Abn logo
May 20 2020 @ 13:59PM

లైఫ్ ఆఫ్టర్ కరోనా: పిల్లలకు షాక్.. పెద్దలకు పరేషాన్

బడి గంట మోగడం లేదు. కాలేజీ గేటు తెరుచుకోవడం లేదు. విశ్వవిద్యాలయాల్లో సందడి లేదు. పరీక్షల పరుగు లేదు. ఫలితాల కోసం పడిగాపులు లేవు. కౌన్సెలింగ్‌లు లేవు. వేసవి సెలవుల ఆనందం లేదు. అసలు కొత్త విద్యాసంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఒకవేళ ప్రారంభమైనా పరిస్థితులు ఎలా ఉంటాయో అంతుబట్టడం లేదు. ఇదీ ప్రస్తుతం మన దేశంలోని విద్యారంగం పరిస్థితి. ఈ పరిస్థితికి కారణమైన కరోనా నుంచి ఎప్పటికి విముక్తి లభిస్తుందో, కొత్త పాఠాలు నేర్చే రోజు ఎప్పుడొస్తుందో అని అందరూ వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. 


కరోనా విలయతాండవం చూసి ప్రపంచం తీవ్ర ఉలికిపాటుకు గురైంది. లాక్‌డౌన్‌ అనే సరికొత్త కర్ఫ్యూ వాతావరణం దాదాపుగా అన్ని దేశాల్లో కొనసాగుతోంది. ఆకస్మికంగా అమలులోకి వచ్చిన ఈ ఆంక్షల పర్వంతో విద్యారంగం మొత్తం స్తబ్దుగా మారిపోయింది. ప్రాథమిక స్థాయి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ వరకూ అన్నీ విద్యాసంస్థలు తాత్కాలికంగా మూతపడ్డాయి. కళకళలాడే క్యాంపస్‌లన్నీ పూర్తిగా బోసిపోయాయి. 


సాధారణంగా మార్చి- జూన్‌ నెలలు విద్యారంగానికి ఎంతో కీలకం. పరీక్షల నిర్వహణ, స్పాట్‌ వాల్యుయేషన్, ఫలితాల వెల్లడి, కొత్త కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌లు చేపట్టడం వంటి పనుల్లో అటు విద్యాసంస్థలు- ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో బిజీబిజీగా ఉంటారు. అలాంటిది.. కరోనా వైరస్‌ దెబ్బకి విద్యా ప్రణాళికే పూర్తిగా మారిపోయింది. 


రెండు తెలుగు రాష్ట్రాల్లో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ కరికులంలో చదివే టెన్త్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. స్టేట్‌ సిలబస్‌ ప్రకారం ఏపీలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు మొదలుకాక ముందే వాయిదా పడ్డాయి. తెలంగాణలో రెండుమూడు ఎగ్జామ్స్‌ జరిగాక అర్థాంతరంగా మిగతా పరీక్షలను వాయిదా వేశారు. అవి ఎప్పుడు జరుగుతాయో తెలీదు. ఇంటర్‌ ఎగ్జామ్స్‌ మాత్రం పూర్తయ్యాయి. ఈ మధ్యే స్పాట్‌ వాల్యుయేషన్‌ మొదలైంది. వీటికి సంబంధించిన రిజల్ట్‌ ఎప్పుడు ప్రకటిస్తారో స్పష్టత లేదు. ఇక సెంట్రల్‌ సిలబస్‌ విషయానికి వస్తే.. అందులో పదో తరగతి పరీక్షలు కొన్ని జరిగాయి. నాలుగు పేపర్స్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పన్నెండో తరగతి పరీక్షలకు మాత్రం బ్రేక్‌ పడిపోయింది. డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సిలబస్సూ పూర్తి కాలేదు- ఎగ్జామ్స్‌ కూడా జరగలేదు. కొత్త విద్యాసంవత్సరానికి నాందిగా చెప్పుకునే జేఈఈ మెయిన్స్‌- అడ్వాన్స్‌డ్‌, ఎంసెట్‌, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా బోర్డులు పెట్టేశాయి. ఇంటర్‌ ఫలితాలు వస్తే కానీ ఎంసెట్‌ నిర్వహణకి వీలుపడదు. 


తెలంగాణలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకి హైకోర్టు ఓకే చెప్పింది. జూన్‌ మొదటివారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది. జూన్‌ 3వ తేదీ నాటికి రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని కోరింది. అప్పటికి కేసుల తీవ్రత పెరిగితే.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే.. జులై పదవ తేదీ నుంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహించబోతున్నట్టు తాజాగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. 11 పరీక్ష పేపర్లను 6కి కుదించింది. అంటే ప్రతి సబ్జెక్టులో ఒక పరీక్షను మాత్రమే నిర్వహించబోతోంది. జులై ఫస్ట్‌ నుంచి 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నట్టు సీబీఎస్‌ఈ ప్రకటించింది. 


పదవ తరగతి పరీక్షలు వాయిదా పడటంతో ఆయా విద్యార్థులకు ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలలు కూడా తమ పిల్లలకు ఈ తరహా క్లాసులు కొనసాగిస్తున్నాయి. అయితే క్లాస్‌ రూమ్‌లో పాఠాలు వినడానికి అలవాటుపడిన పిల్లలు డిజిటల్‌ టీచింగ్‌ పట్ల అంత ఆసక్తి కనబరచడం లేదు. ఈ పరిణామం పట్ల పిల్లల తల్లిదండ్రులు తీవ్ర నిర్వేదాన్ని వ్యక్తంచేస్తున్నారు. దీనికితోడు డిజిటల్‌ పాఠాలు చెప్పే టీచర్లకి కూడా సరైన శిక్షణ లేదు. దొందుకు దొందు అంటే ఇదే మరి! 


ప్రపంచ విద్యారంగాన్నే కరోనా ఓ కుదుపు కుదిపిందని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఏర్పడ్డ ఈ గ్యాప్‌ని ఎలా పూరించుకోవాలో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఒకవేళ విద్యారంగంలో చలనం మొదలైనా.. పరిస్థితి గాడిలో పడటానికి మూడు నెలలకు పైనే పట్టవచ్చునంటున్నారు. మరోవైపు.. జూన్‌ నెలాఖరు వరకు కరోనా ప్రమాద ఘంటికలు కొనసాగుతాయన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విద్యాసంవత్సరం ఎప్పుడు, ఎలా మొదలవుతుందన్న సందేహం అందరిలో నెలకొన్నది. అయితే ఈ అంశంపై ఇటీవల యూజీసీ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్‌ ఫస్ట్‌ నుంచి కాలేజీలు మొదలవుతాయని ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటన విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులకు కూడా కొంత ఊరటనిచ్చిందని చెప్పక తప్పదు!


కరోనా వల్ల మన విద్యారంగం ఒక సంక్లిష్ట సమస్యలోకి జారుకున్న మాట వాస్తవం. ఇప్పటివరకూ పాటించిన పరీక్షల విధానం ప్రకారమే ముందుకెళ్లాలంటే కాలయాపన జరిగేలా కనిపిస్తోంది. అందువల్ల ఈ సమస్యని అధిగమించడానికి షార్ట్‌కట్‌ ఏమైనా ఉందా అని అన్వేషించడం మంచిదని పరిశీలకులు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఎగ్జామ్స్‌కి షెడ్యూల్‌ ప్రకటించాలనీ, ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్షలు నిర్వహించి త్వరగా జీపీఏ ప్రకటించాలనీ వారు సూచిస్తున్నారు. లేదంటే ఆయా పాఠశాలల్లో నిర్వహించిన ప్రీఫైనల్‌ ఎగ్జామ్స్‌ ఆధారంగా ప్రమోట్‌చేసే వీలుందా అని ఆలోచిస్తే మంచిదని కూడా అంటున్నారు. పదవ తరగతిలోపు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేసే పద్ధతిలోనే ఈసారి టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేస్తే మంచిదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 


పరీక్షల నిర్వహణ కూడా విద్యాశాఖకు పెను సవాల్‌గా మారింది. ఎగ్జామ్స్‌ మొదలైతే పరీక్షలు జరిగినన్ని రోజులు లక్షలాది మంది విద్యార్థులు ఆయా సెంటర్లకు తరలివస్తారు. వేలసంఖ్యలో ఇన్విజిలేటర్ల, విద్యాశాఖ సిబ్బంది, పోలీసులు ఒక సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రాణాంతక కరోనా మాత్రం ఇప్పట్లో మనల్ని వదిలేలా కనిపించడంలేదు. ఈ పరిస్థితిలో పరీక్షలు జరపడం మంచిది కాదని కొందరు వాదిస్తున్నారు. ఎవరైనా విద్యార్థి లేదా సిబ్బంది నుంచి మిగతావారికి కరోనా సోకితే.. అది ఎంతోమందికి అంటుకునే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. 


కరోనా వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకానొక సందిగ్ధస్థితి ఏర్పడింది. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు వేసుకున్న ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. కరోనాకి ముందు వరకు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో తమ పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని వారు ఆరాటపడ్డారు. అలాంటిది ఇప్పుడు విదేశీ చదువు అన్న ఆలోచన వస్తేనే జడుసుకుంటున్నారు. ఒకటికి పదిసార్లు ఖర్చుల లెక్కలు వేసుకుంటున్నారు. మధ్యతరగతి జీవులయితే తమ పిల్లలను విమానాలు ఎక్కించాలన్న ధ్యాసకి చెల్లుచీటీలు ఇచ్చేస్తున్నారు. విద్యార్థుల ఆలోచనలు కూడా ఇదే తరహాలో కొనసాగుతున్నాయి. లండన్‌కి చెందిన క్వాక్‌ క్వారల్లీ సైమండ్స్‌ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన "ఇండియన్‌ స్టూడెంట్స్‌ మొబిలిటీ రిపోర్ట్‌- 2020'' ప్రకారం విదేశీ విద్యపై కలలుగన్నవారిలో సుమారు 48 శాతం మంది విద్యార్ధులు ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారట! ఇదంతా కూడా కరోనా మాయగానే చెప్పుకోవాలి..!


లాక్‌డౌన్‌ వల్ల తలెత్తిన విపరిణామాలను విదేశీ విశ్వవిద్యాలయాలు సైతం నిశితంగా గమనిస్తున్నాయి. భారతీయ విద్యార్థుల అడ్మిషన్లను నిలబెట్టుకోవడానికి కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేక మినహాయింపులను ప్రకటిస్తున్నాయి. ఫ్యాకల్టీలు ఇచ్చే సిఫారసు లేఖలు, జీఆర్‌ఈ వంటి పరీక్షల విషయంలో పూర్వంలా పట్టుబట్టమని చెబుతున్నాయి. స్కాలర్‌షిప్పులు కూడా ఇస్తామంటున్నాయి. కొన్ని వర్సిటీలు అయితే.. రెండు నెలలపాటు విద్యార్థులకు ఫ్రీ అకామిడేషన్ ఇస్తామంటున్నాయి. తమ క్యాంపస్‌లో చేరినవారు నిర్దిష్ట సమయం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది కనుక ఈ ఆఫర్‌ ఇస్తున్నాయి.  


ఇక మన దేశంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల విషయానికి వస్తే.. కరోనా కాలంలోనూ కాసుల కోసం అవి ఆరాటపడుతున్నాయట! ఫీజులను వసూలు చేయవద్దని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ మాటలు పెడచెవిన పెట్టి.. ఫీజు బకాయిలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయట. ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ అంటూ హడావుడి కూడా చేస్తున్నాయట. ఈ పరిణామాలపై విద్యాశాఖ పెద్దలు దృష్టిసారించాలని పేరెంట్స్‌ గట్టిగా కోరుతున్నారు. 


ఇకపోతే.. కరోనా దెబ్బకి దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో సందడి తగ్గడం గమనార్హం. నిజానికి పరీక్షల సమయంలో ఆయా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజు ఇన్‌స్టాల్‌మెంట్లను, ఇతర బకాయిలను పిండేస్తుంటాయి. లాక్‌డౌన్‌ వల్ల పరీక్షలు వాయిదా పడటం, కొత్త విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని అయోమయం నెలకొనడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చురుకుదనం తగ్గిపోయింది. కొత్త అడ్మిషన్లపై ఈ ప్రభావం బాగా పడింది. 


సాధారణంగా టెన్త్‌, ఇంటర్‌ ఎగ్జామ్స్‌ ఫలితాల తర్వాత కార్పొరేట్‌ విద్యాసంస్థలు బాగా క్యాంపయినింగ్‌ కొనసాగించేవి. పత్రికల్లో, టీవీల్లో ఎక్కడ చూసినా ర్యాంకుల ప్రకటనలే కనిపించేవి- వినిపించేవి. కరోనా వల్ల ఈ ఆర్బాటాలన్నీ బంద్ అయ్యాయి. చిన్న, మధ్యతరహా ప్రైవేట్‌ విద్యాసంస్థల ఆదాయానికి బాగానే గండిపడింది. ప్రతీ ఏడాది విద్యార్థుల ఫీజులు 5 నుంచి 20 శాతం వరకు పెంచుతుంటారు. ఈసారి పెంపు లేకపోగా.. ఉన్న ఫీజులనే గట్టిగా అడగలేని దుస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ వల్ల అన్ని వర్గాల ప్రజలు ఆర్థికపరమైన ఆటుపోట్లకి గురయ్యారు. అందువల్ల కొత్త విద్యాసంవత్సరంపై కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ఆశలు వదిలేసుకున్నాయి. దీనికితోడు పొదుపు చర్యలలో భాగంగా తమ స్టాఫ్‌ని తగ్గిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. 


కరోనా విపత్తు అనేది ఒక విపరిణామం. దీనికి ఏ రంగమూ అతీతం కాదు. అందుచేత.. విద్యారంగం ఈ అవరోధాన్ని సమర్థంగా అధిగమించి పురోగమించాలని కోరుకుందాం. ఎందుకంటే.. ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు రేపటి పౌరుల్ని తీర్చిదిద్దే కార్యక్షేత్రాలు. కనుక అవి ఎంత త్వరగా ఈ సమస్యని అధిగమిస్తే దేశానికి అంత మంచిది! 


లాక్‌డౌన్‌ వల్ల వచ్చే విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతుందని ఇప్పటికే అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకి ఒత్తిడి తగ్గించే చర్యల్లో భాగంగా సీబీఎస్‌ఈ తమ సిలబస్‌ని కుదించేందుకు సమాయత్తమవుతోందట. ఐసీఎస్‌ఈ కరికులంలో కూడా ఇదే విధానం పాటిస్తే మంచిదని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు ఎలాంటి సూచనలు చేసినా, చర్యలు చేపట్టినా అంతిమంగా అవి విద్యార్థుల శ్రేయస్సుకి దోహదపడేలా ఉండాలని కోరుకుందాం. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement