Advertisement
Advertisement
Abn logo
Advertisement

...మారాలి జగన్‌!

‘రావాలి జగన్‌- కావాలి జగన్‌’ అని ప్రజలు పలవరించి రెండున్నరేళ్లు దాటింది. ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అని ప్రజలను వేడుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్మోహన్‌ రెడ్డి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు గానీ, ఆ వెంటనే ప్రజావేదికలో ఏర్పాటు చేసిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో గానీ జగన్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని విన్నవారు అవినీతికి తావులేని ఆదర్శపాలన అందిస్తారని, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని బలంగా నమ్మారు. అదే సమయంలో ప్రజావేదికను యుద్ధప్రాతిపదికన కూల్చివేయించడం గమనించిన వాళ్లు జగన్‌ ఆలోచనలను అర్థం చేసుకోలేకపోయారు. నవరత్నాల పేరిట ప్రజాధనం పంపిణీ జాతరకు తెరతీయడంతో రాష్ట్రంలో సంక్షేమరాజ్యం వచ్చిందని పలువురు భావించారు. రెండున్నరేళ్లు గడిచేసరికి ఇలా భావించిన వారందరూ నెత్తీనోరూ బాదుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కక్షలు, కార్పణ్యాలతో అధికార దుర్వినియోగాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్లారు. వ్యవస్థల విధ్వంసం సంపూర్ణంగా జరిగిపోయింది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను వేటాడే కార్యక్రమానికి తెర తీశారు. మూడు రాజధానుల ఆలోచనను తెర మీదకు తెచ్చి రాజధాని అమరావతిని చంపేశారు. బూతులను అధికారభాషగా మార్చిపడేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేసి అప్పులకుప్పగా మార్చేశారు. దీంతో ‘రావాలి జగన్‌- కావాలి జగన్‌’ అని నినదించిన నోళ్లు మూగబోయాయి. రావాలి జగన్‌ అన్న వాళ్లలో పలువురు ‘పోవాలి జగన్‌’ అని గొంతు ఎత్తడం మొదలైంది. తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ఒక ముఖ్యమంత్రిపై కేవలం రెండున్నరేళ్లలోనే ఇంత వ్యతిరేకత ఏర్పడడానికి కారణం స్వయంకృతాపరాధమే. మాట తప్పను అంటూనే జగన్‌రెడ్డి పదే పదే నాలుక మడత వేశారు. మడమ తిప్పను అన్న పెద్దమనిషికి తరచుగా కాలు బెణుకుతూనే ఉంది. అవినీతికి తావులేని పాలన అందిస్తానని నమ్మబలికిన జగన్‌రెడ్డి అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని కలెక్టర్లు, ఎస్పీలకు హితవు చెప్పిన వ్యక్తి ప్రభుత్వ యంత్రాంగాన్ని బానిసవ్యవస్థగా మార్చేశారు. పోలీసులకు పార్టీ కార్యకర్తలుగా శిక్షణ ఇప్పించారు. గిట్టనివారిపై జేసీబీ, ఏసీబీ, పీసీబీలను ప్రయోగించారు. రాష్ట్రంలో అక్రమకట్టడాలు ఉండకూడదని సుభాషితాలు పలికి ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయించిన జగన్‌రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులకు చెందిన కొన్ని భవనాల కూల్చివేతకే జేసీబీలను పరిమితం చేశారు. ఏసీబీ కేసులతో హడలెత్తించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో బంధించారు. ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలు, కంపెనీలపైకి పీసీబీని ప్రయోగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్‌రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం అనే మత్తుమందు ఇచ్చి పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో కనీవినీ ఎరుగని ఆలోచనలకు తెర తీశారు. మూడు రాజధానుల నిర్మాణం అటుంచి మూడు టాయిలెట్లు కూడా నిర్మించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కాంగ్రెస్‌ నాయకుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించినా, పాలనలో జగన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించే పరిస్థితి వచ్చినా అందుకు ఆయనే కారణం. జగన్‌రెడ్డి అనే ఐదు అడుగుల ఐదు అంగుళాల మనిషి గురించి ఎన్నికల ముందు వరకు చాలా మందికి తెలియదు. తండ్రి రాజశేఖరరెడ్డి బాటలోనే పరిపాలిస్తారని భ్రమించారు. రాజశేఖరరెడ్డికి ఆత్మబంధువులుగా ఉన్నవారు, అత్యంత ఆత్మీయులలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన వెంట నడవకపోవడానికి కారణం ఏమిటని ఎవరూ ఆలోచించలేదు. ఏళ్ల తరబడి కాలికి బలపం కట్టుకుని ఆ యాత్రా ఈ యాత్రా అంటూ తిరుగుతున్న జగన్‌ను చూసి జాలిపడ్డారు. అతడిలో అంతర్ముఖుడిని చూడలేకపోయారు. దీంతో గంపలకొద్దీ ఓట్లు వేసి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత తానేమిటో ప్రతి సందర్భంలోనూ జగన్‌రెడ్డి ప్రజలకు తెలియజెపుతూనే ఉన్నారు. అర్థం చేసుకున్నవాళ్లు అవాక్కయ్యారు. అర్థంకాని వాళ్లతో పాటు వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్న వాళ్లు మాత్రం భజనబృందంగా కొనసాగుతున్నారు. రాష్ట్రం సర్వనాశనం అయిందని దేశవ్యాప్తంగా అభిప్రాయం ఏర్పడింది. తాజా వరదల్లో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని, ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో అంతర్జాతీయ కేస్‌ స్టడీగా ఈ సంఘటన మిగిలిపోతే అప్రతిష్ఠ కాదా అంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పార్లమెంటు సాక్షిగా కడిగిపారేశారు. అందినచోటల్లా అప్పులు చేస్తూ రాష్ర్టాన్ని ఆర్థికంగా కోలుకోలేని దుస్థితికి దిగజార్చారు. 1953 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చేసిన అప్పు మూడు లక్షల కోట్ల రూపాయలు కాగా, జగన్‌రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనలోనే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారంటే రాష్ట్రం ఎటు పోతోందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక నిర్వహణలో రాజ్యాంగ నియమాలను, చట్టాలను అతిక్రమిస్తున్నారని ‘కాగ్‌’ సైతం ఆక్షేపిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా పోయింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు స్వతంత్రులుగా పనిచేయలేని పరిస్థితులు కల్పించారు. వాస్తవానికి మనకు నిత్యం ఎదురయ్యే కేరక్టర్లలో జగన్‌లాంటి కేరక్టర్లు కూడా కనిపిస్తాయి. అక్కడక్కడా గ్రామాల్లో కొంతమంది జులాయిలు స్నేహితులను వెంటేసుకొని జేబులో ఉన్న సొమ్మంతా ఖర్చు చేస్తూ పొగిడించుకుంటూ ఉంటారు. డబ్బులు అయిపోగానే అందినచోటల్లా అప్పులు చేస్తారు. అప్పులు పుట్టనప్పుడు ఇంట్లో తల్లి లేదా భార్య దాచుకున్న సొమ్మును కూడా గుంజుకుంటారు. అదీ అయిపోయాక ఇంట్లో వాళ్ల మీద దౌర్జన్యాలు చేస్తారు. ఆ తర్వాత ఊళ్లో వాళ్ల మీద పడతారు. ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి కూడా ఇంచుమించుగా ఇలాగే చేస్తున్నారు. నవరత్నాలు అంటూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయించారు. దొరికినచోటల్లా అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. అప్పు పుట్టే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న నగదు నిల్వలను కూడా వాడేశారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం వంటి స్వతంత్ర సంస్థ వద్ద ఉన్న 400 కోట్ల రూపాయలను సైతం వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ మెడపై కత్తిపెట్టి తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న డబ్బు కూడా అయిపోవడంతో ఇప్పుడు ఓటీఎస్‌ వంటి పథకాలతో పేదల ముక్కు పిండి వసూలుచేయడానికి పూనుకున్నారు. ఈ పథకం కింద బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. పేదల కోసం దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు చేసిన ఆర్థికసహాయంతో నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు క్రమబద్ధీకరణ లేదా రిజిస్ట్రేషన్‌ కోసం సొమ్ము కట్టాలని అనడం జగన్‌రెడ్డికి మాత్రమే సాధ్యం. సంక్షేమ పథకాలకు డబ్బు కోసం పేదలను పీడించడాన్ని మించిన దుర్మార్గం ఉంటుందా? పెళ్లి సర్టిఫికెట్లు లేని వారి నుంచి కూడా ఓటీఎస్‌ వంటి పథకాలు తెచ్చి డబ్బు వసూలు చేస్తారేమో తెలియదు. ‘పెళ్లి సర్టిఫికెట్‌ లేకపోతే మిమ్మల్ని భార్యాభర్తలుగా గుర్తించబోము, మీకు ఏ పథకాలూ అందవు, ఇన్సూరెన్స్‌ సొమ్ము రాకుండా అడ్డుకుంటామ’ని బెదిరిస్తారేమో తెలియదు. మరోవైపు సంక్షేమం ముసుగులో దోపిడీకి తెర తీశారు. అభివృద్ధి- అవినీతి కలిసి ప్రయాణిస్తాయని అంటారు. అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నప్పుడు అవినీతి జరగడం సహజం. అవినీతికి అలవాటు పడినవాళ్లు కొన్ని వినూత్న పథకాలకు రూపకల్పన చేసి నిధులు కూడా సమకూర్చుతారు. రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు మచ్చుకు కూడా కనపడని పరిస్థితి ఉన్నందున అవినీతిలో కూడా ఊహకందని సృజనాత్మకతను తీసుకువచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక, మద్యం వంటి వాటిని ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. కొత్తగా పరిశ్రమలు, వ్యాపారాలు ఎలాగూ వచ్చే అవకాశం లేనందున ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బెదిరించి నిర్బంధంగా వాటాలు పొందారు. ప్రజలకు డబ్బు పంచడం మినహా రాష్ట్ర సంపద పెంచడానికి ఒక్కటంటే ఒక్క పని చేశామని చెప్పుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నిస్తే ఏలినవారి వద్ద సమాధానం లేదు. 

‘30 ఏళ్ల పాటు నేనే అధికారంలో ఉంటాను’ అని ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్‌రెడ్డి ప్రకటించుకున్నారు. ముప్పై ఏళ్ల సంగతేమో గానీ రెండున్నరేళ్లకే ‘అమ్మో ఇదేమి ప్రభుత్వం!’ అని ప్రజలు హడలిపోయే పరిస్థితి కల్పించారు. 


సీఎం అయ్యింది ఇందుకేనా?

ఇంతకూ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నది ఎందుకు? 30ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నది ఎందుకు? గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ర్టాన్ని పాలించారు. వారిలో చాలామంది పదవి నుంచి దిగిపోయేనాటికి రాష్ట్రంపై తమదైన ముద్ర వేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల పేరు చెప్పగానే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారు. అభివృద్ధికి చిరునామాగా, విజన్‌ ఉన్న నాయకుడిగా చంద్రబాబునాయుడిని గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి గురించి చెప్పుకోవాలంటే అప్పులే గుర్తుకొస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. శక్తికి మించి సంక్షేమం పేరిట ఖర్చు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించాలని ఆందోళన చేసే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించడం గొప్పతనం అవుతుందా? న్యాయ వ్యవస్థకు కూడా మినహాయింపు లేకుండా అన్ని వ్యవస్థలనూ చెరపట్టాలనుకోవడం ఆదర్శమవుతుందా? మంత్రులు, శాసనసభ్యులను ప్రేరేపించి ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టించి వికృతానందం పొందడం ఎక్కడి రాజనీతి? ఇళ్లలోని ఆడవాళ్లను అవమానించడం మగతనం అవుతుందా? జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి మేధావులు, తటస్థుల ముసుగులో ఎంతోమంది స్లీపర్‌సెల్స్‌గా పనిచేశారు. అలాంటివారిలో కొందరు జగన్‌రెడ్డి విదిల్చిన పదవులలో సేద తీరుతున్నారు. ఇంకొందరు కులాభిమానం, ప్రాంతీయాభిమానంతో ఇప్పటికీ జగన్‌ సేవలో తరిస్తున్నారు. మరికొందరు రాష్ట్రంలో పాలన పరిణామాలను చూసి అవాక్కవుతున్నారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్‌రెడ్డికి పరోక్షంగా మేలు జరిగేలా ప్రచారం సాగించిన వారిలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్‌ కృష్ణారావు, అజయ్‌ కల్లం వంటివారు కూడా ఉన్నారు. వీరిలో అజయ్‌ కల్లం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి సలహాదారుడిగా నియమితుడైనప్పటికీ ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. అయినా ఆయన అదే పదివేలనుకుని సంతృప్తిపడిపోతున్నారు. ఇక ఐవైఆర్‌ కృష్ణారావు పరిస్థితి తీసుకుంటే, పెన్షన్‌ పడటంలో జాప్యం జరిగినప్పుడల్లా తెలిసినవారికి ఫోన్‌ చేసి ‘మీకు పెన్షన్‌ పడిందా?’ అని తెలుసుకొనే పనిలో బిజీగా ఉన్నారు. జనచైతన్య వేదిక కన్వీనర్‌గా ఉండే లక్ష్మణ్‌రెడ్డి ఇప్పుడు మద్యపాన వ్యతిరేక కమిటీ చైర్మన్‌గా నియమితులై ఏలినవారి సేవలో తరిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యాన్ని ప్రజలకు అంటగడుతున్నా ఆయనకు మాత్రం కన్పించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను, ముఖ్యంగా రాయలసీమవాసులను సమీకరించడంలో చురుకైన పాత్ర పోషించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి ఇప్పుడు లోకాయుక్త పదవితో తృప్తి పడిపోయారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వంటి వారు మాత్రం జరుగుతున్న తంతు చూసి తట్టుకోలేక నోరు విప్పడం మొదలుపెట్టారు. జగన్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా దిశగా పయనిస్తున్న విషయం నిజమైతే అందుకు ఆనాడు జగన్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన మేధావులు, తటస్థులు కూడా బాధ్యులవుతారు. అనర్హుడిని అందలం ఎక్కించడంలో తమ వంతు పాత్ర పోషించిన వాళ్లంతా జరుగుతున్న విధ్వంసానికి బాధ్యత తీసుకోవాల్సిందే. జగన్‌ పాలన ఇలా ఉంటుందని అనుకోలేదని ఉండవల్లి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారంటే సామాన్య ప్రజలకు మాత్రం ఆయన గురించి ఎలా తెలుస్తుంది! 


తండ్రిని మించి చేయడమంటే ఇలాగేనా?

కారణాలు ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి కావాలన్న చిరకాల వాంఛను జగన్‌రెడ్డి నెరవేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన రెండున్నరేళ్ల పాలనను పూర్తిచేసుకున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా తన పాలనను బేరీజు వేసుకుని లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఇదొక అవకాశం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా తన పాలన ఉంటుందని, తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటానని అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్‌రెడ్డి నమ్మబలికారు. ఈ మాటల్లో ఎంత నిజం ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బాధ్యత లేకుండా ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచిపెట్టడం వల్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతానని ఎవరు భావించినా మూర్ఖత్వమే అవుతుంది. ప్రజలపై పన్నులభారం వేస్తూ మరోవైపు ఓటీఎస్‌ వంటి పథకాలతో పేదప్రజలను పీడించడం జనరంజక పాలన అనిపించుకోదు. ప్రజాకంటక పాలన అవుతుంది. అధికారానికి భయపడి ఇంతకాలంగా మౌనంగా ఉన్న వర్గాలు ఇప్పుడు గొంతెత్తడానికి కారణం ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి జగన్‌రెడ్డికి దక్కిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే చంద్రబాబుకే కాదు మరెవరికీ సమీప భవిష్యత్తులో అవకాశం లభించి ఉండేది కాదు. కానీ ఇవాళ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉందా? తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్న ప్రశ్నలకు జగన్‌రెడ్డి సమాధానం అన్వేషించుకోవాలి. ప్రభుత్వ చర్యల వల్ల ఇంటాబయటా రాష్ట్రం పరువు పోయింది. ప్రభుత్వం పిలిచే ‘పనుల’కు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా పనులు చేపట్టినా వారికి బిల్లులు రావడం లేదు. కాంట్రాక్టర్లకు గ్యారంటీలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. తాము గ్యారంటీలు ఇస్తే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటిని నగదుగా మార్చుకొని వాడేసుకుంటుందని బ్యాంకులు భయపడుతున్నాయి. సరఫరాదారులు ఆంధ్రప్రదేశ్‌ను నిషేధించారు. ఈ పరిస్థితి కల్పించిన జగన్‌రెడ్డి కానీ, ఆయనను సమర్థిస్తున్నవారు కానీ ఇదొక గొప్ప పాలన అని చెప్పగలరా? తల్లిని, చెల్లిని సైతం దూరం చేసుకున్న జగన్‌రెడ్డి రాష్ర్టానికి మేలు చేస్తారంటే నమ్మడం ఎలా? ధనదాహాన్ని వదులుకోలేని వ్యక్తి జనరంజక పాలన సాగించడం సాధ్యమా? ప్రత్యేక హోదా విషయం ఎలాగూ గాల్లో కలసిపోయింది. పోలవరం వంటి ప్రాజెక్టును కూడా సక్రమంగా పూర్తి చేయడానికి శ్రద్ధ చూపని ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? కేంద్రప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న పరపతిని పోలవరం పూర్తికి అవసరమైన నిధుల కోసం కాకుండా స్వప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేస్తున్న జగన్‌రెడ్డి గొప్ప ముఖ్యమంత్రి ఎలా అవుతారు? శాసనసభలో జరుగుతున్న పరిణామాలతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం సైతం బాధపడే పరిస్థితి రావడం దేనికి సంకేతం? ఇది మంచి పద్ధతి కాదు అని మంత్రులను పిలిపించి ఆయన చెప్పాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది? పలువురు మంత్రులు, సీనియర్‌ శాసనసభ్యులు నిర్వేదంలోకి జారిపోవడానికి కారణం ఏమిటి? అప్పు పుట్టనిదే రోజు గడవని పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారో జగన్‌రెడ్డి సంజాయిషీ ఇవ్వాలి. అభివృద్ధి బాటలో రాష్ర్టాన్ని నడిపించడానికి, రాష్ట్ర సంపద పెంచడానికి ఏమి చర్యలు తీసుకోబోతున్నారో ఇప్పటికైనా ఆయన చెప్పాలి. తాడేపల్లిలోని అంతఃపురానికి పరిమితమై పగా ప్రతీకారాలతో రగిలిపోవడం వల్ల రాష్ర్టానికీ, ప్రజలకూ ఒరిగేది ఏమీ ఉండదు. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వారిలో కూడా ఆనందం ఆవిరైపోవడం మొదలైంది. రాష్ట్రంలో చట్టబద్ధపాలన చేయకుండా ఆటవిక పాలనను ప్రవేశపెట్టడం పాలకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. పాలనాకాలం సగం పూర్తయిపోయినందున జగన్‌రెడ్డి ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని తప్పులను సరిదిద్దుకోని పక్షంలో చరిత్రపుటల్లో ఆయన స్థానం ఏమిటి అన్నది కాలమే చెబుతుంది. దిద్దుబాటు చర్యలు చేపట్టని పక్షంలో జగన్‌ ముఖ్యమంత్రి అయింది రాష్ర్టాన్ని సర్వనాశనం చేయడానికేనా? అని ఎవరైనా భావిస్తే వారిని తప్పుపట్టలేం. ‘రావాలి జగన్‌- కావాలి జగన్‌’ అన్న గొంతులే ‘పోవాలి జగన్‌’ అని నినదించడానికి ఇక ఎంతో సమయం పట్టదు!

ఆర్కే

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
Advertisement