Abn logo
Jul 15 2020 @ 09:34AM

తప్పుడు కేసులో ఇరికించారని మనస్థాపానికి గురై.. సూసైడ్‌ లేఖరాసి..

శావల్యాపురం(గుంటూరు): తనను తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని మనస్థాపానికి గురై ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని కృష్ణాపురంలో మంగళవారం ఉదయం చోటుచేసుకొంది. మృతుడు గడిపూడి నరహరి తండ్రి అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి నరహరి స్నేహితులతో కలసి కృష్ణాపురం రోడ్డు ప్రక్కన మద్యం సేవిస్తున్నాడు. ఎస్‌ఐ కత్తి స్వర్ణలత అక్కడకు రావడంతో అందరూ పారిపోయారు. నరహరి ఫోన్‌ అక్కడే వదిలి వెళ్ళడంతో ఎస్‌ఐ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. ఫోన్‌ తీసుకు వెళ్లినందుకు ఎస్‌ఐని నరహరి నిందించాడంటూ గ్రామస్తులు కొందరు సమాచారం ఇవ్వడంతో సోమవారం ఉదయం నరహరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకొన్న తాను స్టేషన్‌కు వెళ్లగా ఎస్‌ఐ లేరని, నరహరిని తీసుకువెళ్ళి మంగళవారం ఉదయం తీసుకురమ్మన్నట్లు సిబ్బంది తెలిపారని తండ్రి వెల్లడించాడు.



ఈ విషయంలో మనస్తాపానికి గురైన నరహరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుసైడ్‌ నోట్‌ రాసి, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు వివరించారు. ఎస్‌ఐని నిందించానని తప్పుడు సమాచారం ఇచ్చి తనను  కేసులో ఇరికించడానికి గ్రామానికి చెందిన కొంతమంది ప్రయత్నిస్తున్నారని, తన వలన కుటుంబసభ్యుల భవిష్యత్‌ దెబ్బతినకూడదనే ఆత్మహత్య చేసుకొంటున్నట్లు సుసైడ్‌ నోట్‌లో వివరించారు. మృతుడు నరహరికి భార్య, కుమార్తె ఉన్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ కత్తి స్వర్ణలతను వివరణ అడగగా తాను కరోనా కేసులతో బిజీగా ఉన్నందున పోలీస్‌స్టేషన్‌కు రాలేదని, నరహరిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement