Oct 19 2021 @ 19:51PM

అలా అనుకుంటే స్వీయనాశనానికి శ్రీకారమే: కోట (పార్ట్ 39)

ఆ గ్యాప్‌ ఉండేది!

‘రెండిళ్ల పూజారి’ తర్వాత సుమన్‌గారితో ‘బావ బావమరిది’ సినిమా చేశాను. అందులో కృష్ణంరాజు గారు, జయసుధగారు, మాలాశ్రీ, నేను నటించాం. శరత్ గారని చాలా మంచి డైరెక్టర్‌. ఆయన చేశారు ఆ పిక్చర్‌. మాంచి సక్సెస్‌ అయింది. మా కాంబినేషన్‌లో ఇలాంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలున్నప్పటికీ, సుమన్ గారితో నాకు వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేదు. ఆ మాటకొస్తే చాలామంది హీరోలతో నాకు సాన్నిహిత్యం లేదు. లొకేషన్‌కి వెళ్ళడం, డైరెక్టర్‌గారు చెప్పింది చేయడం, మరలా ఇంకో షూటింగ్‌కి పరుగులు తీయడం... ఇదే పని. హీరోలతో పెద్దగా పరిచయాలు లేకపోవడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే మామూలుగా ఏ చెన్నైలోనో, హైదరాబాద్‌లోనో సినిమాచేస్తే సాయంత్రానికి ఎవరి గూటికి వాళ్ళు చేరుకుంటాం. అలా కాకుండా ఔట్‌డోర్‌ షూటింగ్స్‌ ఉన్నప్పుడు హీరో, హీరోయిన్లకి ఏసీ హోటల్‌ రూములు ఇచ్చేవారు. మాక్కూడా మంచి రూమ్‌లే అరేంజ్‌ చేసేవారు. కాకపోతే హోటళ్లు వేరుగా ఉండేవి. అందువల్ల హీరోలతో పెద్దగా పరిచయాలు ఉండేవి కావు.


వంశీ చాలా స్పెషల్‌

‘అలెగ్జాండర్‌’ తర్వాత నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం పెద్దవంశీగారి దర్శకత్వంలో వచ్చిన ‘కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్ ట్రూప్‌’. ఆ సినిమాని నేను ఇప్పుడు చూసుకున్నాగానీ కడుపుబ్బ నవ్వుకుంటూ ఉంటా. అందులో ప్రతి డైలాగూ నవ్విస్తుంది. ఎన్నిసార్లు విన్నా వెగటు అనిపించదు. ఎక్కడా వెకిలిగానూ ఉండదు. ఆ సినిమాలో వంశీగారు నాచేత చాలా వెరైటీ వేషం వేయించారు. చెరువుగట్టున గోచీ పెట్టుకుని చిన్నపిల్లాడి చేష్టలు చేస్తుంటా. నటుడిగా లొకేషన్‌లో అడుగుపెట్టాక దర్శకుడు ఏం చెప్పినా చేయాలన్నది నేను నమ్మే సిద్ధాంతం. అంతేగానీ ‘దర్శకుడు కావాలని చెబుతున్నాడా? నన్ను ఏడిపించడానికి చెబుతున్నాడా?’ అని ఆరాలు తీయడమంటే నాకు అసహ్యం. ఒకవేళ నిజంగానే ఏ దర్శకుడైనా దురుద్దేశంతో చెప్పినా ‘వాడి ఖర్మ వాడే అనుభవిస్తాడు’ అని అనుకునేవాణ్ణి. అలా అనుకోవడంతప్ప నేనుమాత్రం ఏం చేయగలను? ‘కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌ సినిమా’లో నిర్మలమ్మగారు, భరణి, నేను, మల్లికార్జునరావుగారు, రాళ్ళపల్లి... ఇంకా చాలామంది నటించాం. ఆ చిత్రంలో మాతోపాటు చేసిన ఆడవాళ్లు చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్‌ అయ్యారు.

చీపురు దెబ్బలు

‘కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌’ సినిమా పేరు వినగానే నాకు రెండు, మూడు డైలాగులు గుర్తుకొస్తాయి. అందులో ‘ఇప్పుడు మనం ప్రేయర్‌ పాడాలి... ప్రేయర్‌.. పరబ్రహ్మ పరమేశ్వర...’ అని పాట అందుకునే సీన్, నిర్మలమ్మగారితో ‘పరువుతీసేయకు మామ్మా.. మేమంతా కృష్ణుడి టైపు బులుగు రంగు..’ అని చెప్పడం, కొత్తరకం డ్యాన్సులు నేర్పిస్తున్నానని కొంతమందిని పోగేసుకుని వెళ్తుంటే నిర్మలమ్మ ఆపి... ‘ఏదిరా మీరు నేర్చుకున్నది ఒకసారి చెయ్యండి’ అని అడుగుతారు. ‘పాహి అని అశోకవనమున శోకించె సీత..’ అని పాట అందుకోగానే,‘ముండాకొడుకుల్లారా.. కొత్తరకం అని ఇదొక్కటి అడ్డం పెట్టుకుని రామాయణాన్ని రోడ్డున పడేస్తున్నారా?’ అని చీపురు పట్టుకుని యమకొట్టుడు కొడుతుంది ఆవిడపాత్ర. ఆ సినిమా టీవీలో వచ్చిన ప్రతిసారీ చాలా ఫోన్లు వస్తుంటాయి. నిక్కరు, చొక్కా, తలపాగాతో నా వేషం చాలా బావుంటుంది. అందులో మరో హైలైట్‌ కోడి సందేశం సీన్. స్రవంతి రవికిశోర్‌గారికి మంచి డబ్బులు తెచ్చిపెట్టిన చిత్రమిది.


స్వరకల్పన

వంశీగారి దర్శకత్వంలో నేను చెప్పుకోవాల్సిన ఇంకో సినిమా ‘స్వరకల్పన’. పూర్ణోదయ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరరావుగారి అబ్బాయి ఏడిద శ్రీరామ్‌ హీరోగా నటించిన సినిమా అది. తొలిసారి నా కెరీర్‌లో సింపతీ పాత్ర చేశా. చాలా సోఫిస్టికేటెడ్‌ వేషం. అందులో అన్నపూర్ణమ్మగారు నా పక్కన చేశారు.


అదీ... ఆవిడ స్పెషాలిటీ.

నాకు పెయిర్‌గా చేసిన చిత్రాలకన్నా, మారుతీ రావుగారికి పెయిర్‌గా చేసిన సినిమాలు అన్నపూర్ణమ్మగారికి చాలా మంచిపేరు తెచ్చిపెట్టాయి. తమిళంలో విస్సుగారి పాత్రలకు తెలుగులో మారుతీరావుగారు కీలక పాత్రధారిగా అప్పట్లో రీమేక్‌ చిత్రాలు చేశారు. వాటిలో అన్నపూర్ణమ్మ చాలా మంచి పాత్రలు చేశారు. ఆవిడ కూడా రంగస్థలం నుంచే వచ్చారు. మామూలుగా రంగస్థలం నుంచి వచ్చిన వారు ఆహార్యంపరంగా పెద్ద జాగ్రత్తలు తీసుకునేవారు కాదు. సినిమావాళ్ళతో పోలిస్తే వాళ్ళ మెయింటెనెన్స్ చాలా తక్కువ. అసలు ఆ రోజుల్లో లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్టులు బ్యూటీ మెయింటెనెన్స్ గురించి పట్టించుకునేవారు కాదు. కానీ అన్నపూర్ణమ్మ అప్పట్లోనే స్పెషల్‌గా ఉండేవారు. సినిమాకు సరిపోయేలా కనిపించేవారు. మనిషికూడా స్వతహాగా అందగత్తె కావడం ఇంకా ప్లస్‌ అయ్యేది. నేనంటే చాలా అభిమానం ఉన్నమనిషి. నాకన్నా అన్నపూర్ణమ్మగారు చాలా సీనియర్‌ నటి.

అలా అనుకుంటే స్వీయనాశనానికి శ్రీకారమే

ఏ రంగంలో పనిచేసే వ్యక్తి అయినా సరే ‘నేను ఇవాళ టాప్‌ పొజిషన్‌లో ఉన్నాను’ అని అనుకుంటే అంతటితో అతని నాశనానికి అతడే శ్రీకారం చుట్టుకున్నట్టు. ‘ఈ రోజు మనకి మంచి రోజు. బాగా కష్టపడాలి. భగవంతుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి’ అని అనుకున్నవాడు ఇంకాస్త ఎదుగుతాడు. నన్ను ఎవరైనా ఎప్పుడైనా ‘మీకేంటండీ టాప్‌లో ఉన్నారు’ అంటే విని లోపల్లోపల పొంగిపోతాను. ఆ ఫీలింగ్‌ అక్కడితో వదిలేసి ముందడుగు వేస్తుంటాను. అంతేగానీ నేను ఎప్పుడూ దాన్ని తలకి ఎక్కించుకుని గర్వం చూపించలేదు. నా అదృష్టం ఏమిటంటే ఆరేళ్ళ కుర్రాడి నుంచి అరవై ఏళ్ళ వ్యక్తిదాకా, అటు చదువుకున్నవారు, చదువుకోనివారూ అందరికీ నేను నటుడిగా బాగా ఇష్టం. అంత అభిమానం అందరికీ ఎందుకు వచ్చిందో, అసలు ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను కనిపిస్తే చాలు, చుట్టుపక్కల ఉన్నవారు చటుక్కున ‘రేయ్‌ కోటగాడు వచ్చాడ్రా’ అంటారు. కొంతమంది చదువుకున్నవారైతే ‘కోట శ్రీనివాసరావుగారు వచ్చారు’ అంటారేమోగానీ, మిగిలినవాళ్ళు మాత్రం ‘కోటగాడు వచ్చాడ్రా’ అనే అంటారు. ఆ పిలుపు నాకు చాలా ఇష్టం. ఎంతో అభిమానం లేకపోతే గబుక్కున అలాంటి పదాలు వాడరు. కామన్‌మేన్‌ నన్ను చూసి అలా అనడానికి కారణం కూడా ఉంది. నేను చెడ్డ వేషాల్లోనూ పీక్‌కి వెళ్ళా. మంచి వేషాలతోనూ పేరు తెచ్చుకున్నా. రెండు కలగలిపిన వేషాలూ చేశా.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి