Abn logo
May 20 2020 @ 14:32PM

'జూమ్‌' ద్వారా నిందితుడికి ఉరిశిక్ష.. సింగ‌పూర్‌లో...

సింగపూర్ సిటీ: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం చాలా దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. దాంతో ఆయా దేశాల్లోని ప్రైవేట్ కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను 'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌'కు ఆదేశించాయి. దీంతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, కంపెనీల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్సుల కోసం ఎక్కువగా 'జూమ్‌' యాప్‌ను వినియోగిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ జూమ్‌ యాప్‌ సురక్షితమైనది కాదని, అందులో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని తెలిసినా చాలా మంది ఈ యాప్‌నే వినియోగిస్తున్నారు. ఇదిలాఉంటే... సింగపూర్‌లో ఒక వ్యక్తికి ఆ దేశ సుప్రీంకోర్టు జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే శిక్ష‌ను ఖ‌రారు చేయ‌డం తాజాగా జ‌రిగింది. మాద‌క ద్ర‌వ్యాల‌ను అక్ర‌మంగా త‌ర‌లించిన కేసులో నిందితుడిగా ఉన్న స‌ద‌రు వ్య‌క్తికి సింగ‌పూర్ సుప్రీంకోర్టు ఉరిశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. 


కరోనా వ‌ల్ల‌ దేశంలో లాక్‌డౌన్ అమ‌లులో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగపుర్‌ సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి ఒక‌రు తెలిపారు. మలేసియాకు చెందిన పునితాన్ జెనాసన్(37) 2011లో హెరాయిన్‌ డ్రగ్‌ను అక్రమంగా తర‌లిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. దీంతో అప్పట్లో అతనిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. విచార‌ణ‌లో పునితాన్ దోషిగా తేలాడు. దీంతో తాజాగా జూమ్ ద్వారా ఈ కేసు తుది తీర్పును సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. అక్రమంగా డ్రగ్‌ సరఫరా చేసిన‌ట్లు తేల‌డంతో పునితాన్‌కు ఉరి శిక్ష విధిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement