Oct 24 2020 @ 13:03PM

బాలీవుడ్‌కు మహేష్ భట్ పెద్ద డాన్: నటి

ప్రముఖ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద డాన్ అని, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి విషయమూ ఆయన చేతుల్లోనే ఉంటుందని నటి, మోడల్ లువియానా లోథ్ ఆరోపించారు. మహేష్ భట్ బంధువైన సుమిత్ సబర్వాల్‌ను లువియానా వివాహం చేసుకున్నారు. ఇటీవల విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుమిత్, మహేష్ భట్‌పై ఆరోపణలు చేస్తూ ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. 


`మహేష్ భట్ బంధువు సుమిత్ సబర్వాల్‌ను కొంత కాలం కిందట నేను పెళ్లి చేసుకున్నాను. అయితే సినీ పరిశ్రమలోని పలువురు హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ సరఫరా చేస్తాడని తెలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాను. ఈ విషయాలన్నీ మహేష్ భట్‌కు తెలుసు. ఆయన ఇండస్ట్రీకి పెద్ద డాన్. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి విషయమూ ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆయన చెప్పినట్టు వినని వారి జీవితాలను నాశనం చేస్తాడు. నా ఇంట్లో నుంచి నన్ను వెళ్లగొట్టాలని చూస్తున్నాడని గతంలో ఆయనపై కేసు పెట్టాను. పోలీసులు నా ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇప్పుడు మా కుటుంబ భద్రత కోసమే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. నాకు, నా కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి మహేష్ భట్, ముఖేష్ భట్, సుమిత్ సబర్వాల్, సాహెల్ సెహగల్, కుంకుమ్ సెహగల్ కారణమ`ని లూవియానా పేర్కొన్నారు. కాగా, లూవియానా ఆరోపణలు పూర్తి అవాస్తవాలని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేష్ భట్ తరఫు న్యాయవాది వెల్లడించారు.