Abn logo
Sep 27 2020 @ 00:33AM

కట్టలు తెగిన వాన

Kaakateeya

బంగాళాఖాతంలో మళ్లీ అల్ప‘పీడనం’

ఏకధాటిగా కురుసుతన్న భారీ వర్షం

ఉమ్మడి పాలమూరు జిల్లా అతలాకూతలం

వేల ఎకరాల్లో వరి, కంది, జొన్న పంటలకు తీవ్ర నష్టం

చెరువులు, వాగుల ఉగ్రరూపం

దాదాపు 80 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

జగదిగ్బంధంలో పదుల కొద్ది గ్రామాలు

వెర్వేరు చోట్ల ఎనిమిది మంది గల్లంతు

సురక్షితంగా ఏడుగురు కాపాడిన స్థానికులు

మరొకరి ఆచుకీ కోసం గాలింపు


కుండపోత వాన ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.. ఈ నెల రెండో వారం మొదటి నుంచి ఏకధాటిగా భారీ వర్షం పడుతూనే ఉన్నది.. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవగా, తాజాగా బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోగా, తాజాగా కురిసిన వర్షాలకు ఉగ్రరూపం దాల్చాయి.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చెరువుతున్నాయి.. కాలువలకు గండ్లు పడటంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.. పలు గ్రామాల మధ్య వాగులు ఉధృతంగా పారుతుండటంతో రాకపోకలు నిలిచిపోయి, జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.. 


(మహబూబ్‌నగర్‌-ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఏకధాటిగా వర్షం పడుతూనే ఉన్నది. దీంతో మహబూబ్‌నగర్‌ పట్టణంలోని హనుమాన్‌పుర, గణేష్‌నగర్‌, ఎర్రమన్నుగుట్ట, కురివిహినిశెట్టికాలనీ, శివశక్తినగర్‌, మోతీనగర్‌, క్రిష్టియనల్‌పల్లి, రామయ్యబౌళి, కొమ్ముగేరి, లక్ష్మీనగర్‌కాలనీలలోని పలు ఇళ్లలోకి నీరు చేరగా, ఎంబీసీ కాంప్లెక్స్‌ సెల్లార్‌లోని దుకాణాలలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావ్‌ సందర్శించారు. కౌకుంట్ల, చౌదర్‌పల్లి గ్రామాల్లో చెరువులు పొంగాయి. జిన్గరాల చెరువు కట్ట తెగిపోవడంతో పొలాల్లోకి నీరు చేరింది. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో 13 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు డీఈ రవీందర్‌రెడ్డి తెలిపారు. మూసాపేట మండలంలో కూడా వాగులు పొంగాయి.


మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులోని కొత్తకుంటచెరువు, నార్లోనికుంట, ధర్మపూర్‌  నాగులకుంట, జమిస్తాపూర్‌లోని వరదరాయ చెరువు, కోటకదిర చెరువులు అలుగు పారాయి. జడ్చర్ల మండలం లింగంపేట, నెక్కొండ, ఆల్వాన్‌పల్లి, గుట్టకాడిపల్లి గ్రామాల సమీపంలో దుందుభీ నదిపై నిర్మించిన చెక్‌డ్యాం వద్ద ప్రమాదకరస్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కుర్వపల్లి గ్రామంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న కాలనీలలోకి నీళ్లు చేరాయి. మిడ్జిల్‌ మండలం మున్ననూరు శివారులో దుందుభీ నది ఉధృతంగా పారుతోంది. నవాబ్‌పేట-యన్మనగండ్ల గ్రామాల మధ్య ఉన్న తాళ్లవాగుకు భారీగా వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరికల్‌ గ్రామంలో వరి, జొన్న పంటలు నీట మునిగాయి. హన్వాడ మండలంలోని పెద్దదర్‌పల్లి చెరువు, ఇబ్రహీంబాద్‌లోని హేమసముద్రం అలుగు పారాయి. తాండూర్‌-మహబుబ్‌నగర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గండీడ్‌ మండలంలోని చెరువులు అలుగు పారుతుండటంతో అన్నారెడ్డిపల్లి-పీర్లబండ, మహమ్మదాబాద్‌-ఇంబ్రతిహీంబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నచింతకుంట మండలం అల్లీపూర్‌ వద్ద ఊకచెట్టువాగులోకి భారీగా వరద నీరు చేరింది. బండర్‌పల్లి చెక్‌డ్యాం పక్కనే ఉన్న మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఆత్మాకూర్‌-హైదరాబాద్‌ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.నాగర్‌కర్నూల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాల పరిఽధిలోని 23 గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. తిమ్మాజిపేటలో 51.0 మిల్లీమీటర్లు, బిజినేపల్లిలో 39.8, నాగర్‌కర్నూల్‌లో 52.0, తాడూరులో 35.6, ఊర్కొండలో 32.5, వెల్దండలో 88.1, చారకొండలో 29.8, కల్వకుర్తిలో 49.8, తెలకపల్లిలో 52.5, ఉప్పునుంతలలో 39.5, అచ్చంపేటలో 24.2, అమ్రాబాద్‌లో 16.2, పదరలో 10.9, బల్మూరులో 51.4, లింగాలలో అత్యధికంగా 92.4, పెద్దకొత్తపల్లిలో 84.7, కోడేరులో 40.2, కొల్లాపూర్‌లో 65.0, పెంట్లవెల్లిలో 38.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండం గ్రామం మళ్లీ జలదిగ్భంధంలో చిక్కుకుంది. 


వనపర్తి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ముసురు కురుస్తూనే ఉంది. శ్రీరంగాపురం మండలంలో 67.0 మిల్లీమీటర్లు, పెద్దమందడి 66.1, పెబ్బేరు 65.1, పాన్‌గల్‌ 64.8, మదనాపురం 64.3, ఆత్మకూరు 62.7, ఘనపురం 59.7, అమరచింత 57.5, వనపర్తి 56.8, వీపనగండ్ల 56.8, కొత్తకోట 44.8, గోపాల్‌పేట 41.1, రేవల్లి 35.8, చిన్నంబావి 29.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.


జోగుళాండ గద్వాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షాలకు గద్వాల-రాయచూరు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నందిన్నె వద్ద మరోమారు తాత్కాలికంగా నిర్మాణం చేపట్టిన వంతెన రోడ్డు తెగిపోయింది. కేటీదోడ్డి మండలంలో 76.0 మిల్లీమీటర్లు, ధరూర్‌లో 48.6, గద్వాలలో 37.2, ఇటిక్యాలలో 31.4, మల్దకల్‌లో 37.7, గట్టులో 49.6, అయిజలో 23.4, రాజోలీలో 22.5, వడ్డేపల్లిలో 25.0, మానవపాడులో 21.0,  ఉండవల్లిలో 28.4, అలంపూర్‌లో 27.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


నారాయణపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతన అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల్లో వేర్వేరుగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. దామరగిద్ద మండలం గడిమున్కన్‌పల్లి, పిడ్డెంపల్లి గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి. మరికల్‌ మండలం గాజులయ్యతండాలో ఇళ్లలోకి నీరు చేరింది. నర్వ మండలం ఉందేకోడ్‌ గ్రామ శివారులోని సంగంబండ సాగునీటి కాలువకు గండి పడింది. కోస్గి మండలంలోని ముశ్రీఫా, బిజ్జారం, చెన్నారం, కొత్తపల్లి గ్రామాల్లో వాగులు, చెరువులు అలుగు పారుతున్నాయి. కోస్గిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మక్తల్‌ మండలం మంథన్‌గోడ్‌ పెద్ద చెరువు 12 ఏళ్ల తరువాత నిండింది. కర్ని, గోలపల్లి, రుద్రసముద్రం గ్రామాల చెరువులు నిండి రహదారులపై అలుగు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కర్ని చెరువులోకి వర్షపు నీరు చేరడంతో గ్రామంలోకి చెరువు నీరు చేరుతోంది. తూములు తెరిచి దిగువకు నీటిని వదిలారు. మాగనూరు మండలం పెద్దవాగుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర రహదారిపై నుంచి నీరు పారడంతో రాయచూర్‌-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపేట మండలం కోటకొండ, అప్పిరెడ్డిపల్లి, జాజాపూర్‌, సింగారం, బోయిన్‌పల్లి చెరువులు అలుగులు పారాడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊట్కూర్‌ మండలం చిన్నపొర్ల గ్రామంలో చెరువు నీళ్లు ఇళ్లలోకి చేరాయి. అమీన్‌పూర్‌ పగిడిమారి, ఓబ్లాపూర్‌ గ్రామాల్లో వాగులు పొంగాయి.


హన్వాడ మండలం గొండ్యాల వాగులో రాములు (55) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. గొండ్యాల గేట్‌ నుంచి గ్రామనికి వెళ్లేందుకు వాగు దాటే ప్రయత్నం చేయగా, వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈయన ఆచూకీ ఇంకా లభించలేదు. ఈయన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వాగు వద్ద చేరుకొని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయంతో రాములును కాపాడలని అధికారులకు చెప్పారు.


భూత్పూర్‌ మండలం పోతులమడుగు వాగులో గోపన్నపల్లెకు వెళ్తున్న ఆటో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆటో డ్రైవర్‌ ఊషన్న ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకొని, ప్రాణాలను కాపాడుకున్నాడు.

దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన శ్రీను, నాగరాజు, వెంకటేష్‌ స్నేహితులు. గ్రామ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు శనివారం ఉదయం వెళ్లారు. వరద ఉధృతికి పెరగడంతో వాగులో నుంచి శ్రీను, నాగరాజు ఒడ్డుకు చేరుకున్నారు. వెంకటేష్‌ మాత్రం అందులోనే చిక్కుకుపోయాడు. అదనపు కలెక్టర్‌ సీతారమారావు, తహసీల్దార్‌ జ్యోతి, ఎస్‌ఐ భగవంతరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక బృందాలను పిలిపించి, యువకుడిని ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో, ఇస్రంపల్లి గ్రామానికి చెందిన యువకులు తాడు సహాయండో యువకుడిని బయటకు తీసుకొచ్చారు.


నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలంలో దుందుభీ వాగు ఉప్పొంగింది. కోడేరు మండలం జనుంపల్లి నుంచి పస్పులకు బైక్‌తో బయల్దేరిన మేస్త్రీ గంగయ్య ఆయన భార్య ఎల్లమ్మ మోటారు సైకిల్‌తో సహా వాగులో కొట్టుకుపోతుండగా, గ్రామస్థులు తాడు సాయంతో వారికి రక్షించారు.

వనపర్తిలోని డిగ్రీ కళాశాల జెరిపోతుల మైసమ్మ వాగులో శనివారం యువకులకు ప్రమాదం తప్పింది. పాన్‌గల్‌ మండలం కదిరెపాడు గ్రామానికి చెందిన అశోక్‌ తన స్నేహితునితో కలిసి కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనంపై వనపర్తి నుంచి కదిరెపాడుకు బయల్దేరారు. జెరిపోతుల మైసమ్మ వాగు దాటుతుండగా బైక్‌ అదుపు తప్పి వాగులో పడిపోయారు. వాహనంతో పాటు ఇద్దరూ నీటి ప్రవాహాంలో కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న ప్రజలు వారిని కాపాడారు. 


నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని అమీన్‌పూర్‌-పగిడిమారి గ్రామల మధ్య ఉన్న చీకటి వాగులో శనివారం గొర్రెల కాపరి బాలరాజు చిక్కుకున్నాడు. మధ్యలో ఉన్న ఒక చెట్టును పట్టుకొని సాయం కోసం కేకలు పెట్టాడు. పగిడిమారి గ్రామం వైపు ఉన్న కొందరు రైతులు చూసి గ్రామానికి సమాచారం ఇవ్వడంతో వారు అమీన్‌పూర్‌ గ్రామస్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ గ్రామానికి చెందిన సిద్దప్ప, నర్సప్పతో పాటు మరి కొందరు వచ్చి తాళ్ల సహాయంతో బాలరాజును ఒడ్డుకు చేర్చారు.


Advertisement
Advertisement
Advertisement