Abn logo
May 14 2020 @ 00:24AM

బట్టతలకు మోకాలికి ముడి

ఇప్పుడు తెలుగు కవిత్వం శ్రీశ్రీని అధిగమించి ముందుకు కొనసాగుతుంది. ఆయా వ్యక్తులకు శ్రీశ్రీ ఆరాధనీయుడు  కావచ్చు కానీ ఒకరి వ్యక్తివాద అభిరుచిని అందరి ఆకాంక్షగా చూపే సాహసం చేయడం గర్హనీయం. సమస్తం గురజాడ శ్రీశ్రీలలోనే ఉన్నాయని ఉటంకింపులు చేయడం ఆధిపత్య వర్గాల భావజాలాలకు అనుసరణీయమే కావచ్చు కానీ మిగతా బహుజనవాద కవులకు రచయితలకు ఇక ఇది ఎంతమాత్రం ఆమోదనీయం కానేరదు.


‘రెండు వలస పాటలు’ పేరుతో 30.04.2020 నాడు ఆంధ్రజ్యోతి సంపాదకీయం వచ్చింది. అందులో ప్రస్తావించిన ఆ రెండు పాటలలో ఒకటి ఆదేశ్ రవి ఇటీవల రాసి తానే స్వయంగా పాడిన ‘పిల్ల జెల్లా ఇంటికాడ ఎట్లు వున్రో’ అన్న పాట. ఇది ఎలక్ట్రానిక్ మీడియా, ఫేస్‌బుక్, వాట్సాప్ మాధ్యమాల ద్వారా కోట్లాదిమంది జనానికి చేరింది. రెండోది శ్రీశ్రీ 18.5.1934 నాడు రచించిన కవిత ‘బాటసారి’. ఇదే కవిత తర్వాత సినిమాలో పాటగా మారిపోయింది. ఇదీ స్థూలంగా ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో ప్రస్తావించిన రెండు వలస పాటల పరిచయం.


ఈ రెండు పాటలను ఒకే గాటన కట్టవచ్చునా లేదా? అన్నదే ప్రధాన మీమాంస. అందుకే ఈ సంపాదకీయం లోతుపాతులపై నేను చర్చించాల్సిన వాతావరణం ఏర్పడింది. దాదాపు ఒక నెల తక్కువ 86 సంవత్సరాల క్రితం నాటి ‘బాటసారి’కి, ఈ సంవత్సరం ఏప్రిల్‍లో వచ్చిన కోట్లాది వలస కార్మికుల పాటకు సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టు ప్రతిపాదనలు చేయడం అభ్యంతరకరం. ఎందుకంటే 1930 ప్రాంతంలో అమెరికాలో పుట్టిన ఆర్థిక మాంద్యం ప్రపంచం మొత్తాన్ని విస్తరించి ప్రభావితం చేసింది. శ్రీశ్రీ తన కవిత పూర్వరంగాన్ని, ప్రభావిత పరిస్థితులను వివరించాడో లేదో కానీ మన విమర్శకులు ఊహాజనిత భావనల్ని ‘బాటసారి’కి ఆపాదన చేశారు. ఇకపోతే ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచి కరోనా విపత్తు విస్తృతిని అడ్డుకోవ డంలో భాగంగా ప్రభుత్వం దేశమంతా లాక్‌డౌన్‌ను ప్రకటించింది.


మొత్తం దేశానికి తాళం వేయడంతో ఎక్కువగా వేదనకు, దుఃఖానికి, ఆకలిదప్పులకు, నిర్లక్ష్యానికి, నిరాశ్రయానికి గురైంది అసం ఘటిత రంగంలోని వలస కార్మికులు. వారి కుటుంబాలు వందల వేల కిలో మీటర్ల దూరంలో ఉండడంతో, స్వస్థలాలనూ తల్లిదండ్రులనూ పిల్లలనూ విడిచి పని కోసం నగరాలకు వచ్చిన వలస జీవులు నలిగిపోయారు. అటు పనిస్థలాల్లో ఉండలేక, ఇటు జన్మస్థలా లకు పోలేక తీవ్ర నిర్బంధానికి మనోవే దనకు గురి అయ్యారు. ఈ దృశ్యాలను వివిధ మాధ్యమాల్లో చూసి హృదయం ఉన్న ప్రతి మనిషి చలించిపోయాడు. గుండెను పిండేసే ఈ దృశ్యాల నేపథ్యం ఆదేశ్ రవి రాసి పాడిన వలస పాటకు ఊపిరి అయ్యింది. ఇలా వివిధ సందర్భా లలో రాసిన వాటిలోని సామాజిక సమా హారాన్ని అవలోకించకుండానే, వేరువేరు స్థలకాలాల భూమికను పరిగణనలోకి తీసుకోకుండానే అసమంజసంగా రవి వలస పాటను శ్రీశ్రీ శంకులో తీర్థంగా పోయడానికి తిప్పలుపడడమే ఈ విభేదానికి దారితీసింది. వెయ్యేండ్ల పైగా చరిత్ర ఉన్న తెలుగు కవిత్వం యవనిక మీద ముందెప్పుడూ చూడని, చదవని అంశాలను క్రింది వర్గాల కులాల నుంచి వచ్చిన సృజనకారులు వివిధ ప్రక్రియలతో సుసంపన్నం చేసిన సందర్భంలో, ఇటువంటి విషయాన్ని రూఢీ పరిచే విశ్వ ప్రయత్నం చేయడం అత్యంత ఆక్షేపణీయం.


ఇప్పుడు తెలుగు కవిత్వం శ్రీశ్రీని అధిగమించి ముందుకు కొనసాగుతుంది. ఆయా వ్యక్తులకు ఆరాధనీయుడు శ్రీశ్రీ కావచ్చుకానీ ఒకరి వ్యక్తివాద అభిరుచిని అందరి ఆకాంక్షగా చూపే సాహసం చేయడం గర్హనీయం. సమస్తం గురజాడ శ్రీశ్రీలలోనే ఉన్నాయని ఉటంకింపులు చేయడం ఆధిపత్య వర్గాల భావజాలాలకు అనుసరణీయమే కావచ్చు కానీ మిగతా బహుజనవాద కవులకు రచయితలకు ఇక ఇది ఎంతమాత్రం ఆమోదనీయం కానేరదు.


మట్టిని చీల్చుకొని వచ్చిన కవిలాగా ఆధిపత్య కులాలు, మిగతా ప్రాంతాల వారు రాయలేరనే సత్యం ఇప్పటికే రుజువు అయింది. మిగతావారి సృజన అంతా అవుట్‌సైడర్‌గానే ఉంటే, తెలంగాణ కవుల రచనల నిండా జీవితం, మెజారిటీ సమాజం పట్ల నిబద్ధత నిబిడీకృతం అవుతుంది. అందుకే వారి సృజనలో ప్రశ్న, పుట్టెడు దుఃఖం, మూలాలు... అక్షరాలు తడితో నిండిపోతూ ఉంటాయి.


శ్రీశ్రీ 110 జయంతి రోజున సంపాదకీయం రాయసకాడు బొడ్డు చెంబుతో పాఠకులకు నీళ్లు తాగించాలి అనుకొని తన చాపల్యాన్ని చాటుకున్నారు లేక బయటపెట్టుకున్నారు. అంతేగాక బట్టతలకు మోకాలుకు ముడి వేసే చిత్రం చేశారు. అదియుగాక రవి వలస కార్మికుల పాట శ్రీశ్రీ ‘బాటసారి’తోపాటు ఈ సందర్భంగా కవిత్వ స్థలాన్ని పంచుకున్నదని నిర్ధారించడం, నిర్వచించడం సమంజసం కాదు. ఈ సందర్భంలో రవి పాట, శ్రీశ్రీ ‘బాటసారి’ల పూర్తిపాఠం ప్రచురిస్తే సమంజసంగా సమయోచితంగా ఉంటుంది. సంపాదకీయం అసలు టీకా తాత్పర్యాల అంతరాలను పాఠకమన్యులు, శేముషీపరులు పాలుపంచుకోవడానికి మార్గం మరింత సుగమం అవుతుంది.

జూకంటి జగన్నాథం 

Advertisement
Advertisement
Advertisement