని ఏకంగా అమంగళం పలికారు. ఇంకా కొందరు టీకాల సరఫరా ప్రక్రియ నిర్వహణ అసాధ్యమని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ప్రజలు విశ్వసనీయ భాగస్వాములైతే జనతా కర్ఫ్యూ, తదుపరి దిగ్బంధ చర్యలు ఎంతటి సత్ఫలితాలిస్తాయో మనమంతా ప్రత్యక్షంగా చూశాం.


కర్తవ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను స్వీకరిస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. ఆ మేరకు మన ఆరోగ్య కార్యకర్తలు కొండలెక్కారు.. నదులు దాటారు.. అత్యంత దుర్గమమైన మారుమూల ప్రదేశాలకు వెళ్లి మరీ ప్రజలకు టీకాలు వేశారు. ఈ ఘనత సాధించడంలో మన యువతరం, సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక-, ఆధ్యాత్మిక నాయకులు అందరూ భాగస్వాములే. ముఖ్యంగా ప్రపంచంలోని అగ్రదేశాల్లో టీకాలపై తలెత్తిన సందేహాల స్థాయితో పోలిస్తే మన దేశంలో అది అత్యంత స్వల్పం కావడం గమనార్హం. టీకాలు వేయడంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడంపై భిన్నవర్గాల ప్రయోజనాల మధ్య తీవ్ర ఒత్తిడి తలెత్తింది. అయినప్పటికీ ప్రభుత్వం మన ఇతర పథకాల్లాగా టీకాల ప్రక్రియలో ‘వీఐపీ’ సంస్కృతికి తావేలేదని ఘంటాపథంగా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2020 తొలినాళ్లలో కొవిడ్‌–19 మహమ్మారి విజృంభించినపుడు, ఈ మహమ్మారిపై పోరాటంలో టీకాల తోడ్పాటే ప్రధాన ఆయుధం కాగలదని మాకు స్పష్టమైంది. తదనుగుణంగా ఆదినుంచీ సంసిద్ధతా చర్యలు చేపట్టాం. అందులో భాగంగా నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి 2020 ఏప్రిల్‌ నుంచే మార్గ ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టాం.


నేటికీ ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే సొంతంగా టీకాలు రూపొందించుకున్నాయి. ఆ మేరకు 180కి పైగా దేశాలు ఇప్పటికీ పరిమిత ఉత్పత్తిదారుల సమూహంపై ఆధారపడి ఉన్నాయి. డజన్లకొద్దీ దేశాలు టీకాల సరఫరా కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. కానీ, భారతదేశం అంతలోనే 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించింది! భారత్‌కు సొంత టీకా లేకపోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి.. ఇంత భారీ జనాభా కోసం టీకాలను ఎక్కడినుంచి తెచ్చుకోగలం? అందుకు ఎన్ని సంవత్సరాలు పట్టి ఉండేది? ఈ సందర్భంగా సకాలంలో స్పందించిన భారత శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకే ఈ ఘనత చెందాలి. వారి ప్రతిభాపాటవాలు, కఠోర శ్రమతో భారతదేశం టీకాల విషయంలో నిజంగా ‘స్వయం సమృద్ధం’ కాగలిగింది. ఇంత భారీ జనసంఖ్య కోసం టీకాల డిమాండ్‌కు అనుగుణంగా మన టీకాల తయారీదారులు ఎవరికీ తీసిపోని రీతిలో ఉత్పాదన పెంచుతున్నారు.


దేశం ముందడుగు వేయడంలో ప్రభుత్వాలే నిరోధకాలన్న భావన నెలకొన్న మన దేశంలో మా ప్రభుత్వం తద్భిన్నంగా ప్రగతికి వేగ చోదకంగా, సమర్థ కారకంగా రూపుదాల్చింది. ఆదినుంచీ టీకాల తయారీదారులతో భాగస్వామ్యానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. వ్యవస్థాగత తోడ్పాటు, శాస్త్రీయ పరిశోధన, నిధుల లభ్యతసహా నియంత్రణ ప్రక్రియలను వేగవంతం చేయడం వంటి రూపాల్లో అండగా నిలిచింది. ‘సంపూర్ణ ప్రభుత్వం’ అన్నదే తారకమంత్రంగా మంత్రిత్వ శాఖలన్నీ ఒక్కతాటిపై నిలిచి, టీకా తయారీదారులకు ఎదురయ్యే అవరోధాలను తొలగిస్తూ వచ్చాయి. భారత్‌ వంటి సువిశాల దేశంలో టీకాలను కేవలం ఉత్పత్తి చేస్తే సరిపోదు. నిరంతర రవాణా సదుపాయంతోపాటు చివరి అంచెవరకూ చేర్చగల సామర్థ్యం కూడా ప్రధానమే. ఈ దిశగా సవాళ్లను అవగతం చేసుకోవడంలో భాగంగా ఒక టీకా బుడ్డీ ప్రయాణాన్ని ఒకసారి ఊహించుకుందాం. పుణె లేదా హైదరాబాద్‌లోని కర్మాగారం నుంచి ఆ బుడ్డీని ఏదైనా రాష్ట్రంలోని కూడలికి చేర్చాలి. అక్కడినుంచి జిల్లా కేంద్రంలోని కూడలికి ఆపైన టీకాలు వేసే కేంద్రానికి అది చేరాలి. ఇందుకోసం విమానాలు, రైళ్లు వేలాది ట్రిప్పులు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. పైగా ఈ మొత్తం ప్రయాణంలో కేంద్రీకృత పర్యవేక్షణలో నిర్ణీత ఉష్ణోగ్రతను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ మేరకు దేశవ్యాప్తంగాగల లక్షకుపైగా శీతల నిల్వ పరికర సదుపాయాలను వాడుకున్నాం. టీకాల సరఫరా సమయం గురించి రాష్ట్రాలకు ముందస్తు సమాచారం ఇచ్చి, తద్వారా టీకాల కార్యక్రమంపై మెరుగైన సంసిద్ధతకు వీలు కల్పించాం. తదనుగుణంగా టీకాలు నిర్దేశిత రోజుల్లో వారికి చేరాయి. స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ ఎరుగని అకుంఠిత దీక్షకు ఇది నిదర్శనం.


ఈ కృషి మొత్తానికీ వేగవంతమైన ‘కో-విన్‌’ వేదిక ఎంతగానో తోడ్పడింది. టీకాల కార్యక్రమం సమానంగా, అంచనాలకు- అనుసరణకు తగినట్లుగా, పారదర్శకంగా, వేగంగా సాగిపోవడంలో దీని పాత్ర అమోఘం. వరుస తప్పి రావడం, ఆశ్రిత పక్షపాతం వంటివాటికి ఇది తావులేకుండా చేసింది. ఓ పేద కార్మికుడు తొలి మోతాదును తన గ్రామంలో స్వీకరించి, నిర్దేశిత వ్యవధి తర్వాత అదే టీకా రెండో మోతాదును తాను పనిచేసే నగరంలో తీసుకునే వెసులుబాటు కలిగింది. దీంతోపాటు పారదర్శకతకు ఊతమిస్తూ ఎప్పటికప్పుడు ‘క్యూఆర్‌’ కోడ్‌ సహిత ధ్రువీకరణ పత్రాల జారీ కూడా పూర్తి చేయబడింది. భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే ఇలాంటి ఉదాహరణలు ఇంకెక్కడా లేవంటే అతిశయోక్తి కాబోదు. 


మన దేశం వేగంగా ముందడుగు వేస్తున్నదని, ఇందుకు ‘భారత జట్టు’ చోదకంగా ఉన్నదని నేను 2015లో నా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించాను. ఈ ‘భారత జట్టు’లో 130 కోట్లమంది భారతీయులూ సభ్యులే. ప్రజా భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం. ఆ మేరకు 130 కోట్లమంది భారతీయుల భాగస్వామ్యంతో మన దేశాన్ని నడిపిస్తే ప్రతి క్షణానికీ భారత్‌ 130 కోట్ల అడుగులు ముందుకు వేస్తుంది. మన టీకాల కార్యక్రమం ఈ ‘భారత జట్టు’ సత్తాను మరోసారి ప్రపంచానికి ఘనంగా చాటింది. టీకాల కార్యక్రమంలో భారత్‌ విజయంతో ‘ప్రజాస్వామ్యం ప్రభావం చూపగలద’ని మొత్తం ప్రపంచానికి నేడు అవగతమైంది. ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమంలో మన విజయం యువతరంలో మరింత ఉత్తేజం నింపగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే మన ఆవిష్కర్తలు, అన్ని స్థాయిలలోని ప్రభుత్వ విభాగాలు ప్రజలకు సేవా ప్రదానంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పగలవని పూర్తిగా నమ్ముతున్నాను. ఇది మన దేశానికే కాదు.. ప్రపంచానికే ఆదర్శప్రాయం కాగలదని నొక్కి చెబుతున్నాను.

నరేంద్ర మోదీ

భారతప్రధాని