Abn logo
Sep 28 2020 @ 14:53PM

నీటిలో ముంచడమే ప్రభుత్వ లక్ష్యమా..?

తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితుల ఆందోళన


కొండాపురం(కడప): ఇళ్లలో కాపురముండగానే నీళ్లు వదిలి ప్రజలను ముంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉంటోందని తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లప్రొద్దుటూరులోని అంకాళమ్మగుడి వద్ద మోకాళ్ల లోతులో ఉన్న గండికోట బ్యాక్‌వాటర్‌ల ఆదివారం నిరసన తెలిపారు. కనీసం ఇళ్లు కట్టుకోవడానికి గడువు ఇవ్వకుండా నీళ్లు నింపి మీ చావు మీరు చావండి అనే రీతిలో వ్యవహరించడం ఏమిటని వారు మండిపడ్డారు. అనంతరం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.  12టీఎంసీల లోపే గండికోటలో నీళ్లు నింపి తమ ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సర్పంచు నరసింహారెడ్డి, సీపీఐ ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్‌బాష, సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు, తులశమ్మ తదితరులు పాల్గొన్నారు. 


పునరావాస కేంద్రంలో విరిగిపడ్డ మట్టిపెల్లలు

రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండాపురం స్త్రీశక్తి భవనం వద్ద నిర్వాసితులకు కేటాయించిన పునరావాస  కేంద్రంలో కొండ నుంచి మట్టిపెల్లలు ఆదివారం విరిగిపడ్డాయి. కొండాపురం నిర్వాసితులకు పునరావాసం కింద కొండను తొలచి స్థలాన్ని కేటాయించారు. కొండ కింది భాగంలో 20మందికి, పైభాగంలో మరో 20మందికి స్థలాన్ని కేటాయించారు.  సేఫ్టీవాల్‌ను నిర్మించకుండానే నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించడంతో  ప్లాట్లకు ప్రమాదం పొంచి ఉందని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. 


Advertisement
Advertisement
Advertisement