Abn logo
Sep 15 2021 @ 03:47AM

మలింగ బై..బై

  • ఆ యార్కర్లను ఇక చూడలేం
  • టీ20లకూ లసిత్‌ వీడ్కోలు


రంగురంగుల రింగుల జుత్తు..ప్రపంచంలో ఏ బౌలర్‌కూ లేని వినూత్న శైలి..రివ్వున దూసుకొస్తూ పాదాలను ముద్దాడే అతడి యార్కర్లను మేటి బ్యాట్స్‌మెన్‌ సైతం ఆడలేని పరిస్థితి..పదునైన, కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించి తానాడిన జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించిన ఘనత..ముఖ్యంగా టీ20లలో డెత్‌ ఓవర్లలో అతడు బంతి అందుకున్నాడంటే విజయం వాకిట ఉన్న జట్లకూ హడల్‌..అలాంటి అద్భుతమైన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్న 38 ఏళ్ల శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ పొట్టి క్రికెట్‌కూ వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు..


కొలంబో: పొట్టి క్రికెట్‌లో ధనాధన్‌ బ్యాట్స్‌మెన్‌ ఎందరో ఉన్నా..ఆ ఫార్మాట్‌కు వన్నె తెచ్చిన ఏకైక బౌలర్‌ సెపరమాడు లసిత్‌ మలింగ. వన్డేలలోనూ తనదైన ముద్ర వేసినా..క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఓలలాడించే టీ20 క్రికెట్‌కు తన యార్కర్‌ బౌలింగ్‌తో మరింత క్రేజ్‌ తెచ్చిన మలింగ ఈ ఫార్మాట్‌కూ గుడ్‌బై చెప్పేశాడు. శ్రీలంక జట్టుకు ఎంపిక కాకపోవడంతో అతడి కెరీర్‌ పూర్తిగా ముగిసిందని ఇంతకుముందే అంతా భావించారు. ఐపీఎల్‌ సహా పలు ఫ్రాంచైజీ టోర్నీలనుంచి మలింగ ఇప్పటికే విరమించుకున్నా..ఓ చివరి టీ20తో ఆటనుంచి రిటైర్‌ అవుతాడని అతడి ఫ్యాన్స్‌ భావిస్తూ వచ్చారు. కానీ వాటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్రికెట్‌ అన్ని ఫార్మాట్లకూ గుడ్‌బై చెబుతున్నట్టు తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా మలిం   గ మంగళవారం ప్రకటించాడు. 


‘నా బూట్లకు 100 శాతం విశ్రాంతి ఇస్తున్నా. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నా. నా ఈ సుదీర్ఘ క్రికెట్‌ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. రాబోయే సంవత్సరాల్లో యువ క్రికెటర్లతో అనుభవాన్ని పంచుకొనేందుకు ఎదురు చూస్తున్నా’ అని మలింగ తెలిపాడు. ‘ఆటకు విశ్రాంతి ఇచ్చినా..క్రికెట్‌పట్ల నా ప్రేమకు మాత్రం రెస్ట్‌ లేదు’ అని చెప్పాడు. గత ఏడాది మార్చిలో వెస్టిండీ్‌సపై అతడు చివరి టీ20 ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 546 వికెట్లు పడగొట్టిన మలింగ..2011లో టెస్ట్‌లనుంచి, అనంతరం వన్డేలనుంచి వైదొలగినా టీ20లలో జాతీయ జట్టుకు ఆడుతున్నాడు.


ప్రపంచక్‌పనకు దక్కని చోటు: వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌నకు ప్రకటించిన శ్రీలంక జట్టులో మలింగకు చోటు లభించలేదు. రాబోయే పొట్టి ప్రపంచ కప్‌లో శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించాలన్న ఆకాంక్షను గత ఏడాది అతడు వ్యక్తంజేశాడు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రపంచ కప్‌ గత సంవత్సరం అక్టోబరు/నవంబరులో ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. కానీ కొవిడ్‌తో వాయిదాపడి వచ్చే నెలలో జరగనుంది. తాను అనుకున్నట్టు లంక జట్టు కెప్టెన్సీయేకాదు..కనీసం సభ్యుడిగానూ చాన్స్‌ లభించకపోవడంతో మలింగ రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలంకతోపాటు ఐపీఎల్‌లో తన జట్టు ముంబై ఇండియన్స్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌, ఇంకా ఇతర ఫ్రాంచైజీలకు థ్యాంక్స్‌ చెప్పాడు. 122 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో పాల్గొన్న మలింగ 170 వికెట్లు సాధించాడు. మెగా లీగ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌ అతడే. 5/13 ఐపీఎల్‌లో అతడి అత్యుత్తమ ప్రదర్శన. ముంబై ఇండియన్స్‌తో అతడిది 12 ఏళ్ల అనుబంధం. ఆ జట్టులో అతడి పాత్ర అత్యంత కీలకం. ముంబై ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిస్తే అందులో నాలుగు జట్లలో మలింగ సభ్యుడు. వ్యక్తిగత కారణాలతో 2020 ఐపీఎల్‌నుంచి  తప్పుకొన్నాడు. బిగ్‌బా్‌షతోపాటు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ల్లోనూ మలింగ ఆడాడు. 

4 బంతుల్లో 4

నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడే మలింగ టీ20లలో రెండుసార్లు హ్యాట్రిక్‌లు నమోదు చేశాడు. వన్డేలలో ఏకంగా మూడుసార్లు హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. 2007లో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో సౌతాఫ్రికాపై అతడి బౌలింగ్‌  ప్రదర్శన 50 ఓవర్ల క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు.