Abn logo
Aug 2 2021 @ 00:32AM

ఏజెన్సీలో జోరుగా ఖరీఫ్‌ పనులు

వరి నారు తీస్తున్న కూలీలు


ముమ్మరంగా నారు తీత.. వరి నాట్లు

పాడేరు, ఆగస్టు 1: మన్యంలో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది మే నెల నుంచే ఏజెన్సీ వ్యాప్తంగా వర్షాలు కురవడంతో వేసవిలోనే అవసరమైన దుక్కి పనులు పూర్తి చేసేశారు. అలాగే జూన్‌ నుంచి ఆఖరు దుక్కి పనులు, జూలైలో నారు పోతతో క్రమంగా వరి సాగుకు అవసరమైన పనులు చేపట్టారు. దీంతో గిరిజన పల్లెల్లో ఎక్కడ చూసినా ఆఖరు దుక్కి పనులు, పంట పొలాల్లో దమ్ము పట్టడడం, నారు తీయడం, నాట్లు వేయడం వంటి పనుల్లో నిమగ్నమైన గిరిజనులే కనిపిస్తున్నారు. దీంతో పంట పొలాలు గిరిజనుల శ్రమైక సౌందర్యంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజన రైతులు ఖరీఫ్‌ వరిని 48,688 హెక్టార్లలో సాగు చేస్తుంటారు. కేవలం వారి ఆహారం కోసం మాత్రమే వరిని సాగు చేస్తారు. దీంతో ఖరీఫ్‌ వరి సాగు గిరిజనుల జీవనంలో ఎంతో ప్రాధాన్యత కూడుకున్నది కావడంతో అందరూ అదే పనిలో ఉంటారు. వర్షాలు అనుకూలంగా ఉండడంతో ఆగస్టు రెండో వారానికి ఏజెన్సీ వ్యాప్తంగా వరి నాట్లు పూర్తయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు.