వికారాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి)/వికారాబాద్: సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.శుభప్రద్ పటేల్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బీజేపీ సభలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నాయకులు కేసీఆర్‌ను, టీఆర్ఎస్ పార్టీని దుర్భాషలాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ రాజధానిలో రైతులు కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తుంటే ఇక్కడ బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలకడం శోచనీయమన్నారు. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, జీఎస్టీ బకాయీల వంటి అంశాలపై బీజేపీ నాయకులు దృష్టి సారిస్తే ప్రజలు హర్షిస్తారని, రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్న కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు తిరస్కరిస్తారనే విషయం తెలుసుకోవాలని ఆయన బీజేపీ నాయకులకు హితవు పలికారు. కేంద్రం దేశ సంపదను మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఆదానీ, అంబానీల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అదేవిధంగా పట్టణంలోని అతిథి గృహంలో టీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదని పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, రమేష్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా మత ఘర్షణలు జరగలేవని, శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. బీజేపీ నాయకులు ఆరోపణలు మానుకోవాలన్నారు.