Abn logo
May 14 2020 @ 00:29AM

కార్మిక హక్కులే ప్రజల ప్రాణాలు

కార్మికులకు ప్రాణభద్రత కొరవడటం వల్లే పాలిమర్స్ విషవాయువు లీకైంది. తత్ఫలితమే విశాఖ పౌర సమాజం నేడు ప్రమాదానికి గురైంది. కార్మికుడి హక్కుల రక్షణకూ పౌర సమాజానికీ పరస్పర అనుబంధం ఉందని ఈ ఘటన నిరూపిస్తున్నది.


రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ యుద్ధ విమానాల బాంబుల దాడికి విశాఖపట్నం చివురు టాకులా వణికింది. 72 ఏళ్ల తర్వాత హుదూద్ తుపాన్ తాకిడికి మరోసారి వణికి పోయింది. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీకై విశాఖవాసులను మూడోసారి వణికిస్తున్నది. మొదటి రెండు సందర్భాల్లో నగర వాసులు ఎవరిళ్లలో వారు ఉండి ఆత్మరక్షణ పొందారు. కానీ, ఈసారి ఇళ్లు రక్షణ ఇవ్వలేక పోయాయి. ప్రాణాల రచేత పట్టుకొని కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. ఈ విషవాయువు దుష్ఫలితాలు దీర్ఘ కాల స్వభావం కలవి. ఇప్పుడు ప్రభావితం కాని దూర ప్రాంతాల్లోని మనుషులనే కాకుండా ఆహారం, నీరు, నేలను కూడా విషతుల్యం చేయవచ్చు.


కార్మికుడికీ, పౌరుడికీ మధ్య అవినాభావ సంబంధాన్ని ప్రస్తుత పాలిమర్స్ కంపెనీ ప్రమాదం చాటి చెప్పింది. శ్రమ దోపిడీని తీవ్ర తరం చేయాలని చూసే పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గానికి ఇప్పుడున్న నామమాత్ర కార్మిక చట్టాలు కూడా ఆటంకంగా ఉన్నాయి. వాటిని నీరు గార్చి, తుదకు రూపు మాపించే పనిలో అది ఉంది. ప్రభుత్వాల అండతో పారిశ్రామిక వర్గాలు చేయిస్తున్న ఈ పని ఫలితంగా ఆచరణలో ఇప్పటికే కార్మిక చట్టాలు చాలా వరకు నీరు గారాయి. ఎల్‌జీ పాలిమర్స్ దక్షిణ కొరియాకు చెందిన బహుళ జాతి కంపెనీ (ఎంఎన్‌సీ) కావడం వల్ల మరింత ప్రభావం ఉంటుంది. కార్మికుల హక్కులు, జీతభత్యాలకు ఉద్దేశించిన కార్మిక చట్టాలతో పాటు వారి ప్రాణ భద్రతకు సంబంధించిన ఫ్యాక్టరీల శాఖ కూడా నామ మాత్రమైనది. నిజానికి ఫ్యాక్టరీ శాఖాధికారాలు క్రియాశీలంగా ఉండి ఉంటే ఈ తరహా గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగేది కాదు.


పరిశ్రమలలో పని చేసే కార్మికుల భద్రతకు ఉద్దేశించిన చట్టాలు ఆచరణలో కార్మికేతర పౌరు లకు కూడా భద్రతను చేకూరుస్తాయని ఈ విశాఖ దుర్ఘటన రుజువు చేసింది. మూడు లేదా నాలుగు దశాబ్దాల క్రితం వరకూ సమాజంలో మధ్య తరగతి విద్యాధిక వర్గాల ప్రజల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆనాడు కార్మిక వర్గానికి ప్రాధాన్యత ఉండేది. సేవారంగాల పేరిట తెల్ల చొక్కా ఉద్యోగులు, విద్యాధిక మధ్య తరగతి ప్రజల సంఖ్య ప్రపంచీకరణ తర్వాత పెరిగింది. దీనితో పారిశ్రామిక కార్మిక వర్గానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రాచుర్యతలు క్రమంగా తగ్గాయి. శ్రమ దోపిడీని వ్యతిరేకించడంలో పారిశ్రామిక కార్మిక వర్గ సంఘటిత సామర్థ్యం కూడా తగ్గసా గింది. అవి తగ్గే కొద్దీ, పరిశ్రమల్లో కార్మికుల ప్రాణ భద్రతకు కూడా ప్రాధాన్యత తగ్గింది. కార్మికులకు ప్రాణ భద్రత కొరవడటం వల్లే పాలిమర్స్ విషవా యువు లీకైనది. తత్ఫలితమే విశాఖ పౌర సమాజం నేడు ప్రమాదానికి గురైనది. కార్మికుడి హక్కుల రక్షణ, ప్రాణ భద్రతలతో పౌర సమాజానికి పరస్పర అనుబంధం ఉందని ఇవి నిరూపిస్తున్నవి.


ప్రజల ప్రాణాల కంటే, ప్రజలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులు ఎప్పటికీ విలువైనవి కావని ఆధునిక సామాజిక నీతి బోధిస్తున్నది. మనిషి చేత సృష్టించబడి, తిరిగి అదే మనిషి చేత వినియోగిం చబడే సరుకుల కంటే మనిషే నూరు రెట్లు ఉన్నతుడు. అలాంటి మహనీయుడైన మానవుడి ప్రాణాలను బలి పెట్టి పరిశ్రమలను స్థాపించాలని ఏ ఆధునిక మానవ విలువలూ బోధించడం లేదు. కేవలం పెట్టుబడిని విస్తరించుకునే లక్ష్యం గల పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గం మానవుణ్ణి ఒక సరుకుగా దిగజార్చింది. అట్టి పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలే పరమావధిగా మారితే జనావాసాలలో పాలిమర్స్ వంటి ప్రాణాంతక పరిశ్రమల స్థాపన జరుగుతుంది. ఈ దుర్ఘటనను గుణపాఠంగా తీసుకొని, మనిషిని కేంద్రంగా చేసుకొని ఇలాంటి పరిశ్రమలను ప్రజల నివాస ప్రాంతాల్లో లేకుండా చేసే ఉద్యమాన్ని నిర్మించవలసి ఉంది.


ఏ పరిశ్రమ యాజమాన్యాల లాభ(ధన) దాహానికి ప్రజలు బలవుతున్నారో, వారికిచ్చే నష్ట పరిహారాల సొమ్మును కూడా అట్టి నేరస్థ యాజమాన్యాల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ డిమాండుతో ఒక పౌర ప్రజా ఉద్యమం నిర్మాణం కావాలి. ఏ పాపం తెలియని ప్రజలను నష్టపరిచిన నేరస్థ పారిశ్రామిక యాజమాన్యాలను వదిలేసి ప్రజల పన్నులతో కూడిన ప్రభుత్వ నిధి (ప్రజానిధి) నుండి నష్ట పరిహారం చెల్లించడం న్యాయం కాదు. కోటి రూపాయల పరిహారం సమస్యను పరిష్కరించజాలదు. ఎవరు వాస్తవ నేరస్థులో వాళ్లకు పరిహారం రూపంలో కూడా శిక్ష విధించాలి. అట్టి సామాజికోద్యమానికి విశాఖ దుర్ఘటన స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.

పి. ప్రసాద్‍

ఐఎఫ్‌టియు జాతీయ కార్యదర్శి

Advertisement
Advertisement
Advertisement