Abn logo
Sep 20 2021 @ 23:22PM

కోర్టునాశ్రయించిన కాంట్రాక్టర్‌కే బకాయి చెల్లిస్తాం

సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు

కొవ్వూరు, సెప్టెంబరు 20: కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపులపై కొవ్వూరు మునిసిపల్‌ కౌన్సిల్‌ చేతులెత్తేసింది. కోర్టునాశ్రయించిన కాంట్రాక్టరు బకాయి మాత్రమే చెల్లించడానికి మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టర్‌ బేతిన వెంకట ప్రసాద్‌ పట్టణంలో చేపట్టిన రెండు రోడ్ల నిర్మాణానికి బకాయిలు చెల్లించాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఉత్తర్వుల మేరకు కాం ట్రాక్టరు బకాయి మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి చెల్లించడానికి సోమవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. బేతిన వెంకట ప్రసాద్‌కు ఎస్‌డీఎఫ్‌ నిదులతో చేపట్టిన పనికి  సుమారు రూ.12 లక్షలు పే అండ్‌ అక్కౌంట్స్‌ విభాగం చెల్లిస్తుందని, పుష్కర మిగులు నిధులతో చేపట్టిన పనికి సంబందించి సుమారు రూ.11లక్షలు కోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. దీనిపై అధికార పార్టీ కౌన్సిలర్‌ కంఠమణి రమేష్‌బాబు మాట్లాడుతూ వార్డులలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి నిధులు లేవని, సాధారణ నిదులు నుంచి బకాయిలు చెల్లిస్తే భవిష్యత్‌లో మున్సిపాల్టీ మనుగడ సాగించలేదన్నారు. కాంట్రాక్టర్లు అందరూ కోర్టుకు వెళితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై చైర్‌పర్సన్‌ రత్న కుమారి మాట్లాడుతూ కాంట్రాక్టర్ల బకాయి చెల్లించడానికి సభ్యులందరు కలసి నిర్ణయం తీసుకుందామన్నారు. మంత్రి తానేటి వనిత సహకారంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంటు మంజూరుకు కృషిచేద్దామన్నారు. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ సూరపనేని చిన్ని మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను గౌరవించకుంటే కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. బీజేపీ కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ గతంలో పట్టణంలో చేపట్టిన పనులు, కాంట్రాక్టర్ల బకాయి సభ్యులకు తెలియజేయాలన్నారు. కమిషనర్‌ కె.టి సుధాకర్‌ మాట్లాడుతూ రూ.5.89 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల మొత్తం వివరాలను తర్వాతి సమావేశంలో సభ్యులకు అందజేస్తామన్నారు. కోడూరి శివరామకృష్ణ మాట్లాడుతూ బైపాస్‌ రోడ్‌ కాటన్‌ విగ్రహం వద్ద చెత్త సమ స్య సమావేశం దృష్టికి తెచ్చారు. కమిషనర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ చెత్తను తరలించేందుకు పంగిడి గ్రామంలో ప్రభుత్వం 7.14 ఎకరాల జడ్పీ స్థలాన్ని కేటాయించిందన్నారు. గ్రామస్తులు చెత్త వేయడానికి అభ్యంతరం చెప్పారని, ఆ స్థలంలో ప్రభుత్వం రీసైక్లింగ్‌ ప్రాజుక్టు నిర్మాణం చేపట్టనుందని, సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అంతవరకు పంగిడి శివారు దేచర్లలోని క్వారీ గోతులలో చెత్తను డంపింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. సమావేశంలో వైస్‌ చైర్‌పర్సన్‌లు మన్నె పద్మ, గండ్రోతు అంజలీదేవి, అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు పాల్గొన్నారు.