Abn logo
May 4 2021 @ 03:44AM

గ్రేటర్‌లో సామూహిక దహనాలు

  • పెరుగుతున్న కొవిడ్‌ మృతులు.. అర్ధరాత్రి అంత్యక్రియలు 
  • లోయర్‌ ట్యాంక్‌బండ్‌ శ్మశాన వాటికలో..
  • ఒకేసారి ఏడెనిమిది మృతదేహాల దహనం
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌


హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ, మే 3 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని పలు శ్మశాన వాటికల్లో హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపించడం కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి నిదర్శనం. తెలంగాణలోనూ మహమ్మారి మహోగ్ర రూపం దాల్చింది. నిత్యం వేలాది కేసులు నమోదవుతుండగా.. అధికారిక లెక్కల ప్రకారం 50కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అంతర్గత సంభాషణల్లో అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం కొవిడ్‌తో మృతి చెందుతున్న వారి సంఖ్య 100-130కి చేరిందని సమాచారం. గ్రేటర్‌లోని పలు శ్మశాన వాటికల్లో జరుగుతున్న దహన సంస్కారాలే ఇందుకు నిదర్శనం. మరణాలు పెరుగుతుండటంతో ఇక్కడా సామూహిక దహనాలు జరుగుతున్నాయి. స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో అర్ధరాత్రి కొవిడ్‌ మృత దేహాలను దహనం చేస్తున్నారు. స్థానికులు అడ్డుకోకుండా ఒక్కోసారి పోలీసుల సాయం కోరాల్సి వస్తుందని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. పలు శ్మశాన వాటికల్లో ఒకేసారి ఐదారు మృత దేహాలను దహనం చేస్తున్నారు. 


లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని శ్మశాన వాటికలో ఒకేసారి ఏడెనిమిది మృతదేహాల దహనం జరుగుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. రాత్రి 10 దాటగానే శ్మశాన వాటిక వద్ద మృతదేహాలతో అంబులెన్స్‌లు బారులు తీరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కట్టెలు అందుబాటులో లేకుంటే పెట్రోల్‌ పోసి తగులబెడుతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఒక్కో మృతదేహం దహనం చేస్తే.. తెల్లవారి స్థానికులు అభ్యంతరం తెలిపే అవకాశమున్న దృష్ట్యా... ఒకేసారి వేర్వేరు చితుల మీద అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మృతదేహాల దహనంతో తమకు ఎక్కడ వైరస్‌ సోకుతుందేమో అన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అధికారులు మాత్రం.. దహనం చేయడం వల్ల వైరస్‌ బయటకు వ్యాప్తి చెందే అవకాశం ఉండదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నగరంలోని ఈఎ్‌సఐ, బన్సీలాల్‌పేట, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కవాడిగూడ, మహా ప్రస్థానంతోపాటు అంబర్‌పేటలోని విద్యుత్‌ దహన వాటిక, జల్‌పల్లిలోని కబ్రిస్తాన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోని శ్మశాన వాటికల్లోనూ కొవిడ్‌ మృతదేహాల దహనం జరుగుతోంది.

Advertisement
Advertisement
Advertisement