Abn logo
Jan 2 2021 @ 02:30AM

లక్ష్మణుని కోపావేశాలు

శ్రీరామునికి కుడిభుజంగా ఉండే లక్ష్మణుని సేవాభావాన్ని ప్రశంసించనివారు ఉండరు. సకల సద్గుణవంతుడైన శ్రీరామునికి తోడుగా నీడగా ఉండే లక్ష్మణునిలో కూడా ఆదర్శప్రాయమైన ఎన్నెన్నో సద్గుణాలున్నాయన్నది జగమెరిగిన సత్యమే. అటువంటి లక్ష్మణునికి.. శ్రీరాముని పట్టాభిషేకానికి ప్రత్యక్షంగా ఆటంకాన్ని కల్పించిన దశరథునిపై, కైకేయిపై, పరోక్షంగా కారణమైన దైవంపై పట్టరాని కోపావేశాలు వచ్చాయి. అందుకే.. దశరథుణ్ని, కైకేయిని శిక్షించి, శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని భావించాడు. ‘‘శ్రీరాముని రాజ్యపట్టాభిషేకానికి అడ్డుగా నిలిచే ఎవరినైనా ఓడిస్తాను. పక్షపాత బుద్ధితో భరతుడికి పట్టం కట్టాలని భావించేవారిని దండిస్తాను. కర్తవ్యాన్ని విస్మరించి.. చేయకూడని పనిని చేయడానికి సిద్ధపడిన వ్యక్తి, అధికార గర్వంతో తప్పుదారి పట్టిన వ్యక్తి..


వయసులో పెద్దవాడైనా, తండ్రి అయినా అతణ్ని శిక్షించి తీరాల్సిందే అని ధర్మశాస్త్రం ఉద్బోధిస్తోంది కదా’’ అని లక్ష్మణుడు రాముడితో అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని కోపావేశాలను తగ్గించే విధంగా మాట్లాడాడు. ‘‘లక్ష్మణా.. నీవు నాపై అమితమైన ప్రేమను కలిగి ఉన్నావని నాకు తెలుసు. నా అరణ్యవాసాన్ని గురించి నీవు దుఃఖించకు. పట్టాభిషేకానికి బదులుగా అరణ్యవాసానికి వెళ్లాల్సి రావడం నాకు కలిగిన అవమానంగా, అపకారంగా భావించకు. ఇదంతా దైవ సంకల్పం. కావున నీవు కైకేయిని కానీ, దశరథుణ్ని కానీ.. దండించాలనుకోవడం సరి కాదు. కాబట్టి, నా అరణ్యవాసానికి అవసరమైన సామగ్రిని సిద్ధం చెయ్యి. 


అసంకల్పితమేవేహ యదకస్మాత్‌ ప్రవర్తతే

నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతత్‌

మనం ఒక విధమైన ఫలితాన్ని కోరి అందుకు తగిన కార్యాచరణతో, పట్టుదలతో సంకల్పించిన పనిని పూర్తిచేయడానికి ప్రయత్నిస్తుండగా.. అనుకోకుండా హఠాత్తుగా ఆ ప్రయత్నం ఆగిపోయి, వేరొక విధంగా ఫలితం సంభవిస్తే దాన్నే దైవ సంకల్పం అంటారు.’’ అని ఊరడించాడు. అయినా లక్ష్మణుడు చల్లబడలేదు. ‘‘రాముని పట్టాభిషేకానికి ధర్మవిరుద్ధంగా విఘ్నాన్ని కలిగించిన దేవుని పనిని సైతం అంగీకరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే దైవబలం గొప్పదో, మానవ ప్రయత్నం గొప్పదో నేను లోకానికి నిరూపిస్తాను. నా శక్తితో దైవాన్ని నిలువరిస్తాను. 


దైవ నిర్ణయాన్ని మారుస్తాను. ఇంద్రాది దేవతలు అడ్డుపడినా నా బాణాలతో అణచివేస్తాను. కత్తిపట్టుకొని శత్రుసైన్యాన్ని ముక్కలు చేస్తాను. అన్నా.. నీవు ఆజ్ఞాపించు’’ అని కోపంతో ఊగిపోయాడు. సద్గుణభరితమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడు.. పెద్దల పట్ల వినయవిధేయతలు కలిగిన శ్రీరాముడికి అనుంగు సహచరుడు అయిన లక్ష్మణుడు దైవాన్ని నిందిస్తాడా? మాతృసమానురాలైన కైకేయిని, పూజ్యుడైన తండ్రిని చంపబోతాడా? అని మనం తక్కువగా భావించకూడదు. రాముని క్షేమం, హితం కోసం, ప్రజల సంతోషం కోసమే లక్ష్మణునిలో కోపావేశాలు పెల్లుబికి వచ్చాయి. శ్రీరామ భక్తియే లక్ష్మణునిలో కోపావేశాలను కలిగించింది. ధర్మ పరిరక్షణకు, ప్రజల సమాజ శ్రేయస్సుకు ఉపకరించే కోపావేశాలు అంగీకారయోగ్యమైనవేనని శ్రీరామాయణంలోని ఈ ఘట్టం మనకు తెలుపుతుంది.

 సముద్రాల శఠగోపాచార్యులు, 9059997267 

Advertisement
Advertisement
Advertisement