Abn logo
May 2 2020 @ 01:49AM

గిరిజనులకు దక్కని ‘లోకల్’ న్యాయం

సుప్రీం కోర్టు తీర్పును పరిశీలిస్తే, ప్రభుత్వం ఎక్కడా గిరిజన సమస్యలపై సమాచారాన్ని గానీ, నివేదికను గానీ సమర్పించి వాదన వినిపించిన ఛాయలు కనిపించడం లేదు. నిబద్ధతతో నిలబడగలిగి ఉండడానికి, నామమాత్రంగా నిలబడి ఉండడానికి కోర్టులో తేడా తెలుస్తుంది. లోకల్ ఎకానమీనే నమ్ముకుని బతికే గిరిజనులకు న్యాయం లోకల్‌గానే జరుగుతుంది. ఈ చిన్న సూత్రం ప్రభుత్వం, కోర్టులు రెండు సీరియస్‌గా తీసుకున్నట్టు లేవు. ఇప్పటికైనా, ఈ కేసును పార్లమెంటరీ బెంచ్‌కు అప్పజెప్పమని తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ఏమన్నా చేస్తాయేమో వేచి చూడాలి. ఈ సమస్యపై ప్రత్యేక కమిటీని నియమించి నివేదికను సుప్రీం కోర్టు ముందు ఉంచి అయినా మళ్ళీ అప్పీల్‌కు వెళ్ళగలగాలి.


సుప్రీం కోర్టు ‘లోకల్ ట్రైబల్ రిజర్వేషన్’ మీద ఇటీవల ఇచ్చిన తీర్పు ఒక ప్రధానమైన ప్రశ్నను మరిచింది. సత్యం అంటే ఏంటి? సత్యం అన్నది ఒక ‘తటస్థ వాస్తవికత’ (objective reality). ఇది అనంతమైన దర్యాప్తునకు నిలబడే విషయం. మనకు కోర్టులు ఉన్నది ఈ సత్యాన్ని తెలపడానికే. పార్లమెంటులో ఉన్న 790మంది సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో ఐడియాలజీతో, ఒక్కో అజెండాతో ఉండి, కొన్ని అవసరాల దృష్ట్యా ఒక ‘సత్యాన్ని’ విడమరిచే దశలో తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు నిష్పాక్షికంగా విషయాన్ని పరిశీలించి, రాజ్యాంగ స్ఫూర్తి మేరకు తప్పులు సరిదిద్దే సంస్థ సుప్రీం కోర్టు.


2000 జనవరి 10న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 3 ప్రకారం ట్రైబల్ (షెడ్యూల్డ్) ఏరియాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులను 100 శాతం ‘లోకల్ ట్రైబల్’ వాసులకు మాత్రమే కేటాయించాలి. దీనికి వ్యతిరేకంగా అప్పటి హైకోర్టులో వేసిన రిట్‌కు వ్యతిరేకంగా హక్కుల యోధుడు బాలగోపాల్ పోట్లాడాడు. ఇక్కడ గెలిచాక, సుప్రీం కోర్టులో వేసిన అప్పీల్‌లో వాస్తవం వీగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలలో టీచర్ల స్థానాలు ఖాళీగానో, లేదా హాజరుకాలేని పరిస్థితిలోనో ఉండేవి. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ జీవో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని ఖమ్మం, విజయనగరం, శ్రీకాకుళం, ఆదిలాబాద్ మొదలైన జిల్లాలలోని 5938 గ్రామాలకు వర్తిస్తుంది. తీవ్రమైన టీచర్ల గైర్హాజరీతో కునారిల్లుతున్న అక్కడి సెకండరీ గ్రేడ్ స్కూల్స్‌కు సంబంధించి అప్పటి ఏపీ తీసుకున్న నిర్ణయమిది. అది గైర్హాజరీకి సంబధించిన సమస్య మాత్రమే కాదు, లోకల్ ట్రైబల్స్‌ హక్కులకు సంబంధించినది కూడా. 


గిరిజనులు అంటేనే ఒక ‘లోకల్ ఎకానమీ’లో బతికేవాళ్ళు. 70ఏళ్ళు మించిన గిరిజన రిజర్వేషన్లు పెద్దగా సాధించింది ఏమీ లేదు. ఇప్పటి వరకు గిరిజన జనాభాలో కేవలం 4.5% మాత్రమే (Caste Census 2011 ప్రకారం) పదివేల రూపాయలకు మించి సంపాదిస్తున్నారు. ఈ తప్పుడు కుల జనాభా లెక్కల విశ్లేషణ ప్రభుత్వం పూర్తిగా బయటపెట్టటం లేదుగాని, ఇంకో స్లాబ్ 10,000--- నుంచి 20,000 అని పెడితే అందులో ఇక సగానికి సగం ఈ కేటగిరీలో వచ్చే సంభావ్యతే ఉంది. ఇప్పటికి కూడా ‘లోకల్ ఎకానమీ’ మీద మాత్రమే బతికే గిరిజనుల శాతమే ఈ దేశంలో ఎక్కువ. అంటే వీరి జీవన విధానం ‘లోకల్ ఎకానమీ’ని దాటి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయనే మనం అర్థం చేసుకోవాలి. షెడ్యూల్డ్ ఏరియాలలో అందుకే పంచాయతీ అధ్యక్షుల స్థానాలు పూర్తిగా గిరిజనులకే కేటాయించారు. సమత కేసు తర్వాత గిరిజన ప్రాంతాలలో భూములు గిరిజనేతరులకు అమ్మడం కాని లీజుకివ్వడం కాని చేయరాదు అనే నిబంధన వచ్చిందీ అందుకే. గిరిజనుల అస్తిత్వానికి, జీవనోపాధికి, సంస్కృతికి భంగం కలిగించకూడదన్న దృష్టితో ఇలా గిరిజన ప్రాంతాల్లో కొన్ని విషయాలకు ప్రత్యేకత కల్పించబడింది. 


అయితే, ఈ సెకండరీ గ్రేడ్ టీచర్ల విషయంలో 100% రిజర్వేషన్ ప్రకటిస్తే సమస్య కొత్తగా ఏమొచ్చింది? ఈ గ్రామాలలో ఎన్ని సెకండరీ గ్రేడ్ పోస్టులు సృష్టించబడు తాయి? ఎంతమంది గిరిజనులు లాభపడతారు అన్న ప్రశ్న వేసుకుంటే.. ఆ సంఖ్యేమీ గొప్పగా అనిపించదు. కానీ, ఈ చిన్న సంఖ్య కూడా గిరిజనులకు ఉపయోగపడేలా ఉండడం సుప్రీం కోర్టుకు ఇష్టం లేదనిపిస్తుంది. కోర్టులో దీనికి వ్యతి రేకంగా వినిపించిన వాదనలు ఊహాతీతమేమీ కాదు. మెరిట్‌ను చంపేస్తున్నారని సీనియర్ లాయర్లు వాదించారు. అంటే వీళ్ళు ట్రైబల్ ఏరియాలలో ఉండే గిరిజనుల మెరిట్ దెబ్బతింటుందని బాధ వ్యక్తం చేసారన్నమాట! ఆ వాదనను సుప్రీం ఎటువంటి ఖండనలేకుండా గమనంలోకి తీసుకుంది. 1992లో ఇంద్ర సాహ్నీ కేసులో అప్పటి సుప్రీం కోర్టు జస్టిస్ జీవన్ రెడ్డి రిజర్వేషన్లు 50% మించరాదని రూలింగ్ ఇచ్చినా కనీసం రిజర్వేషన్లు మెరిట్‌ను దెబ్బతీస్తాయనే వాదననైనా తోసిపుచ్చారు. 


ఇక ప్రస్తుత కేసు విషయానికొస్తే.. సుప్రీం కోర్టు ఏ ప్రధాన ప్రాతిపదికన 100% రిజర్వేషన్‌ను తోసిపుచ్చింది అని చూస్తే.. నూరు శాతం రిజర్వేషన్లు ఉండరాదు అని ఒక సూత్రంగాను, గిరిజన ప్రాంతాలలోని గిరిజనేతరులు నిర్లక్ష్యానికి గురవుతునట్టు భావిస్తూనూ ఈ నిర్ణయం తీసుకుందని అర్థమవుతుంది.


రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీం కోర్టు నిర్ణయించింది వాస్తవమే. ఈ 50% రిజర్వేషన్లు ఎంతవరకు అమలు చేయబడ్డాయి? లోక్‍సభలో సమర్పించిన ఒక రిపోర్టు ప్రకారం ఢిల్లీ యూనివర్సిటీల్లో సుమారు 270 మంది ప్రొఫెసర్లలో ఎస్సీల నుంచి కేవలం ముగ్గురు ప్రొఫెసర్లు ఉండగా, గిరిజనుల నుండి ఒక్కరు కూడా లేరు. అదే విధంగా 270 అసోసియేట్ ప్రొఫెసర్లలో షెడ్యూల్డ్ కాస్ట్ నుండి ఏడుగురు ఉండగా, గిరిజనుల నుండి ఒక్కరు మాత్రమే ఉన్నారు. రిజర్వేషన్లు ఇలా అమలు చేసే ప్రజాస్వామ్యంలో ‘లోకల్ ఎకానమీ’కి పరిమితమైన గిరిజనులకు 100% రిజర్వేషన్లు ఇవ్వటం వలన, మొత్తం రిజర్వేషన్లలో గిరిజనుల ప్రాతినిధ్యం 7.5% దాటే ప్రసక్తే లేదు. ఈ ప్రాతిపదిక మీద రూలింగ్ ఇచ్చే ముందు సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రిజర్వేషన్ అమలులో గిరిజనులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పోస్టులకు నియామకాలు అయ్యాయి, ఈ ‘లోకల్ ట్రైబల్’ రిజర్వేషన్ వలన ఎన్ని పోస్టులు అదనంగా భర్తీ చేయబడతాయి, అప్పుడు మొత్తంగా రిజర్వేషన్ ఎంత అవుతుంది అని ఒక అంచనాకు రాకుండా, 50% రిజర్వేషన్ అనే సూ త్రాన్ని సైంటిఫిక్‌గా అర్థం చేసుకోవడంలో విఫలమైంది. ఆ డేటాను పరిశీలించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా, అది 100శాతంకానీ, 50శాతంకానీ, 25శాతం కానీ... ఏదైనా సరే అర్థవంతంగా ఉండేది. కానీ కనీస విశ్లేషణకు తావు లేకుండా, సరైన సమర్థన లేకుండా, యాంత్రికంగా రాజ్యాంగ సూత్రాలను అన్వయించింది. అయోధ్య, సీఏఏ కేసుల్లో స్టే ఇవ్వకపోవడం చూస్తే.. ఇవన్నీ కూడా ఒక అవగాహనతో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో వస్తున్న నిర్ణయాలని అనిపించటం లేదు.


ఇక ఈ 100% రిజర్వేషన్ల ప్రతిపాదనను తోసిపుచ్చటంలో గిరిజనేతరులు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్న సుప్రీం కోర్టు భావనను పరిశీలిద్దాం. అది తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రస్తావన చేసింది. ఖమ్మంలో 9మండలాల్లో 50శాతం కన్నా ఎక్కువ గిరిజనులు ఉన్నారు. అయితే విద్యార్థులు మాత్రం 25శాతం మాత్రమే ఉన్నారు. అలాగే పశ్చిమ గోదావరిలో 40శాతం గిరిజనులున్నారు. కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్టు నుండి అగ్ర కులాల వరకు స్థానికంగా బతుకుతున్నవాళ్ళు అందరూ నష్టపోతారు అనే నిర్ణయానికి వచ్చింది. ఈ లెక్కలు వాస్తవమే. అయితే, ఖమ్మంలో రూ.10,000కంటే జీతం సంపాదించే గిరిజనులెంత మంది, గిరిజనేతరులెంతమంది? అక్కడి ప్రభుత్వ పాలనలో ఉన్న గిరిజనులెంతమంది, గిరిజనేతరులెంతమంది? ఈ విషయాల్లో దర్యాప్తు మాత్రం సుప్రీం కోర్టు చేయలేదు. గిరిజనులు మెజారిటీగా ఉండే గిరిజన ప్రదేశాల్లో ఆర్గనైజ్డ్ రంగంలో అయినా, ప్రభుత్వ పాలనలో అయినా ఉండేది అత్యధికంగా గిరిజనేతరులే అనేది అందరికీ తెలిసిందే. అదనపు హక్కులు, అదనపు హోదా కలిగిన జీవితాన్ని గడుపుతున్న గిరిజనేతర వర్గాల హక్కులకూ, స్థానికంగా ఉండే గిరిజన హక్కులకు సారూప్యత ఎక్కడుందో కోర్టు విశదీకరించలేదు. కేవలం సంఖ్యా బలం ప్రకారం పోతే, రిజర్వేషన్ల అర్థం చాలా పరిమితంగా కనిపిస్తుంది. ఆర్గనైజ్డ్ రంగంలో ఆయా కేటగిరీలకు ఉండే ప్రాతినిధ్యం ఏంటి? అధికార రంగంలో, పాలనా రంగంలో ఉండే ప్రాతినిధ్యం ఏంటి? అని అధ్యయనం చేయకుండా, కనీసం ఒక నివేదికనైనా తెప్పించుకోకుండా తీర్పునివ్వడం సహేతుకం కాదు.


ఇదిలా ఎందుకు జరుగుతుంది? సుప్రీం కోర్టులో మహామహులు లేరా లేక ప్రభుత్వం తరపున పని చేసే లాయర్లకు బలం లేదా? అన్న సందేహం వస్తుంది. అసలు విషయం ఏమంటే.. గిరిజనులెవరూ ఈ సమస్య గురించి అర్థం చేసుకుని రిప్రెజెంట్ చేసే పరిస్థితిలో లేకపోవడం వ్యవస్థాపరంగా దారుణమైన పరిమితి. బాలగోపాల్ హైకోర్టులో గిరిజనుల తరపున పోట్లాడి అనుకూలమైన తీర్పు సంపాయించగలిగాడు. ఇప్పట్లో హక్కుల పోరాట యోధులలో అటువంటి శక్తి క్షీణించింది అని చెప్పవచ్చు. రిటైర్ అయిన చీఫ్ జస్టిస్ రాజ్యసభకు నియమితమవ్వడం దేశంలో మొదటిసారి జరిగింది. పైగా బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వాల్లా సుప్రీంకోర్టు జడ్జీల స్థానాలను భర్తీ చేయడం లేదు. ఇవన్నీ చూస్తే మనం మన చుట్టు ధృఢమైన లీగల్ వ్యవస్థను ఏర్పరుచుకునే బదులు, సాధ్యమైనంత మేరకు ఎలా సడలిస్తున్నామో తెలుస్తుంది. 


ప్రభుత్వం కూడా గిరిజన రిజర్వేషన్లను ఒక రాజకీయ సూత్రంగా చూసింది. సుప్రీం కోర్టు తీర్పును పరిశీలిస్తే, ప్రభుత్వం ఎక్కడా గిరిజన సమస్యలపై సమాచారాన్ని గానీ, నివేదికను గానీ సమర్పించి వాదన వినిపించిన ఛాయలు కనిపించడం లేదు. నిబద్ధతతో నిలబడగలిగి ఉండడానికి, నామమాత్రంగా నిలబడి ఉండడానికి కోర్టులో తేడా తెలుస్తుంది. లోకల్ ఎకానమీనే నమ్ముకుని బతికే గిరిజనులకు న్యాయం లోకల్‌గానే జరుగుతుంది. ఈ చిన్న సూత్రం ప్రభుత్వం, కోర్టులు సీరియస్‌గా తీసుకున్నట్టు లేవు. ఇప్పటికైనా, ఈ కేసును పార్లమెంటరీ బెంచ్‌కు అప్పజెప్పమని తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ఏమన్నా చేస్తాయేమో చూడాలి. ఈ సమస్యపై ప్రత్యేక కమిటీని నియమించి నివేదికను సుప్రీం కోర్టు ముందు ఉంచి అయినా మళ్ళీ అప్పీల్‌కు వెళ్ళగలగాలి. 

పి. విక్టర్ విజయ్‌కుమార్

(ఇన్వెస్ట్‌మెంట్ బేంకర్, రచయిత)

Advertisement
Advertisement
Advertisement