Abn logo
Feb 3 2020 @ 12:11PM

క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్.. శిక్షణకై చైనాకు వెళ్లిన కర్నూలు యువతికి..

నంద్యాల (కర్నూలు): :

చైనా నుంచి యువతి వీడియో సందేశం

వూహాన్‌లో చిక్కుకున్న కర్నూలు యువతి

శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటంతో అడ్డంకి

ఎయిర్‌ పోర్టులో నిలిపేసిన చైనా అధికారులు

ఉద్యోగ శిక్షణ కోసం వెళ్లిన అన్నెం జ్యోతి

 

బాగా చదివి క్యాంపస్‌లో ఉద్యోగం సంపాదించింది.. శిక్షణ కోసం చైనాకు వెళ్లింది. ఇంతలో కరోనా వైరస్ కలకలం మొదలైంది.. భారత ప్రభుత్వం స్పందించి.. తిరిగి రప్పించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ‘హమ్మయ్య.. ఇంకేం భయం లేదు. స్వదేశానికి వెళ్లిపోతున్నాం..’ అనుకుని లగేజీ తీసుకుని స్నేహితులతో కలిసి హడావిడిగా విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ ఒత్తిడిలో ఆమె శరీరం కాస్త వెచ్చబడింది. విమానం ఎక్కేముందు పరీక్షించిన అక్కడి వైద్యులు కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానించారు. ఆమె ప్రయాణాన్ని అడ్డుకున్నారు. ‘అమ్మా.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అయినా ఇక్కడి అధికారులు అనుమానంతో అడ్డుకుంటున్నారు. నువ్వే ఎలాగైనా నన్ను రప్పించుకో.. ఇక్కడ ఉండలేకపోతున్నా..’ అని వాట్సప్‌లో వీడియో సందేశం పంపించింది. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన అన్నెం జ్యోతికి వచ్చిన కష్టమిది.. తను చైనాలోని వూహాన్ పట్టణంలో చిక్కుకుపోయింది. తన తల్లి ప్రమీళాదేవి కూతురి రాకకోసం పరితపిస్తోంది..

 

శిక్షణ కోసం చైనా వెళ్లిన కర్నూలు జిల్లాకు చెందిన జ్యోతి అనే యువతి స్వదేశానికి తిరిగివచ్చేందుకు ఇబ్బంది ఎదుర్కొంటోంది. వూహాన్‌ నగరంలో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 58 మంది విద్యార్థులు తిరిగి రావాల్సి ఉన్నింది. విమానం ఎక్కే సమయంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో జ్యోతి శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉండటంతో కరోనో వైరస్‌ అనుమానిత కేసుగా భావించి ఆమె ప్రయాణాన్ని చైనా అధికారులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన జ్యోతి తనను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని తన తల్లి ప్రమీళాదేవికి శనివారం రాత్రి వాట్సప్‌ ద్వారా వీడియో సందేశం పంపించింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఒత్తిడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగిందని ఆమె వీడియోలో పేర్కొంది. దీంతో జ్యోతి తల్లి, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జ్యోతిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

క్యాంపస్‌లో ఉద్యోగం సాధించి..

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి, ప్రమీళాదేవి దంపతుల కూతురు అన్నెం జ్యోతి. ఆమె తండ్రి సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2015లో అనారోగ్యంతో మృతి చెందాడు. కోవెలకుంట్ల మండలం బిజనవేములలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ జ్యోతి చదువుకుంది. నంద్యాలలోని గుడ్‌షెప్పర్డ్‌ పాఠశాలలో 10వ తరగతి చదివి 9.8 గ్రేడ్‌ మార్కులు సాధించింది. కర్నూలు నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం, విజయవాడలో ద్వితీయ సంవత్సరం చదివి 980 మార్కులు సాధించింది. ఎంసెట్‌లో 985 ర్యాంకు సాధించి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. తిరుపతిలో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా కంపెనీ ఆప్టో-డిస్‌ప్లే టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, టీసీఎల్‌ ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యులో జ్యోతి ఉద్యోగం సాధించింది. ఆగస్టు 23 నుంచి ఫిబ్రవరి 15 వరకు 6 నెలల శిక్షణ కోసం చైనాకు వెళ్లింది. ఈ నెల 15వ తేదీ తరువాత ఆమె స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ఇంతలో కరోనా వైరస్‌ కారణంగా జ్యోతితో పాటు అక్కడికి వెళ్ళినవారందరూ స్వదేశానికి బయలుదేరారు. కానీ జ్యోతితోపాటు మరొక యువకుడి ప్రయాణానికి అక్కడి అధికారులు అభ్యంతరం తెలిపారు.

 

మార్చిలో వివాహం.. 

అన్నెం జ్యోతికి వారి సమీప బంధువు, మహానంది మండలం తమ్మడపల్లెకి చెందిన అమర్‌నాథ్‌రెడ్డితో వివాహం నిశ్చయమైంది. గత ఏడాది జూన్‌ 23న నిశ్చితార్థం జరిగింది. చైనా నుంచి తిరిగి వచ్చాక వివాహం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 14, 15వ తేదీన ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారు. రెండు కుటుంబాల వారు జ్యోతిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

జ్యోతి తల్లికి కలెక్టర్‌ ఫోన్‌ 

అన్నెం జ్యోతి తల్లితో కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. వీడియో సందేశం గురించి అడిగి తెలుసుకున్నారు. విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని, విదేశీ మంత్రిత్వ శాఖ ద్వారా జ్యోతిని త్వరగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్ళి జ్యోతిని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు కృషి చేస్తామని ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement