Jun 19 2021 @ 16:50PM

నాని ‘దారే లేదా’ వీడియోకు సూపర్‌ స్టార్‌ ఫిదా!

న్యాచురల్ స్టార్ నాని మరియు అతని టీమ్‌ చేసిన 'దారే లేదా' వీడియోపై సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో చూసి నా మనసు పులకరించిందని తెలిపారు. కరోనా ఫస్ట్‌ అండ్‌ సెకండ్ వేవ్‌ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు, తమ కుటుంబసభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్‌ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు అంకితమిచ్చేందుకు ఈ ‘దారే లేదా’ సాంగ్‌ను న్యాచురల్‌ స్టార్‌ నాని రూపొందించారు. విడుదల తర్వాత కోవిడ్‌ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్‌వర్కర్స్‌ల కృషికి ఈ ‘దారే లేదా’ సాంగ్ ప‌ర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్‌ అనేలా స్పందన అందుకుంటుందీ వీడియో. తాజాగా ఈ వీడియోపై మహేష్‌ బాబు కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.


''మన ఫ్రంట్‌లైన్ కార్మికులను గౌరవించేందుకు మంచిదారిని ఎన్నుకున్నారు. నిండు హృదయంతో చేసిన ఈ వీడియో చూసి.. నా హృదయం కూడా సంతోషంతో నిండిపోయింది. నాని మరియు అతని టీమ్‌ అద్బుతమైన పనితనాన్ని ప్రదర్శించారు.." అని సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ.. నాని టీమ్‌ చేసిన 'దారే లేదా' వీడియోని షేర్‌ చేశారు.