Abn logo
Oct 14 2021 @ 02:55AM

కార్మికులవి కాళ్లు కావా?

భారత రాజ్యాంగం నాలుగవ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశిక సూత్రాలను నిర్దేశించింది. ఇవి పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, వాటిని సవ్యంగా అమలు జరపడానికి ఉద్దేశించినవి. ఆర్టికల్ 42 ప్రకారం ‘మాతా శిశు సంక్షేమం కోసం కృషి చేయాలి. హేతుబద్ధమైన పని గంటలను ఏర్పాటు చేయాలి. పనికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి’. ఆర్టికల్ 43 ప్రకారం ‘కార్మికుల శారీరక మానసిక వికాసానికి కృషి చేయాలి’. పై ఆదేశిక సూత్రాల ప్రకారం ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ కింద వచ్చే వివిధ వ్యాపార సంస్థలలో, దుకాణాలలో, స్టోర్స్‌లో, మాల్స్‌లో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు ఇతర సంక్షేమ చర్యలతో పాటు, 8 గంటల పని విధానం, వరుసగా 5 గంటలకు మించని పని, భోజన విరామం, పని ప్రదేశాలలో కూర్చుని పని చేయడం, పని మధ్యలో కూర్చోవడం కోసం సరైన సీటింగ్ ఏర్పాటు, తాగు నీటి వసతి, టాయిలెట్ సౌకర్యం వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఈ దిశగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా కూర్చూనే హక్కు (రైట్ టు సిట్) కోసం కేరళలోని మహిళా వర్కర్స్ సంఘం ఎనిమిదేళ్ళపాటు అనేక పోరాటాలు చేసింది. 2018లో రాష్ట్ర కార్మికులకు వారు పని చేసే వ్యాపార సంస్థలల్లో ‘కూర్చునే హక్కు’ని సాధించింది.


ఇదే విధమైన పోరాటాల ఫలితంగా ఇటీవల దుకాణాలు, స్టోర్సు, మాల్స్, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సీటింగ్ సదుపాయాలు తప్పని సరిగా కల్పించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13, 2021న ‘తమిళనాడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్, 1947’ చట్టానికి సెక్షన్ 22–A ప్రకారం ఒక ఉప విభాగాన్ని చేర్చి, సవరణ చేస్తూ బిల్లుని రాష్ట్ర అసెంబ్లీలో సమర్పించింది. ఏ షాప్‌ అయినా, షోరూమ్‌ అయినా, ప్రయివేటు ఉపాధి స్థలం అయినా దాని ప్రాంగణంలో ఉండే ఉద్యోగులు కూచునే ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని యజమానులను ఈ సవరణ ఆదేశిస్తుంది. నిబంధనను ఉల్లంఘించిన యజమానులకు ఈ బిల్లులో ఇప్పటివరకూ ఏ శిక్ష లేదు. కానీ దీన్ని సరైన దిశలో ఒక ప్రారంభంగా భావించవచ్చును.


డీమార్ట్, బిగ్ బజార్, రిలయెన్స్ మార్ట్ వంటి పెద్ద సంస్థలు, టెక్స్‌టైల్, ఆభరణాలు, ఇతర వాణిజ్య దుకాణాలలో పనిచేసే కార్మికులు కార్మిక చట్టాల ప్రకారం 8గంటలకి మించి పని చేయకూడదు. కానీ ఈ చట్టాలను అమలు జరిపే యంత్రాంగం లేక కార్మికులు 12గంటలు పని చేస్తున్నారు. ఈ సమయమంతా దాదాపు నిలబడే పని చేస్తున్నారు. కనీసం మహిళలకు కూడా కూర్చోవడానికి కుర్చీలు, స్టూల్స్ ఇవ్వటం లేదు. దుకాణం లోపల కస్టమర్లు లేనప్పుడు కూడా కూర్చునేందుకు అనుమతి లేదు. తోటి ఉద్యోగులతో మాట్లాడే అవకాశం కూడా లేదు. పైగా సీసీ కెమెరాల నిఘాలో పని చేస్తారు. కొన్నిచోట్ల కార్మికులకి కనీసం రెండుసార్లకు మించి టాయిలెట్ బ్రేక్ తీసుకునే హక్కు లేదు. ఇలా అవసరమైనప్పుడల్లా టాయిలెట్‌కు వెళ్ళే వీల్లేకపోవటంతో మహిళలు ఎక్కువగా నీళ్ళు తాగకుండా జాగ్రత్తపడుతున్నారు. దీనివల్ల యూరి నరీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు వస్తాయి. చాలామందికి మోకాలి సమస్యలు, గర్భాశయ సమస్యలు, గ్రేట్ సెఫానస్ వీన్, డీప్ వీన్ త్రోమ్బోసిస్, వేరికోస్ వీన్స్, అవయవాలలో నీరు నిలుపుదల, రక్తపోటు, మూత్రపిండాలు చెడిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. అనేక మంది అర్ధాయుష్షుతో జీవితాన్ని ముగుస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వీరి జీవితాలు మధ్య యుగాల నాటి బానిసల బతుకుల వలే ఉన్నాయి.  


మనుషులకి వ్యక్తిత్వాన్ని బట్టిగాక కులాన్ని బట్టి విలువ ఇచ్చినట్టే, శ్రమకు గాక చేసే పనికి విలువ ఇచ్చే సమాజం మనది. ఏదైనా దుకాణానికి వెళ్లినప్పుడు సేల్స్ మెన్/ సేల్స్ వుమన్ స్టూలు మీదో కుర్చీ మీదో సౌకర్యంగా కూర్చుని ఉంటే మనకి అసౌకర్యంగా ఉంటుంది. ఈ కిటుకు తెలిసిన యజమానులు వినియోగదారుల సౌకర్యం కోసం తమ వద్ద పనిచేసే కార్మికులను అసౌకర్యానికి గురి చేస్తున్నారు. వారికి నిమిషమైనా కూర్చొనే అవకాశాన్ని నిరాకరిస్తున్నారు. కాబట్టి ఈ మానసిక దుర్బలత్వం నుంచి ముందు పౌర సమాజం బయట పడాలి. శ్రమ విలువ గుర్తించి, మనుషులందరు సమానమనే మానవీయ విలువలని పెంపొందించుకోవాలి. కలెక్టర్ నుండి అటెండర్ వరకు, సీఈఓల నుండి క్లర్కుల వరకు, రైతు నుండి సాధారణ గృహిణి వరకు మనమంతా కేవలం వినియోగదారులం మాత్రమే కాదు, మరో చోట ఎక్కడో పని చేసేవాళ్లం కూడా. ఈ విశాల ధృక్పథంతో మనమంతా ఒక ‘వర్కింగ్ క్లాస్’ అని గుర్తించాలి. వ్యాపార సంస్థలల్లో, దుకాణాలలో, స్టోర్స్‌లో మాల్స్‌లలో పని చేసే కార్మికులకు, ఉద్యోగుల తరఫున ‘రైట్ టు సిట్’ (కూర్చునే హక్కు) గురించి మాట్లాడాలి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ‘రైట్ టు సిట్’ చట్టం వచ్చే బాధ్యత ప్రధానంగా పౌర సమాజం పైనే ఉంది.

వెంకట కిషన్ ఇట్యాల


ప్రత్యేకం మరిన్ని...