Abn logo
May 21 2020 @ 07:28AM

కరోనా బాధితుల్లో ఎన్నారైలు ఎక్కువే: అమెరికాలోని ప్రముఖ తెలుగు వైద్యుడు

3 నెల‌ల్లో వ్యాక్సిన్‌

 ప్రస్తుతానికి లాక్‌డౌనే మందు

ప్రజలే బాధ్యతగా మెలగాలి

కరోనా నుంచి కాపాడుకోవాలి 

అమెరికాలోని ప్రముఖ తెలుగు వైద్యుడు నోరి దత్తాత్రేయుడు

(న్యూయార్క్‌ నుంచి కిలారు అశ్వనీ కృష్ణ): కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కన్నా ప్రజలే ఎంతో బాధ్యతగా మెలగాలని సూచిస్తున్నారు ప్రపంచం గర్వించదగ్గ వైద్యుల్లో ఒకరిగా పేరుగాంచిన తెలుగువాడైన డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు. ప్రస్తుతం ఆయన అమెరికా న్యూయార్క్‌లోని ఎల్మ్‌హర్ట్స్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడిగా గుర్తింపు పొందిన దత్తాత్రేయుడి స్వగ్రామం ఏపీలోని కృష్ణా జిల్లా మంటాడ. దత్తాత్రేయుడు పనిచేస్తున్న ఆస్పత్రిలోనే ఆయన భార్య సుభద్రా నోరి కూడా పనిచేస్తున్నారు. దాని పక్కనే ఉన్న మొన్టేఫ్యోర్‌ ఆస్పత్రిలో ఆయన కుమార్తె ప్రియా నోరి అంటువ్యాధుల నిపుణురాలిగా, ఆ ఆస్పత్రి ప్రధాన నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. ఈ రెండు ఆసుపత్రులూ ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా రోగులకు సేవలందించే సంస్థలుగా పేరుపొందాయి. ప్రపంచాన్ని, అగ్ర రాజ్యం అమెరికాను గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి గురించి తన అనుభవాలను, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను దత్తాత్రేయుడు ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.


వియత్నాం యుద్ధం కన్నా అపార నష్టం

 అమెరికాను  కరోనా అతలాకుతలం చేస్తోంది. వియత్నాం యుద్ధం, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై  జరిగిన దాడి కన్నా ఈ వైరస్‌ అమెరికాకు ఎక్కువ నష్టం కలిగించింది. నాతో పాటు నా భార్య, కుమార్తె పని చేస్తున్న ఆస్పత్రుల్లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.  ఈ ప్రాంతాన్ని గ్రౌండ్‌ జీరోగా ప్రకటించారు. మా ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్స పొంది తిరిగి వెళ్ళిన వారు, మృతి చెందిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. 


న్యూయార్క్‌ అనుభవాలే గుణపాఠాలు

ప్రపంచంలో అత్యధికంగా న్యూయార్క్‌ రాష్ట్రంలో కరోనా రోగులున్నారు. మరణాలు కూడా ఇక్కడ ఎక్కువే. వివిధ దేశాల వారితో కిక్కిరిసి ఉండే న్యూయార్క్‌.. ప్రపంచానికి చాలా గుణపాఠం నేర్పింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ బాగా తోడ్పడింది. కరోనా రోగులకు అందిస్తున్న రెమ్దేసివిర్‌ మందు మంచి ఫలితాలను ఇస్తున్నది. రెండు వారాల్లో కోలుకునే రోగులు ఈ మందుతో వారం రోజులకే ఆస్పత్రి నుంచి డాశ్చార్జి అవుతున్నారు. క్లోరోక్విన్‌ బిళ్లలు పనిచేస్తాయా లేదా అనే విషయం మీద స్పష్టత రాలేదు.


కరోనాతో పోరాడుతూనే లాక్‌డౌన్‌ సడలింపు

అమెరికా వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ను ఎక్కువ కాలం కొనసాగించడం  కష్టం. కరోనాతో పోరాడుతూనే న్యూయార్క్‌లో లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలించనున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వాలపై భారం వెయ్యకుండా తమని తాము కాపాడుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులు, దేహాన్ని శుభ్రపరుచుకోవాలి. వీటిని ప్రజలు పాటిస్తే వ్యాధి నుంచి దూరంగా ఉండవచ్చు.


3 నెలల్లో వ్యాక్సిన్‌

చరిత్రను పరిశీలిస్తే.. ప్రతీ 70, 80 ఏళ్లకు ఒకసారి అంటు రోగాలు ప్రబలుతుండడం, లక్షలాది మంది మరణించడం, వాటి నివారణకు వ్యాక్సిన్‌ను కనిపెట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. గతంలో వచ్చిన అంటువ్యాధుల కన్నా  కరోనా మూడు, నాలుగు రెట్ల దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకుండా వ్యాక్సిన్ల గురించి రాత్రింబవళ్లు విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా మూడు, నాలుగు నెలల్లో వ్యాక్సిన్‌ వస్తుందని చెప్పగలను.  


భారత్‌లో మోదీ ప్రభుత్వ చర్యలు భేష్‌

భారత్‌లో కరోనా ప్రవేశించగా వెంటనే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ తదితర చర్యలు తీసుకున్నారు. కొంతమేరకు కరోనా నివారణకు ఇవి దోహదపడుతున్నాయి. అమెరికాలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా టెస్టులు జరపడంతో రోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. భారత్‌లో కరోనా రోగులు పెరిగితే వారికి సేవలందించే స్థాయిలో ఆస్పత్రుల సంఖ్య లేదు. టెస్టులు కూడా ఎక్కువగా జరగడం లేదు. గ్రామీణ స్థాయిలోనూ పరీక్షలు చేయాలి. 


భారత్‌లో మా వంతు సాయాన్ని అందిస్తాం

భారత ప్రభుత్వం అనుమతిస్తే కరోనా నివారణలో మా వంతు సహకారాన్ని అందించడానికి నాతో పాటు ఇక్కడ ఉన్న పలువురు భారత సంతతి వైద్యులు సిద్ధంగా ఉన్నారు. కరోనా కారణంగా అమెరికాలో భారతీయులు ఎక్కువమందే చనిపోయారు. మేమే స్వయంగా వందలాది మంది భారతీయులకు చికిత్స అందిస్తున్నాం. ఈ వ్యాధి ఎక్కువగా 70 ఏళ్లు పైబడిన వారిపై చూపుతున్నది. గుండె జబ్బులు, న్యుమోనియా, షుగర్‌ వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపైన కరోనా ఎక్కువ ప్రభావం  చూపిప్రాణాలను తీస్తున్నది. పొగ తాగే అలవాటు ఉన్నవారు, మద్యం సేవించే వారు కరోనా కనుమరుగయ్యేంత వరకూ ఆ అలవాట్లను మానుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు ఆర్థిక ఒడిదుడుకులు తప్పవు. ఇవి తాత్కాలికమైనవే.  


రోగులకు సేవపైనే వైద్యులు దృష్టి పెట్టాలి

అమెరికాలో ఉన్న వైద్యులందరూ కరోనా నివారణలోనే నిమగ్నమై ఉన్నారు. భారత సంతతి వైద్యులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. భారత్‌లోని వైద్యులందరూ కరోనా రోగులకు సేవ చేయడం పైనే దృష్టి పెట్టాలి. వచ్చే కొద్ది రోజుల్లో భారత్‌లో కరోనా రోగుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తు భారత్‌లో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచుకోవాలి. సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రజలు తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. 

Advertisement
Advertisement
Advertisement