Abn logo
Aug 7 2020 @ 03:36AM

మన కలల్ని మనమే సాకారం చేసుకోవాలి: కేశినేని

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘‘మన కలల్ని మనమే సాకారం చేసుకోవాలి. మన కలల్ని ఎదుటివారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం’’ అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని) పేర్కొన్నారు. గురువారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘అమరావతి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు కన్నకల. అది సాకారమవ్వాలంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాలి’’ అని కేశినేని అన్నారు.


వైసీపీకి ప్రజామోదం లభిస్తే.. టీడీపీ మాట్లాడదు: నిమ్మల

‘‘ప్రజాకోర్టులో వైసీపీకి ఆమోదం లభిస్తే, మూడు కాదు 30 రాజధానులు కట్టినా తెలుగుదేశం పార్టీ మాట్లాడదు. అందుకే ప్రజాభిప్రాయం కోరాలని చంద్రబాబు సవాల్‌ విసిరారు’’ అని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు.  


ప్రజలేమి ద్రోహం చేశారని పగ సాధిస్తున్నారు?: అనగాని

‘‘క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి మూడు నెలలకోసారి కూడా బయటకు రాని సీఎం జగన్‌ మూడు రాజధానులను కడతాడా? రాష్ట్ర ప్రజలు మీకేమి ద్రోహం చేశారని పగ సాధిస్తున్నారు’’ అని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు.  


రెఫరెండంపై భయమెందుకు?: కళా

మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌.. ప్రజల వద్దకు వెళ్లి రెఫరెండం తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు ప్రశ్నించారు.  ‘మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని భావిస్తే అందరూ రాజీనామా చేసి రండి... ఎన్నికలకు వెళ్దాం’ అని సవాల్‌ విసిరారు.


భూ కబ్జా కోసమే మూడు ముక్కలాట: బొండా

‘‘ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేశారు. ప్రభుత్వం వ్యవహారం వెన్ను పోటు పొడిచినట్లుంది. దీనిపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామన్న తెలుగుదేశం పార్టీ సవాల్‌ను స్వీకరించలేక జగన్మోహన్‌రెడ్డి తోకముడిచారు’’ అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. విశాఖలో తమ భూముల విలువ పెంచుకోవటానికే మూడు ముక్కలాట ఆడుతున్నారని బొండా ఉమా విమర్శించారు.

Advertisement
Advertisement
Advertisement