Aug 3 2021 @ 17:08PM

‘లక్కీ స్టార్’గా.. ‘కె.జి.యఫ్’ హీరో

‘కె.జి.యఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో యష్. ఆయనిప్పుడు ‘లక్కీ స్టార్’‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆయన హీరోగా నటించి, కన్నడలో ఘన విజయం సాధించిన ‘లక్కీ’ అనే చిత్రాన్ని.. ‘లక్కీ స్టార్’ అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు ఆ చిత్రాన్ని కన్నడలో నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి. ఆమె సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వంలో లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యష్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అనువాద కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. 


ఈ సందర్భంగా నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ.. ‘‘కన్నడలో యష్‌కు స్టార్ డమ్ తెచ్చిన చిత్రాల్లో ‘లక్కీ’ ఒకటి. యష్ నటన, రమ్య అందం, ‘రాబర్ట్’ ఫేమ్ అర్జున్ జన్య మ్యూజిక్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. సీనియర్ రైటర్ గురుచరణ్ తెలుగులో మాటలతో పాటు పాటలు కూడా రాశారు. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అనువాద కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.