Abn logo
May 20 2020 @ 04:04AM

కరోనాలోనూ బోర్డు పరీక్షలా!

కరోనా నేపథ్యంలో, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు పదవ తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేశాయి. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రం రోగ తీవ్రత ఉండగానే పరీక్షల నిర్వహణకు సమాయత్తమవుతున్నాయి. పిల్లల, తల్లిదండ్రుల, టీచర్ల క్షేమం, ఆరోగ్యం పట్ల పాలకులకు బాధ్యత లేకపోవడం, బోర్డ్ పరీక్షల పట్ల మనకున్న అతివ్యామోహం ఇందుకు కారణాలు. కార్పోరేట్ విద్యా సంస్థల ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియకు పదోతరగతి పరీక్షల వాయిదా అడ్డుపడుతున్నది కనుక, వాటి ఒత్తిడి కూడా ఉన్నదని మరోవాదన. ఇక, జూన్‌లో కరోన వ్యాప్తి ఉచ్ఛస్థితికి చేరుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ చెబుతున్నారు. పిల్లల్లో వైరస్ ప్రభావం, పరస్పర వ్యాప్తి అవకాశాలు తక్కువని మొదట్లో భావించినా, అది తప్పని తెలుపుతున్న రెండు అధ్యయనాలను న్యూయార్క్ టైమ్స్‌ ఇటీవల ప్రచురించింది. పెద్దల మాదిరే పిల్లల్లో మూడవ వంతు మంది కరోన బారిన పడే ప్రమాదముందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


స్కూళ్ళు ప్రారంభమవుతే ఈ ప్రమాదం ఇంకా మూడు రెట్లు అవుతుందని ఊహాన్‌, షాంఘై నగరాల్లో జరిగిన అధ్యయనం తెలుపుతున్నది. పరిస్థితి ఇలా ఉండగా, పరీక్షా హాళ్ళు, ఇన్విజిలేటర్ల సంఖ్యను పెంచుతామని, ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేస్తామని, మాస్కులు, సానిటైజర్లను అందిస్తామని, హాళ్ళను రోజూ డిసిన్ఫెక్ట్‌ చేస్తామని చెబుతూ పదవ తరగతి పరీక్షల నిర్వహణకు తెలుగు రాష్ట్రాలు సంకల్పిస్తున్నాయి. పరీక్షల నిర్వహణ ఖర్చు తడిసి మోపెడు కావడం అటుంచితే, క్షేత్రస్థాయిలో ఈ చర్యలన్నీ సక్రమంగా అమలు జరుగుతాయని కూడా ఆశించలేము. సర్వసాధారణంగానే పబ్లిక్ పరీక్షలు పిల్లల్లో భయాన్ని, ఆందోళనను కలిగిస్తాయి. ఈ కరోనా కష్టకాలంలో నిర్వహించే పరీక్షలు వాటిని రెట్టింపు చేస్తాయి. అందువల్ల, బోర్డ్ పరీక్షలు కొలిచే విషయాలకు ఉండే ప్రామాణికత ఇంకా దిగజారిపోతుంది.


నిజానికి, ఇలాంటి సమయాల్లో ఇంటర్నల్ పరీక్షలకు కొంత వెయిటేజీ, క్రింది తరగతుల ప్రతిభకు కొంత వెయిటేజీ ఇచ్చి వాటి ఆధారంగా ప్రతిభను అంచనా వేయడం ఎంతో ఉత్తమం. కానీ, ఇంటర్నల్ పరీక్షలపై నమ్మకంలేనితనం, బోర్డ్ పరీక్ష నిర్వహించకుండా సర్టిఫికేట్ ఎలా ఇవ్వగలుగుతాం, పిల్లలు నేర్చుకున్నది ఎంతో, టీచర్లు, స్కూళ్ళ పనితీరు ఎలా తెలుస్తుందనే సంప్రదాయ ఆలోచన విధానంవల్లనే పరీక్షల నిర్వహణకు పూనుకుంటున్నారు. క్లాస్ రూమ్‌లో టీచర్ అంచనాకు మించి ఏ బోర్డ్ పరీక్షా ఫలితం ఉండదు. ఈ అవగాహన క్లాస్ రూమ్ టీచింగ్ అనుభవంలేని విధాన నిర్ణేతలకు లేకపోవడమే ప్రధాన సమస్య. పూర్తిగా వ్యాపారమయమయిన ఇంటర్ విద్యకు అడ్మిషన్స్ ఆలస్యమవుతే నష్టాలొస్తాయి కాబట్టి ఈ నిర్ణయం వెనుక వారి ప్రభావాన్ని కూడా కాదనలేం. తమ సంస్థలు అవాంతర పరిస్థితుల్లో సైతం పనిచేస్తాయని రుజువుచేయడం కోసం కార్పోరేట్ విద్యా సంస్థలు ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానాల్లో ఇంటర్ విద్యను ప్రారంభించాయి. ఆన్‌లైన్‌ విద్య పేరిట కార్పోరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులను ఆకర్షించి తమ అడ్మిషన్లను పెంచుకోబోతున్నాయి.


బోర్డ్ పరీక్షలు పిల్లల విజయాలకు ఏకైక కొలమానంగా మారినాయి. వీటితోనే టీచర్ల సార్థ్యాన్ని, జవాబుదారీతనాన్ని, స్కూళ్ళ పనితీరును అంచనా వేస్తున్నాం. దీనితో కరికులం ఎలా ప్రభావితం అయిందో, పరీక్షలలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో, విద్యా వ్యవస్థ ఎలా పరీక్షా వ్యవస్థగా మారిపోయిందో తెలిసిందే. ఈ కరోనా సంక్షోభ సందర్భంలో బోర్డ్ పరీక్షలపై వ్యామోహాన్ని వదిలించుకోవలసి ఉంది. వాటిపై వెచ్చించే సమయం, డబ్బు, శక్తియుక్తులను పిల్లల, టీచర్ల సంక్షేమానికి వెచ్చించాలి. తక్కువ క్లాస్ సైజ్, ఆట పాటలకు తగిన స్థానం, పిల్లలకు, టీచర్లకూ తగిన విశ్రాంతి, టీచర్ల విద్య, స్కూళ్ళలో మౌలిక సదుపాయాల పెంపు ఇత్యాది సంస్కరణల కోసం సమయాన్ని, డబ్బును, శక్తియుక్తులను వెచ్చిస్తూ మన దృక్పథాన్ని మార్చుకోవాలి. 

ఎడమ శ్రీనివాస రెడ్డి

Advertisement
Advertisement
Advertisement