Abn logo
Feb 7 2020 @ 12:07PM

ఒంటరి మహిళలపై ముద్దుల వర్షం కురిపించిన సీరియల్ ఈవ్‌టీజర్ అరెస్ట్

ముంబై : :

ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు ఈ ఈవ్‌టీజర్ రెచ్చిపోయి వారిని పట్టుకొని ముద్దుల వర్షం కురిపిస్తాడు...అనంతరం పారిపోతాడు...నిత్యం రైల్వే బ్రిడ్జీలపై ఈ ఆకతాయి సాగిస్తున్న ఈవ్‌టీజింగ్ పర్వం సీసీటీవీ ఫుటేజ్‌లో వెలుగుచూసింది. ఈ ఆకతాయి ముద్దు పెట్టిన బాధిత మహిళలెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోయినా, రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో గుర్తించి అతన్ని అరెస్టు చేసిన ఘటన ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలోని మాటుంగా రైల్వేస్టేషనులో వెలుగుచూసింది.

 

రైల్వే బ్రిడ్జీపై ఒంటరిగా వెళుతున్న మహిళలపై ముద్దుల వర్షం కురిపించిన సీరియల్ ఈవ్‌టీజర్ రాయ్‌జూర్ హబీబర్ ఖాన్‌ను ముంబై రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాయ్‌జూర్ హబీబర్ ఖాన్‌ ముంబై నగరానికి వచ్చి వడ్రంగిగా పనిచేస్తున్నాడు. మాటుంగా రైల్వే వంతెనపై ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి వద్దకు వచ్చి పట్టుకొని, ముద్దాడి పారిపోతుండటం ఈవ్‌టీజర్ రాయ్‌జూర్ కు నిత్యకృత్యంగా మారింది.

 

గత నెల 25వతేదీన ఓ మహిళను ఇతను పట్టుకొని ముద్దాడి పారిపోవడం రైల్వేపోలీసులకు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు రైల్వేపోలీసులు సివిల్ వేషధారణలో రైల్వేవంతెనపై కాపు కాశారు. అంతలో రైల్వేబ్రిడ్జీపై ఓ మహిళ ఒంటరిగా వస్తుండగా ఆమెను సమీపించి ముద్దాడేందుకు యత్నిస్తుండగా అంతలో మాటు వేసిన మఫ్టీలో ఉన్న రైల్వే పోలీసులు అతన్ని వలపన్ని పట్టుకున్నారు. సీరియల్ ఈవ్‌టీజర్ రాయ్‌జూర్ హబీబర్ ఖాన్‌ పై రైల్వేపోలీసులు ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ఒంటరి మహిళలను వేధిస్తున్న రాయ్‌జూర్ హబీబర్ ఖాన్‌ కు భార్య, పిల్లలుండటం కొసమెరుపు.

 

రాయ్‌జూర్‌పై కేసు పెట్టేందుకు బాధిత మహిళలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అతన్ని దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు ముందుకు వచ్చి నిందితుడిపై ఫిర్యాదులు చేయాలని రైల్వేపోలీసులు విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తే వారి గుర్తింపు బయట పెట్టమని పోలీసులు హామీ ఇచ్చారు.మహిళలు అతనిపై ఫిర్యాదు చేయకపోతే రాయ్‌జూర్‌పై ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేయడానికి పోలీసులు చట్టపరమైన మార్గాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement