Abn logo
Oct 22 2021 @ 22:26PM

చెత్త వాహనాలను అడ్డుకున్న స్థానికులు

వాహనాలు వెళ్ళకుండా రోడ్డు మీద గుంతను తవ్విస్తున్న వైస్‌ చైర్మన్‌, స్థానికులు

నస్పూర్‌, అక్టోబర్‌ 22 : సీసీసీ ముక్కిడి పోచమ్మ దేవాలయం సమీపంలో డంపింగ్‌ యార్డు వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇక్కడి నుంచి చెత్త నిల్వలను తరలించాలని శుక్రవారం స్థానికులు వాహనాలను అడ్డుకున్నారు. నస్పూర్‌ మున్సిపాలిటీకి కేటాయించిన స్థలంలో మంచిర్యాల మున్సిపాలిటీ చెత్తను వేస్తున్నారని, కుళ్ళిన కూరగాయలు, పండ్లు, చనిపోయిన జంతువులు, కోళ్ళ వ్యర్థాలు ఇక్కడ వేయడంతో దుర్గంధంతో చుట్టుపక్క నివాసాల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన వాహనాలు రోజు 40 టన్నుల వరకు చెత్తను  ఇక్కడకు తరలిస్తున్నారని తెలిపారు. వాహనాలు రాకుండా రోడ్డుపై కందకం తవ్వించారు. ఆర్‌కే-5 కాలనీ, నాగార్జున కాలనీ, సీసీసీ ఏరియాల్లో దుర్గంధం భరించ లేకుండా ఉందని నస్పూర్‌ మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌ తోట శ్రీనివాస్‌ పేర్కొన్నారు.  మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ అక్కడకు చేరుకోగా డంపింగ్‌ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.  స్థానికులు సింహాచలం, మల్లేష్‌, సాతూరి రమేష్‌, రవి తదితరులు పాల్గొన్నారు.