Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్తిశ్రద్ధలతో కార్తీకమాస పూజలు

  1. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
  2. దీపాలు వెలిగించిన మహిళలు


నంద్యాల(కల్చరల్‌), నవంబరు 29: నంద్యాల పట్టణంలోని పలు శివాలయాలలో కార్తీకమాసం చివరి సోమవారం పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. సాయంత్రం శివాలయాలలో ఆకాశ దీపాలు వెలిగించారు. బ్రహ్మనందీశ్వరస్వామి దేవస్థానంలో బ్రహ్మనందీశ్వరుడికి, కాళికాంబ చంద్రశేఖరస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రఽథమ నందీశ్వరాలయం, మల్లిఖార్జునస్వామి ఆలయం, సంజీవనగర్‌ రామాలయంలో కాశీవిశ్వేశ్వర స్వామి, నూనెపల్లె శివాలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. 


ఆళ్లగడ్డ: కార్తీక మాసం చివరి సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజామున్నె తలంటూ స్నానాలు చేసి శివుడికి పూజలు చేశారు. దేవాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. పట్టణంలోని శివాలయం, కాశీచింతల క్షేత్రానికి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. కాశీచింతల క్షేత్రంలో సుదర్శనరెడ్డి, రంగేశ్వరరెడ్డి భక్తుల కోసం రేలారేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 


ఎమ్మెల్యే పూజలు: పట్టణ శివార్లలోని కాశీచింతల క్షేత్రంలో ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి అభిషేకం, తదితర పూజలు చేశారు. ఎమ్మెల్యే రాకను పురస్కరించుకొని ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.


ఉయ్యాలవాడ: కార్తీకమాసం చివరి సోమవారం మండలంలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. మయలూరులో అర్చకుడు భాస్కరశర్మ, ఆర్‌.జంబులదిన్నెలో కీర్తి లక్ష్మణస్వామి, సుద్దమల్లలో కమలేశ్వరశర్మ, ఇంజేడులో అనంతశర్మలు స్వామి వారికి అభిషేకం, తదితర పూజలు చేశారు. మండలంలోని మాయలూరులో వేలాది మంది భక్తులకు గ్రామస్థులు వన భోజనం ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్‌ జనపాల సాయిరెడ్డి, మాజీ సర్పంచ్‌ రవి, గ్రామ పెద్దలు, కానాల సుదర్శన్‌రెడ్డి, గుర్రెడ్డి పాల్గొన్నారు.


చాగలమర్రి: మండలంలోని బుగ్గమల్లేశ్వర, భైరవేశ్వర, రామలింగేశ్వర, భీమలింగేశ్వర ఆలయాల్లో సోమవారం కార్తీక శోభ నెలకొంది. చివరి సోమవారం కావడంతో ఆలయాలకు మహిళలు అధిక సంఖ్య తరలివచ్చి శివపార్వతులకు పూజలు చేశారు. మహిళలు దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భీమలింగేశ్వర ఆలయంలో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం చేశారు. కార్యక్రమంలో ఆలయాల అధ్యక్షులు సురేషప్ప, రామసుబ్బారెడ్డి, కమిటీ సభ్యులు శ్రీనివాసగౌడ్‌, దామోదర్‌ పాల్గొన్నారు.  మండలంలోని భైరవేశ్వర, చాగలమ్మ దేవాలయాల్లో కార్తీక వనభోజనం నిర్వహించారు. 


రుద్రవరం: కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని మండలంలోని రుద్రవరం భాస్కరనందీశ్వర ఆలయం, నల్లమలలో కొలువుదీరిన ఉల్లెడ కొండపై కొలువుదీరిన మల్లేశ్వరస్వామికి పూజలు చేశారు. మండలంలోని శ్రీరంగాపురం, డి.కొట్టాల, ఎల్లావత్తుల, కోటకొండ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 


గడివేముల: దక్షిణ కాశీగా పేరుగాంచిన దుర్గాభోగేశ్వర ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పంచకోనేర్లలో స్నానాలు ఆచరించారు. దుర్గాభోగేశ్వరుడికి, బాలత్రిపురాంబ సమేత పాలకేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. భక్తులకు కాశీరెడ్డినాయన ఆశ్రమం అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్‌ గోపాలయ్య, ఆలయ కార్యనిర్వాహణాఽధికారి చంద్రశేఖర్‌రెడ్డి భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. 


ఓర్వకల్లు:  కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయం కార్తీక మాసం చివరి సోమవారం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు, మహిళలు ఉదయాన్నే కోనేటిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఆయన సతీమణి ఉమామహేశ్వరమ్మ శివలింగానికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అంతకుముందు వారికి ఆలయ చైర్మన్‌ గోప వెంకటరమణారెడ్డి, ఆలయ అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహిళలు ఆలయం ఎదురుగా దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కల్లె లక్ష్మీనారాయణశర్మ, కల్లె లక్ష్మీనరసింహశర్మ స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. Advertisement
Advertisement