Abn logo
Oct 21 2020 @ 12:32PM

ఏరు ముంచిన ఏడాదికి..

Kaakateeya

గతేడాది భారీ వర్షాలకు ఉప్పొంగిన కుందూ

540 హెక్టార్లలో కోతకు గురైన సాగు భూములు

రూ.15 కోట్లకుపైగా నష్టపోయామంటున్న రైతులు

సర్కారు సాయం హెక్టారుకు రూ.37,500

పిసరంత సాయానికి ఏడాది తరువాత విచారణ

రాజుపాలెం, పెద్దముడియం, మైలవరం మండలాల్లో..

కోతకు గురైన భూములను పరిశీలిస్తున్న రాష్ట్ర బృందం


(కడప-ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాల వల్ల అన్నదాత నష్టపోతే తక్షణ సాయం అందించడం ప్రభుత్వ కర్తవ్యం. అప్పుడే రైతుకు కాస్తంత ఊరట లభిస్తుంది. వర్షాలు.. వరదలకు చితికిన కష్టజీవులకు ఏడాదైనా నష్టపరిహారం అందించకపోగా.. అసలు నష్టం జరిగిందా..? అంటూ ఏడాది తరువాత రాష్ట్ర బృందం విచారణకు వస్తే ఎలా నిరూపించుకోవాలి..? సర్కారు చేసే పిసరంత సాయం కోసం నెలల తరబడి నిరీక్షిస్తూ భూములు అభివృద్ధి చేయకుండా ఉండాలా..? పరిహారం వస్తుందో.. రాదో..! తెలియని రైతులు అప్పోసప్పో చేసి కోతకు గురైన భూములను సాగుకు సిద్ధం చేసుకున్నారు. ఏరు ముంచిన ఏడాది తరువాత వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి విచారణకు ప్రత్యేక బృందం వచ్చింది. గత ఏడాది కుందూ ఉప్పొంగి 540 హెక్టార్లలో సాగు భూములు కోతకు గురైన సంగతి తెలిసిందే. ఆ వివరాలు ఇలా.. 


జిల్లాలో గత ఏడాది సెప్టెంబరు ఆఖరులో కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు, వంక లు ఉప్పొంగాయి. ఊర్లు చేలు ఏకమయ్యాయి. కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కుందూ పోటెత్తింది. లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని అంచనా. కుందూ తీరంలో పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, పెన్నా నది తీరంలో వల్లూరు, చెన్నూరు, సిద్దవటం, నందలూరు, ఒంటిమిట్ట, పెనగలూరు తదితర మండలాల పరిధిలోని నదీ తీర గ్రామాల్లో అపారనష్టం జరిగింది. చేతికొచ్చిన వరి. పత్తి, పసుపు, మిరప, చెరకు తదితర పంటలు 3147.88 హెక్టార్లలో నీటిపాలై రూ.5.63 కోట్లు రైతులు నష్టపోయారని జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. అంతేకాదు.. రాజుపాలెం, మైలవరం, పెద్దముడియం మండలాల్లో 540 హెక్టార్లలో సాగు భూములు ఇసుక మేటలు, కోతకు గురయ్యాయని, రూ.2.02 కోట్లు భూమి కోత పరిహారం చెల్లించాలని నివేదిక పంపారు. ఏడాది గడిచినా నేటికీ చాలా మందికి పంట నష్టపరిహారం అందలేదు. భూమి కోతకు గురైన రైతులకు ఒక్కపైసా కూడా పరిహారం ఇవ్వలేదు. అరకొర సాయం కోసం ఇంకెన్నేళ్లు నిరీక్షించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.


సాయం కోసం నిరీక్షణ

రాజుపాలెం, పెద్దముడియం, మైలవరం మండలాల్లో కుందూ, పెన్నానది వరద ఉధృతికి సారవంతమైన సాగు భూము లు కోతకు గురయ్యాయి. కొందరు రైతుల పొలా లు 10-15 అడుగుల లోతు వరకు కోసుకుపోయాయి. చేనో.. వంకో తెలియని విధంగా దెబ్బతిన్నాయి. కొన్ని పొలాల్లో ఇసుక మేటలు వేసి సాగుకు పనికిరాకుండా పోయాయి. దాదాపు 540 హెక్టార్లలో సాగు భూములు కోతకు గుర య్యాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు హెక్టారుకు రూ.37,500 చొప్పున రూ.2.02 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వ సాయం చేస్తుందని రైతులు నెలలుగా నిరీక్షించారు. సాయం చేయకపోగా కనీసం ఉపాధి హామీ పథకం ద్వారానైనా కోతకు గురైన భూములు అభి వృద్ధి చేయలేదు.


ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో సర్కారు సాయం కోసం ఎదురు చూడకుండా అధిక వడ్డీలకు అప్పులు చేసి కోతకు గురైన, ఇసుక మేటలు వేసిన భూములు అభివృద్ధి చేసుకున్నారు. ఖరీఫ్‌ సాగు చేపట్టారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైగా ఖర్చు చేశారు. కొందరు రైతులు ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసి భూమి సాగుకు అనుకూలంగా చేసుకున్నారు. దాదాపుగా రూ.15 కోట్లకుపైగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతు న్నారు. అప్పులు పుట్టక కొందరు కోతకు గురైన పొలాలు అలాగే వదిలేశారు. పంట, భూములు కోల్పోయి సర్కారు సాయం కోసం ఏడాది కాలంగా కష్టజీవులు నిరీక్షిస్తున్నారు. 


ఏడాది గడిచాక..!:

ఏరు ముంచి ఏడాది గడిచింది. నిజంగా కుందూ వరద ఉధృతికి సాగు భూములు కోతకు గురయ్యాయా..? జిల్లా అధికారులు తప్పుడు నివేదిక పంపారా..? ఏడాది తరువాత వ్యవసాయ శాఖ కమిషనర్‌కు కలిగిన అనుమానం. దీనిపై నిగ్గు తేల్చమని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఆఫీసు డీడీఏ భగవత్‌ స్వరూప్‌, ఏవో విశ్వేశ్వరప్ప, భూసార విభాగం కడప డీడీఏ నర్సిరెడ్డి బృందాన్ని నియమించారు. మంగళవారం ఆ బృందం రాజుపాలెం మం డలం టంగుటూరు, పెద్దముడియం మండలం చిన్నముడియం, పాలూరు గ్రామాల్లో పర్యటించి కోతకు గురైన పొలాలను పరిశీలించారు. వరదలకు పొలాలు, పంటలు కోల్పోయి తీవ్ర నష్టం చవిచూశాక ఏడాది తరువాత విచారణ చేయడం ఏమిటని, పరహారం ఇవ్వకుండా విచారణ పేరుతో కాలయాపన చేయడానికే ఈ ఎత్తులు వేస్తున్నారని రైతులు అంటున్నారు. గుంటూరు నుంచి వచ్చిన సర్వే బృందం వెంట జేడీఏ ఆఫీస్‌ ఏవో గోవర్ధన్‌ ఉన్నారు. కాగా.. కోతకు గురైన భూములు పరిశీలించిన డీడీఏ భగవత్‌ స్వరూప్‌ సర్వే నివేదికను కమిషనర్‌కు అందజేస్తామని వివరించారు. 


ఈ ఏడాది నష్టం రూ.53 కోట్లు పైమాటే...

గతేడాది నష్ట పరిహారం కోసం రైతులు ఎదురు చూస్తుండగా ఈ ఏడాది కూడా ఉహించని పంట నష్టాన్ని రైతులు చవిచూశారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు కుందూ, పెన్నా, పాపాఘ్ని వంటి నదులు ఉగ్రరూపం దాల్చి పంట పొలాలను ముంచెత్తాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 12,001.53 హెక్టార్లలో వరి, పత్తి, వేరుశనగ, కంది వంటి పంటలు నీటమునిగి రూ.17.20 కోట్లు నష్టం వాటిల్లింది. ఉద్యాన శాఖ అధికారుల అంచనా మేరకు అరటి, చీనీ, బొప్పాయి, టమోటా, ఉల్లి, చామంతి వంటి ఉద్యాన పంటలు 2,800 హెక్టార్లలో దెబ్బతిని రూ.36 కోట్లు నష్టపోయినట్లు నివేదిక పంపారు. తక్షణ సాయం చేయాలని రైతులు కోరుతున్నారు.


పైసా సాయం అందలేదు 

కుందూ నది చెంతనే 2.50 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వర్షాలు అనుకూలించడంతో వరి సాగు చేశా. పంట చేతికొచ్చే సమయంలో గత ఏడాది సెప్టెంబరు వరద పోటెత్తి పంట నీటిపాలైంది. జీవనాధారమైన పొలం కోతకు గురై గుంతలు పడింది. ఏడాది గడిచినా ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా వరద ముంచెత్తింది. సాయం చేస్తారనుకుంటే ఏడాది తరువాత విచారణకు వచ్చారు. ఈ ఏడాది కూడా పంట నీటిపాలై రూ.లక్ష నష్టపోయాను. ప్రభుత్వం తక్షణ సాయం అందించాలి. 

- గోన చంద్రశేఖర్‌రెడ్డి, టంగుటూరు గ్రామం, రాజుపాలెం మండలం


ఏడాది తరువాత సర్వే చేస్తారా ..

కుందూ నది తీరంలో నాలు గు ఎకరాల పొలం ఉంది. గతేడాది వరి సాగు చేశాను. భారీ వర్షాలకు కుందూ ఉప్పొంగి వరి పంట నీటిపాలైంది. సారవంతమైన సాగు భూమి కోతకు గురై సాగుకు పనికిరాకుండా పోయింది. భూమి అభివృద్ధి చేయాలంటే ఎకరాకు సరాసరి రూ.లక్ష ఖర్చు వస్తుంది. తక్షణ సాయం చేయాల్సిన ప్రభుత్వం ఏడాది తరువాత సర్వేకు రావడం ఏమిటి..? 

- గుద్దేటి వెంకటసుబ్బారెడ్డి, టంగుటూరు, రాజుపాలెం మండలం


Advertisement
Advertisement