Abn logo
Mar 11 2020 @ 04:45AM

కోచ్‌లపై చిన్నచూపేల?

కపిల్‌దేవ్‌, సచిన్‌ వంటి దిగ్గజాలు మొదలుకొని సానియా, సింధు వంటి నేటి గ్లోబల్‌ స్టార్ల వరకు ఏ ప్లేయర్‌ విజయగాథను పరిశీలించినా వారి వెనుక కచ్చితంగా ఒక కోచ్‌ కష్టం దాగుంటుంది. ప్రపంచానికి చాంపియన్లను అందించే  కోచ్‌లను గౌరవించాల్సింది పోయి వారిని అవమానించే పరిస్థితులు తెలంగాణలో దాపురించాయి. కోచ్‌ల రెగ్యులరైజేషన్‌తో పాటు అవసరమైన చోట కొత్త కోచ్‌ల నియామకం దాకా  ఏ పనీ చేపట్టకుండా రాష్ట్ర  క్రీడా ప్రాథికార సంస్థ (శాట్స్‌) చోద్యం చూస్తోంది.


దీర్ఘకాలంగా పెండింగ్‌లో  రెగ్యులరైజేషన్‌ ఫైల్‌

సరైన కోచింగ్‌ వ్యవస్థ లేక నష్టపోతున్న క్రీడాకారులు 


 రాష్ట్రాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం..క్రీడారంగం అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తామంటూ వీలు చిక్కినప్పుడల్లా ఊదరగొట్టే ప్రభుత్వ పెద్దలు ఆచరణలో మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా క్రీడారంగానికి వెన్నుముకగా నిలిచే కోచింగ్‌ వ్యవస్థపై అయితే, కేసీఆర్‌ సర్కార్‌ శీతకన్ను వేసింది. అంతేకాక రెండు దశాబ్దాలకు పైబడి కాంట్రాక్టు కోచ్‌లుగా సేవలందిస్తున్న వారిని రెగ్యులరైజేషన్‌ చేసే వెసులుబాటు ఉన్నా, ప్రభుత్వం తాత్సారం చేయడంపై కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు..: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి క్రీడా ప్రాథికార సంస్థ 1993, 1999, 2009 సంవత్సరాలలో నోటిఫికేషన్‌ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో కోచ్‌ల నియామకం చేపట్టింది. ఎన్‌ఐఎ్‌స డిప్లొమా సర్టిఫికెట్‌ కలిగి రెండు దశాబ్దాలుగా సర్వీసులో ఉన్న అర్హులైన వారిని క్రమబద్ధీకరించాలంటూ 2008లో ఉమ్మడి హైకోర్టును కాంట్రాక్టు కోచ్‌లు ఆశ్రయించారు. వీరి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఖాళీగా ఉన్న కోచ్‌ల పోస్టులను అర్హులైన వారితో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కసరత్తు చేసిన అప్పటి శాప్‌ పాలకమండలి సమావేశంలో గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 కోచ్‌ల పోస్టులను డౌన్‌ గ్రేడ్‌ చేసి మొత్తం 76 గ్రేడ్‌-3 కోచ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించింది. రాష్ట్ర విభజనాంతరం తెలంగాణలో 37 ఖాళీలు ఏర్పడ్డాయి. 2008 జీఓ నెంబర్‌ 18లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అయితే, కొద్ది నెలల తర్వాత లోటు బడ్జెట్‌ను సాకుగా చూపిస్తూ క్రమబద్ధీకరణ, పోస్టుల భర్తీ ప్రక్రియను పక్కనపెట్టారు. దీనిపై కాంట్రాక్టు కోచ్‌లు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ కోచ్‌లకు ఇచ్చే అన్ని రాయితీలను వీరికి వర్తింపు చేస్తామని శాప్‌ అధికారులు తెలియజేశారు కానీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. ఇక, ఇంక్రిమెంట్ల ఊసైతే మొత్తానికి గాలికి వదిలేశారు. 


ఖేలో ఇండియాలో పేలవ ప్రదర్శన

ఈ మధ్య జరిగిన ఖేలో ఇండియా గేమ్స్‌లో తెలంగాణ 15వ స్థానంలో నిలిచింది. కర్ణాటక, తమిళనాడు 4,6 స్థానాల్లో నిలవగా మహారాష్ట్ర అగ్రస్థానాన్ని దక్కించుకొంది. దీని బట్టి క్రీడారంగంలో తెలంగాణ ప్రగతిని అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు సుశిక్షుతులైన కోచ్‌ల ద్వారా క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తూ ప్రత్యేక ప్రణాళికలతో పతకాల వేటలో దూసుకుపోతున్నాయి. అయితే మన దగ్గర మాత్రం ఉన్న కోచ్‌లను పట్టించుకోక..కొత్తవారిని నియమించకపోవడంతో క్రీడాకారుల భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికైనా అనుభవజ్ఞులైన కోచ్‌లను క్రమబద్ధీకరించి వారికి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడంతోపాటు, అవసరమైన చోట ప్రమాణాలు కలిగిన కోచ్‌లను నియమిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.


నిస్తేజంగా శాట్స్‌

 శాట్స్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ) ఆవిర్భావం నుంచి చైర్మన్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్‌ రెడ్డి కాంట్రాక్టు కోచ్‌లను క్రమబద్ధీకరించేందుకు, 200 మంది కొత్త కోచ్‌లను నియమించేందుకు కృషి చేస్తున్నామని మూడేళ్లుగా చెబుతున్నా ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఆయన కిందటి ఏడాది ప్రకటించిన శాట్స్‌ అభివృద్ధి ప్రణాళికలో కూడా ఈ విషయాలను పొందుపరిచారు గానీ సీఎం, క్రీడామంత్రి దృష్టికి వీటిని తీసుకెళ్లడంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని కోచ్‌లు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి శాట్స్‌ పాలకమండలి ఊసే లేకపోవడంతో క్రీడల అభివృద్ధి కుంటుపడింది. అంతేకాక క్రీడాశాఖలోని ఓ పెద్దమనిషి గతంలో అర్హత లేని తన అనుయాయులకు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో కోచ్‌ పోస్టింగ్‌లు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసినా.. కాంట్రాక్టు కోచ్‌ల అపరిష్కృత సమస్య కారణంగా ఆయన పైరవీలకు బ్రేకులు పడ్డాయి.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

Advertisement

క్రీడాజ్యోతిమరిన్ని...

Advertisement
Advertisement