Abn logo
Sep 27 2021 @ 00:14AM

బొమ్మ తుపాకీ గురిపెట్టి

బెదిరించి రూ.2 లక్షల అపహరణ

తుని/తునిరూరల్‌, సెప్టెంబరు 26: జాతీయ రహదారిపై  అన్నవరం వై జంక్షన్‌ వద్ద కారులో వెళ్తున్న వ్యక్తిని కిడ్నాప్‌ చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తునిరూరల్‌ సీఐ కార్యాలయంలో పెద్దాపురం డీఎస్పీ ఆరిటాకుల శ్రీనివాసరావు ఆదివారం వివరాలను వెల్లడించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన ఐనవిల్లి హరిప్రసాద్‌ సొంత పనిమీద కారులో బెండపూడి వస్తుండగా  అన్నవరం వై జంక్షన్‌ వద్ద ఆరుగురు మోటారుసైకిళ్లపై వచ్చి అడ్డుకున్నారు.  ఇద్దరు వ్యక్తులు కారులోకి వచ్చి తుని మండలం తలుపులమ్మ లోవకు వెళ్లే మార్గం వైపు తీసుకెళ్లారు. తాళ్లూరు గ్రామ శివారు పోలవరం కాలువ గట్టుపై  నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి బొమ్మ తుపాకీతో భయపెట్టారు. కారులో ఉన్న రెండు లక్షల రూపాయలను లాక్కొని, ముందు జాగ్రత్తతో స్టాంప్‌ పేపర్‌పై బాకీ డబ్బులు వసూలు చేసినట్లు సంతకాలు చేయించుకుని వీడియో తీశారు. 3 గంటల పాటు నిర్బంధించి తర్వాత జాతీయ రహదారిపైకి తీసుకొచ్చి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టారు. దీంతో హరిప్రసాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాలతో డీఎస్పీ సూచనలతో తుని రూరల్‌ సీఐ కిశోర్‌బాబు, తుని, తొండంగి, కోటనందూరు ఎస్‌ఐలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మూడురోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. తుని మండలం కుమ్మరిలోవ గ్రామ శివారు పాడుబడ్డ భవనం సమీపంలో ఈ నేరానికి సూత్రధారి అయిన తుని పట్టణానికి చెందిన దూలపల్లి వరనరసింహారావుతో పాటు తుని పట్టణం కంకిపాటివారి గరువుకు చెందిన ఉప్పాక వేణు, తొండంగి మండలం గోపాలపట్నానికి చెందిన పెదపాటి జశ్వంత్‌సూర్య, రౌతు సత్యసాయి కుమార్‌,  శంఖవరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన చీడుగుపల్లి దాసు, ఇండుగపల్లి దుర్గాప్రసాద్‌, అచ్యుతరావులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.75 లక్షల నగదు, బొమ్మ తుపాకీ, మూడు మోటారు సైకిళ్లు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ కిశోర్‌బాబును, ఎస్‌ఐలు మోహన్‌కుమార్‌, అశోక్‌, గణేష్‌ను ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అభినందించారు.