Abn logo
Aug 7 2020 @ 03:15AM

ఫోన్‌ చేసి ప్రలోభపెట్టారు

  • వైసీపీ తరఫున జస్టిస్‌ ఈశ్వరయ్య వకాల్తా
  • జగన్‌కు చెప్పి నా కష్టాలు తీరుస్తానన్నారు
  • జస్టిస్‌ నాగార్జునరెడ్డిని, మంత్రి పెద్దిరెడ్డిని
  • కాపాడటమే ఆయన ఉద్దేశం కావొచ్చు
  • ‘ఏబీఎన్‌’ లైవ్‌లో మేజిస్ట్రేట్‌ రామకృష్ణ వెల్లడి


తిరుపతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ తరఫున వకల్తా పుచ్చుకొని, జస్టిస్‌ ఈశ్వరయ్య తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దళిత మేజిస్ట్రేట్‌ రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన ‘ఏబీఎన్‌’ లైవ్‌లో మాట్లాడారు. ‘‘రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌ చేసి నాతో మాట్లాడారు. ఈ సమయంలో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. సీఎం జగన్‌తో చెప్పి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు’’ అని రామకృష్ణ వివరించారు. జస్టిస్‌ నాగార్జునరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను కేసులు, వివాదాల నుంచి తప్పించడమే దీని వెనుక ఉన్న ఉద్దేశంగా కనిపించిందన్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్య తనతో మాట్లాడినప్పుడు, ఢిల్లీ జడ్జీల సంగతి కూడా తేలుస్తానని, హైకోర్టు జడ్జిపై ఫిర్యాదు చేయించింది తానేనని గొప్పలు చెప్పుకొచ్చారని వివరించారు.


తానుగా ఎవరికీ ఫోన్‌ చేసి మాట్లాడలేదని, ఎవరినీ సాయం కోరలేదని రామకృష్ణ చెప్పారు. అదే సమయంలో ఎవరైనా సాయం చేసేందుకు ముందుకొస్తే తప్పకుండా తీసుకొంటానని, అయితే ఆ సాయం ప్రలోభంగా ఉండరాదన్నారు. సీఎం జగన్‌ వద్దకు తీసుకెళ్తానని ఈశ్వరయ్య అనడం వెనుక.. జస్టిస్‌ నాగార్జునరెడ్డితో తనకున్న వివాదాల దరిమిలా ఒరిజినల్‌ ఆధారాలను తీసుకుని వాటిని నాశనం చేసే ఆలోచన ఉండొచ్చని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. వారిని నమ్మి తాను విజయవాడకు లేదా అమరావతికి వెళితే..వారి బెదిరింపులకు లొంగి ఏమి చేయమంటే అది చేయాల్సిందే కదా అంటూ ప్రశ్నించారు. అయితే, తానెవరో కూడా తెలియదని జస్టిస్‌ ఈశ్వరయ్య ‘ఏబీఎన్‌’కు  చెప్పడం ఆయన స్థాయికి తగదని రామకృష్ణ అన్నారు. ఆయన సమాధానం చాలా హాస్యాస్పదంగా ఉందని,  వారి నోటివెంట అబద్ధం రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వాస్తవం ఒప్పుకొని ఉంటే ఆయన కాళ్లకు నమస్కారం పెట్టేవాడినని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ ఈశ్వరయ్య పీఏలు తనకు పెట్టిన మెసేజ్‌లు, ఆ తర్వాత తనతో వాట్సా్‌పలో జరిపిన మెసేజ్‌లు తన వద్ద ఉన్నాయని వివరించారు. 


అది ఆయన స్వరమే: నిర్ధారించిన ట్రూత్‌ ల్యాబ్‌

జడ్జి రామకృష్ణ, జస్టిస్‌ ఈశ్వరయ్యల మధ్య జరిగిన సంభాషణ నిజమేనా!? అందులో ఉన్నది వారి స్వరాలేనా? ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ శాస్త్రీయంగా నిర్ధారించుకుంది. ఈ టేప్‌ను బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్రయోగశాల ‘ట్రూత్‌ ల్యాబ్స్‌’కు పంపింది. ఆ గొంతులు జస్టిస్‌ ఈశ్వరయ్య, జడ్జి రామకృష్ణలవేనని రుజువైంది.

Advertisement
Advertisement
Advertisement