Abn logo
May 13 2020 @ 03:17AM

మరో జల పోరాటానికి సంసిద్ధమవుదాం!

తెలంగాణ సమాజం ఉలిక్కిపడేలా జీవో 203 విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. ఆయన నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా జీవో ద్వారా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచింది. దీంతోపాటు ఎస్.ఆర్.బి.సి., జి.ఎన్.ఎస్.ఎస్.ల సామర్థ్యం పెంచేందుకు రూ.6829 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయాలతో ఇప్పటికే నిత్యం లక్షలాది మంది వలసలు, ఫ్లోరైడ్, నిరంతర దుర్భిక్ష పరిస్థితులతో అల్లాడుతున్న దక్షిణ తెలంగాణ నిస్సందేహంగా ఎడారిగా మారుతుంది. దక్షిణ తెలంగాణకు వాటిల్లబోతున్న నష్టాన్ని అడ్డుకోవడానికి ఇక్కడి ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా గొంతెత్తాలి.


యావత్ ప్రపంచం కరోనా మహమ్మారిపై సమిష్టి యుద్ధం చేస్తుండగా ఇదే అదనుగా భావించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయే కార్యాచరణలో పడ్డారు. తెలంగాణ సమాజం ఉలిక్కిపడేలా జీవో 203 విడుదల చేశారు. ఆయన నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా జీవో ద్వారా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచింది. దీంతోపాటు ఎస్.ఆర్.బి.సి., జి.ఎన్.ఎస్.ఎస్.ల సామర్థ్యం పెంచేందుకు రూ.6829 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అంటే పోతిరెడ్డిపాడు నుంచి 8 టిఎంసీలు, అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలోని సంగమేశ్వరం ద‌గ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తగా నిర్మించతలపెట్టిన పంపింగ్ స్టేషన్ నుంచి మరో 2 టిఎంసీల నీటిని 30 రోజులపాటు కృష్ణా జలాలను తరలించుకపోవడం. ఇదే జరిగితే ఇప్పటికే నిత్యం లక్షలాదిమంది వలసలు, ఫ్లోరైడ్, నిరంతర దుర్భిక్ష పరిస్థితులతో అల్లాడుతున్న దక్షిణ తెలంగాణ నిస్సందేహంగా ఎడారిగా మారుతుంది.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల‌ ఉమ్మడి శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 884 అడుగులు ఉండగా- పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేట‌రీ తూము మట్టం (stilt level) 841 అడుగులు. తాజాగా సంగమేశ్వరం దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న పంపింగ్ స్టేష‌న్‌ను 794 అడుగుల మట్టం నుంచి నీటిని తోడుకునేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ తూము 841అడుగుల మట్టంలో ఉన్నది. కానీ శ్రీశైలం రిజర్వాయర్ నీటి వినియోగం కనీస నీటి మట్టం (MDDL) 834 అడుగులుగా ఉండ‌టం వ‌ల్ల అనుకున్న మేరకు నీటిని తోడుకునే అవకాశం లేదు. శ్రీశైలం రిజర్వాయర్ కనిష్ట నీటి మట్టం 834 నుంచి 854 అడుగులకు పెంచేందుకు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రణాళిక రచన చేసినప్పటికీ, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అది సాధ్యపడలేదు.


ఆ అనుభవంతోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయంగా రాయలసీమ ఎత్తిపోతలు పేరుతో మ‌రో ప్రాజెక్టుకు ప‌థ‌కం వేసిందన్నది ఇంజనీరింగ్ నిపుణుల అంచనా. శ్రీశైలం రిజర్వాయరులో నీటిమట్టం 800అడుగులకు పడిపోయినా సంగమేశ్వరం నుంచి ఎస్.ఆర్.బి.సి వరకు నీటిని ఎత్తిపోసేందుకు... పంపింగ్ స్టేషన్ 794 అగుడుల మట్టంతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అందుకు తగినట్లుగానే అంతర్గత కాల్వల సామర్థ్యం లైనింగ్ ద్వారా పెంచడానికి ప్రణాళిక రూపొందిచుకున్నట్లు సమాచారం. ప్రవాహం ఉన్నట్లయితే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ ద్వారా, ప్రవాహం లేనట్లయితే సంగమేశ్వర పంప్ హౌజ్ ద్వారా 794 అడుగుల నీటిమట్టం నుంచి నీటిని తోడుకుపోయే ప్రణాళిక సిద్ధం చేసిన‌ట్టు అవ‌గ‌త‌మ‌వుతుంది. అంటే ఏది ఏమైనప్పటికీ 300 టిఎంసీల నీటిని... మెుత్తం కృష్ణా నదిని రాయలసీమకు మలుపుకుపోయే కుట్ర. అంటే యావత్ దక్షిణ తెలంగాణ సాగునీటి అవసరాలను శాశ్వతంగా జలసమాధి చేయడమే.


బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానది పరివాహక ప్రాంతాలున్న మహరాష్ట్ర, కర్నాటకకు 540 టిఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టిఎంసీలు గంపగుత్త (Enbloc)గా నీటి కేటాయింపులు చేసింది. ట్రిబ్యున‌ల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన‌ 811టిఎంసీలను రాష్ట్ర విభజన నేపథ్యంలో తాత్కాలికంగా ఏపీకి 512, తెలంగాణకు 299టిఎంసీ లుగా పంచుకున్నాయి. దాన్ని ఆసరాగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు శ్రీ శైలం రిజర్వాయరుకు గండికొట్టాల‌ని భావిస్తోంది. నిబంధ‌నలేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా పెన్నా పరివాహక ప్రాంతానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట కృష్ణా నదిని మలుపుకు పోయేందుకు శ్రీకారం చుట్టింది.


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే ముం దుగా కృష్ణా రివర్ మేనేజ్‍మెంట్‌ బోర్డు (కె.ఆర్.ఎమ్.బి), ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ (కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్‌గా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు) నుంచి అనుమతి విధిగా తీసుకోవాలి. అయితే నిబంధనలేవీ పట్టించుకోకుండా పంపింగ్ ద్వారా జ‌ల‌దోపిడీకి ఏపీ అడ్డదారులు తొక్కుతోంది. ఏపీ ఇష్టానుసారంగా వ్యవహరించడంపై కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖను రాశాయి. దాన్ని కూడా పట్టించుకుపోగా, తాజాగా జీవో 203 ద్వారా పరిపాలన అనుమతులివ్వడం కయ్యానికి కాలుదువ్వడమే.


అసంబద్ధ వాదనలతో కేవలం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రయోజనాలే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పని చేశాయి. అందుకు నిర్ణయాధికారంలేని తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని అడ్డం పెట్టుకున్నాయి. పర్యవసానంగానే కృష్ణానది పరీవాహక ప్రాంతమైన నల్లగొండ, వహబూబ్ న‌గ‌ర్‌, రంగారెడ్డి జిల్లాల సాగునీటి కోసం 40ఏండ్ల కిందట శ్రీకారం చుట్టిన ఎస్.ఎల్.బి.సి., ఎఎమ్‍ఆర్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, డిండి తదితర ఎత్తిపోతల ప్రాజెక్టుల‌లో ఏ ఒక్కటి పూర్తి కాలేదు. ఫలితంగా దక్షిణ తెలంగాణ నిత్యం దుర్భిక్ష పరిస్థితులలో అల్లాడుతుంది. అందుకే కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే ఫ్లోరైడ్, లక్షలాదిమంది వలసలు, లంబాడి పిల్లల అమ్మకాలు తదితర సమస్యలు మానవ తప్పిదాలవల్ల ఉత్పన్నమైనవి.


జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించుకున్నట్లుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, సంగమేశ్వరం దగ్గర మ‌రో ఎత్తిపోత‌ల ప్రాజెక్టును నిర్మించ‌డంవ‌ల్ల ద‌క్షిణ తెలంగాణ‌కు భారీ న‌ష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనివ‌ల్ల ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీటికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు, కల్వకుర్తి, భీమా కోయిల్ సాగర్, ఎస్.ఎల్. బి.సి., ఎ‍ఎమ్ఆర్‍పి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగు నీటి అవసరాలకు చుక్కనీరు ఉండదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులన్నింటికీ కేవలం 36వేల క్యూసెక్కుల నీరే. అంటే పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరానికి ప్రతిపాదించిన దాంట్లో సగానికంటే తక్కువ. అంతేకాదు శ్రీశైలం ప్రాజెక్టులో చుక్కనీరుండదు.


నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లోకి చుక్కనీరు రాదని సాగు నీటిరంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఏండ్ల తరబడి పూర్తికాక పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు నీటిలభ్యత ఉండకపోగా, ఇప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఎంతోకొంత ఉన్న ఆయకట్టును కూడ ఎండబెట్ట డమే. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం నుంచిగానీ, ప్రజాప్రతినిధుల నుంచిగానీ, రాజకీయపక్షాల‌ నుంచిగానీ కనీస స్పందన లేదు. నదీ జలాల్లో తెలంగాణకు సమన్యాయం కావాలి అన్నది తెలంగాణ ఉద్యమ ప్రధాన డిమాండ్. దక్షిణ తెలంగాణకు వాటిల్లబోతున్న నష్టాన్ని అడ్డుకోవడానికి ఇక్కడి ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా గొంతెత్తాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు, లక్ష్యాలు సాకారం చేసుకునే క్రమంలో.. ద్రోహం చేసే రాష్ట్రీయులు, రాష్ట్రేతరులపై ఇక్కడి బుద్ధిజీవులు మరోసారి పిడికిలి బిగించాల్సిన చారిత్రక అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదు.

పల్లె రవి కుమార్

అధ్యక్షుడు, టీ జర్నలిస్టుల ఫోరమ్

Advertisement
Advertisement
Advertisement