Abn logo
Mar 5 2021 @ 00:26AM

శివాయ... పరమాత్మనే!

ఈనెల 11న మహా శివరాత్రి


పరమమైన సత్యం, శివం (సుఖం), అనంతమైన సౌందర్యం (సుందరం) ఏదో అదే పరమశివ తత్త్వం. అదే సర్వకారణ కారణం. అది సృష్టికి పూర్వమే ఉన్న జ్యోతిస్వరూపం. ఆ పరతత్త్వం లింగ రూపంలో ఆవిర్భవించింది. సాకారుడూ, నిరాకారుడూ కూడా అయిన శివుడు లింగాకృతిలోనే కాదు, నటరాజుగా, దక్షిణామూర్తిగా... ఇలా బహురూపాల్లో పూజలందుకుంటున్నాడు. 


మాఘ కృష్ణ చతుర్దశ్యా మాదిదేవో మహానిశి

శివలింగ తయోద్భూతః కోటి సూర్య సమప్రభః


కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే మహాలింగోద్భవం జరిగిన రాత్రే మహా శివరాత్రి- అదే మాఘ బహుళ చతుర్దశి. పరస్పరాధిక్యతను నిరూపించుకోవడానికి బ్రహ్మాస్త్ర, విష్ణ్వాస్త్రాల ప్రయోగం సంభవిస్తున్న తరుణంలో... వాటి మధ్య పరమ శివుడు అఖండాగ్ని స్తంభంగా ఆవిర్భవించిన అర్థరాత్రి శివరాత్రి. ఆ అగ్ని స్తంభమే లింగ రూపంలో ఉన్న అరుణాచలం. సమస్త జగత్తూ దేనిలో లీనమై ఉందో అదే శివ లింగం. సమస్త జగత్తునూ లయం చేసుకొనే శక్తి కలిగినది కనుకనే ఆ రూపంలో పరమశివుణ్ణి ఆరాధిస్తున్నాం. శివ పరమాత్మ నిరాకారుడూ (నిష్కల), సాకారుడూ (సకల) కూడా! నిష్కలంగా శివుడు లింగాకారంలో కనిపిస్తాడు. సకలంగా గంగాధర, జటాధర, చంద్రశేఖర, నీలకంఠ... ఇత్యాది రూపాలలో దర్శనమిస్తాడు. ‘ఏకోహం బహుస్యామ్‌’... అనేక రూపాలు ధరించిన ఆ పరమాత్ముని రూపాలు ఎన్నని చెప్పగలం? ఆయన సగుణ రూపాలు కూడా అఖండ దివ్యజ్ఞానానికి ప్రతీకలుగా ప్రకాశిస్తున్నాయి. ఆ రూపాలన్నిటినీ లింగ రూపంలో ధ్యానించి, అర్చించడం సనాతన ఆరాధనా సంప్రదాయం. జ్ఞాన జ్యోతి స్వరూపుడైన శివుడు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా కొలువయ్యాడు. 


అలాగే పంచభూత లింగాలుగా వ్యక్తమయ్యాడు. ఇలా అనేక క్షేత్రాల్లో, అనేక పేర్లతో పూజలందుకుంటూ అద్భుతమైన పరతత్త్వాన్ని మహా శివుడు ప్రదర్శిస్తున్నాడు. ఆయన ఆది గృహస్థు. అర్ధనారీశ్వరుడు. తనలోనే అంబకు సగం స్థానం ఇచ్చినవాడు. అమ్మ శక్తి లేనిదే అయ్యకు చైతన్యం లేదంటూ... ‘సౌందర్యలహరి’ ప్రారంభంలోనే ‘శివాశ్శక్తాయుక్తో యది భవతి శక్తిః’ అన్నారు ఆది శంకరులు. పార్వతి ప్రకృతి. ప్రకృతీ పురుషుల సమ్మేళనమే జగచ్చైతన్య శక్తి. బ్రహ్మ విద్యాశక్తి పార్వతి అయితే... శివుడు బ్రహ్మంగా వ్యక్తమవుతున్నాడు. వాక్కు, అర్థం శివపార్వతులే నంటూ... ‘వాగర్థ ప్రతిపత్తయే- పార్వతీ పరమేశ్వరౌ’ అని కాళిదాసు కీర్తించాడు.


భారతీయ ఉపాస్య మూర్తులలో నటరాజమూర్తి ఆశ్చర్యకరమైనది. సమస్త జగత్తూ ఒక లయకు అనుగుణంగా స్పందిస్తోంది. విశ్వంలోని ప్రతి పరమాణువులోనూ జరిగే స్పందన శివ నాట్యమనీ, ఆ విశ్వచైతన్య స్పందననే మన పూర్వ ఋషులు నటరాజ స్వామిగా దర్శించారనీ పెద్దలు చెబుతారు. 


పరమశివుడు దక్షిణామూర్తిగా సనక సనందాదులకూ, వశిష్టాది మహర్షులకూ సాక్షాత్కరించి, బ్రహ్మవిద్యను మౌనంగానే ఉపదేశించాడు. వ్యాపకశీలమైన సాంఖ్య యోగాది శాస్త్రాలే శివుని జడలు. ఆ జడలు ఊడలుగా ఉన్నది వటవృక్షం. ఆ వృక్ష మూలంలో కూర్చున్నది దక్షిణామూర్తి రూపంలోని శివుడు. ఇలా శివుడి ప్రతి రూపంలోనూ ఎన్నో విశిష్టతలు కనిపిస్తాయి. శివుడు లింగరూపంలో ఉద్భవించిన రోజైన శివరాత్రినాడు ఉపవాస, జాగారాలను పాటించి, ‘నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే’ అంటూ శివనామస్మరణ చేసిన వారికి శివానుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 

ఎ. సీతారామారావు

Advertisement
Advertisement
Advertisement