Abn logo
Sep 25 2021 @ 01:57AM

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

మృతి చెందిన సల్మా

చంద్రగిరి, సెప్టెంబరు 24: చంద్రగిరి మండలం ఎ.రంగంపేట పంచాయతీ ముస్లింపేటలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామస్తుల కథనం మేరకు.. ముస్లింపేటకు చెందిన అబ్దుల్‌ రహీం కుమారుడు సమీర్‌బాషాకు పులిచెర్ల మండలం తురకపేటకు చెందిన నవనీర్‌, బాబు దంపతుల కుమార్తె సల్మా(18)తో ఏడాది కిందట వివాహమైంది. వీరికి ఆరు నెలల పాప ఉంది. బాబు మేస్త్రీ పనులు చేసుకుంటున్నారు. ముస్లింపేటలో బాబు, సల్మా దంపతులు, అతడి తండ్రి అబ్దుల్‌రహీం ఉంటున్నారు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం సల్మా ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త, మామ చుట్టుపక్కల వారికి తెలిపారు. గ్రామస్థులు వచ్చి చూసేటప్పటికి సల్మా మృతి చెంది ఉన్నారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో ఏఎస్‌ఐ రవి, సిబ్బంది వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించి, బాబును విచారించారు. తన భార్య పురుగు కాటుకు గురై మృతి చెందిందని బాబు చెప్పారు. కాగా, కువైత్‌లో ఉంటున్న సల్మా తల్లి నవనీర్‌ శుక్రవారం ఉదయం వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కాగా, మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పగా.. తమకు ఎలాంటి కేసులు వద్దని నవనీర్‌ చెప్పడంతో వారు వెనుదిరిగారు.