Abn logo
Sep 13 2020 @ 03:30AM

ఎల్‌ఆర్‌‘ఎస్‌’

Kaakateeya

వికారాబాద్‌ జిల్లాలో 435 అక్రమ లేఅవుట్లు 

పంచాయతీల పరిధిలో 221.. మునిసిపాలిటీల్లో 214 

అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ ఛాన్స్‌

దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెల 15 వరకు గడువు

క్రమబద్ధీకరించుకుంటేనే ప్రభుత్వ అనుమతులు

ఎల్‌ఆర్‌ఎ్‌సపై అధికారులు విస్తృత ప్రచారం 


జిల్లాలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను అధికారులు గుర్తించారు. వాటి క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకోవాలని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.  అయితే గడువులోగా దరఖాస్తు చేసుకోకపోతే  రిజిస్ట్రేషన్లు చేయరని, భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వరని  సూచిస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): జిల్లాలో 435 అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 15 మండలాల్లో 59 గ్రామ పంచాయతీల పరిధిలో 221 అక్రమ లేఅవుట్లు ఉండగా, నాలుగు మునిసిపాలిటీల పరిధిలో 214 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు పంచాయతీ, మునిసిపల్‌ అధికారులు గుర్తించారు. అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల యజమానులుప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎ్‌సను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ జిల్లా పంచాయతీ, మునిసిపల్‌ శాఖల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు వచ్చేనెల 15వ తేదీలోగా క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని, లేనిపక్షంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేయరని, ఇది వరకే రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉన్న వారికి భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరనే విషయం గుర్తు చేస్తూ అక్రమ లేఔట్లు ఉన్న గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. బషీరాబాద్‌ మండలంలో మూడు గ్రామా ల్లో 7 లేఅవుట్లు ఉండగా, బొంరా్‌సపేటలోని ఓ గ్రామంలో ఒకటి, ధారూరు మండల పరిధిలో నాలుగు గ్రామాల్లో 20, దోమలోని నాలుగు గ్రామాల్లో 6, దౌల్తాబాద్‌లోని ఓ గ్రామంలో ఒక లేఅవుట్‌ ఉన్నట్లు గుర్తించారు.


కొడంగల్‌ మండలంలో మూడు గ్రామాల్లో 7, కోట్‌పల్లి మండల పరిధిలో 3, కులకచర్లలోని నాలుగు గ్రామాల్లో 12, మర్పల్లిలోని రెండు గ్రామాల్లో 4, నవాబుపేటలోని పది గ్రామాల పరిధిలో 14, పరిగిలోని ఎనిమిది గ్రామాల్లో 21, పెద్దేముల్‌లోని రెండు గ్రామాల పరిధిలో 23, పూడూరులోని రెండు గ్రామాల్లో 3, తాండూరులోని ఎనిమిది గ్రామాల్లో 47, యాలాలలోని ఆరు గ్రామాల్లో 52 అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామీణ ప్రజలకు ఎల్‌ఆర్‌ఎ్‌సపై సరైన అవగాహన కల్పించేందుకు పంచాయతీ శాఖ ప్రచార కార్యక్రమం చేపట్టింది.


12,675 అక్రమ ప్లాట్లు

జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో 214 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించా రు. పరిగి మునిసిపల్‌ పరిధిలో 117, వికారాబాద్‌ పరిధిలో 81, తాండూరు పరిధిలో 11, కొడంగల్‌ పరిధిలో 5 అక్రమ లేఅవుట్లు ఉన్నా యి. ఈ లేఅవుట్లలో మొత్తం 12,675 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు తీశారు. పరిగి మునిసిపాలిటీలో 8,214, వికారాబాద్‌లో 3,018, తాండూరులో 900, కొడంగల్‌ మునిసిపాలిటీ పరిధిలో 480 అక్రమ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అక్రమ లేఅవుట్లు అధికంగా ఉన్న మునిసిపాలిటీల్లో పరిగి ఒకటి కావడం గమనార్హం. పంచాయతీగా ఉన్న సమయంలో పంచాయతీ అధికారులు, పాలకుల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీల్లో కొత్తగా విలీమైన గ్రామాల్లో ఏర్పాటు చేసిన అనధికార లేఅవుట్లలో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు 2 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం విలీన గ్రామాల్లో అమలు చేసిన ఎల్‌ఆర్‌ఎ్‌సను మునిసిపాలిటీలు, పంచాయతీలకు వర్తింపజేస్తూ చర్యలు తీసుకుంది. 


అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి.. షేక్‌ రిజ్వానా, జిల్లా పంచాయతీ అధికారి, వికారాబాద్‌ 

గ్రామ పంచాయతీల పరిధిలో అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరించుకోవాలి. వ్యక్తిగత ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకునేందుకు దరఖాస్తుకు రూ.వెయ్యి, లేఅవుట్‌దారులు రూ.10 వేలు దరఖాస్తు ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు ప్లాట్ల యజమానులు తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలి. నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరించుకోకపోతే ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయడానికి, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు ఇవ్వరు. ప్రభుత్వం కల్పించిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.

Advertisement
Advertisement