Abn logo
Jul 9 2020 @ 00:46AM

కాన్పూర్‌ ఘాతుకం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పేరుమోసిన నేరగాడు వికాస్‌ దూబే ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలు తీసిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. యూపీలో నేరగాళ్ళ వీరవిహారాలు తెలిసినవే కానీ, ఇలా మాటువేసి ఏకంగా ఓ పోలీసు బృందాన్నే మట్టుబెట్టిన ఘటన ఊహకు అందనిది. పోలీసులు తనను అరెస్టుచేయడానికి వచ్చినప్పుడు తప్పించుకోవడం కాక, బుల్లెట్ల వర్షం కురిపించి ఏకంగా వారినే అంతం చేశాడు. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటికీ పోలీసులు అతడిని పట్టుకోలేకపోతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏదో హోటల్‌లో దాగివున్నాడని తెలిసి పోలీసులు అక్కడకు చేరుకొనేలోగా అక్కడనుంచి కూడా దూబే మాయమయ్యాడు. వేట ఇంత ఉధృతంగా సాగుతున్నప్పటికీ, ఇప్పటికీ అతడికి ఎప్పటికప్పుడు రహస్య సమాచారం అందుతున్నదని అర్థం. పోలీసు వ్యవస్థలో అతడు సృష్టించుకున్న ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఎంత బలమైనదో ఈ పరిణామాలు తెలియచేస్తున్నాయి. 


మూడేళ్ళక్రితం అధికారంలోకి వస్తూనే, నేరగాళ్ళను తుడిచిపెట్టేస్తానని ప్రతినబూని, వరుసపెట్టి వందలాది ఎన్‌కౌంటర్లు చేయించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ పరిణామం తీవ్ర అప్రదిష్ట తెచ్చిపెట్టింది. దూబేను పట్టుకోలేని దుస్థితిలో అతడి ఇంటిని కూల్చివేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటివి మాత్రమే పోలీసులు చేయగలుగుతున్నారు. దూబేకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఓ క్రిమినల్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించాడనీ, మరో ఇద్దరు సన్నిహితులు గాయపడ్డారనీ ఇటీవల పోలీసులు ప్రకటించారు. పట్టుకోబోతే ఎదురు కాల్పులు జరిపారంటూ మృతదేహం పక్కన ఏమేమి దొరికాయో వివరించారు. కానీ, ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మరో నేరగాడి తల్లి మాత్రం మూడవతేదీన పోలీసు బృందంపై దూబేగ్యాంగ్‌ విరుచుకుపడిన కొద్దిగంటల్లోనే ఇంట్లో నిద్రపోతున్న తన కుమారుడిని పోలీసులు పట్టుకుపోయారని అంటున్నది. యూపీ పోలీసులకు దూబే కొట్టిన దెబ్బనుంచీ, వచ్చిపడిన అప్రదిష్టనుంచీ ఎలా బయటపడాలో అర్థంకావడం లేదు. దూబేకు సమాచారాన్ని చేరవేస్తున్న పోలీసులను అరెస్టుచేయడం, బదిలీచేయడం వంటివి జరుగుతున్నాయి. దాదాపు రెండువందలమంది పోలీసులు విచారణ ఎదుర్కొంటున్నారు.


దూబేను పెంచిపోషించింది మీరేనంటూ రాజకీయపార్టీలన్నీ ఇప్పుడు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి కానీ, దశాబ్దాలుగా అన్ని పార్టీల మద్దతుతోనే దూబే ఈ స్థాయికి చేరుకున్నాడు. అరవైకేసుల్లో ముద్దాయిగా ఉన్న ఓ వ్యక్తి కాన్పూర్‌లోని తొలి పదిమంది కరడుగట్టిన నేరగాళ్ళ జాబితాలో ఇప్పటివరకూ లేడంటేనే పోలీసులతోనూ, రాజకీయనాయకులతోనూ అతడికి ఉన్న సాన్నిహిత్యం అర్థమవుతుంది. గతంలో, తనపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు పోయిన ఒక మంత్రిని ఇరవైమంది పోలీసుల సమక్షంలో అక్కడే కాల్చిపారేసినవాడు దూబబే. పోలీసులే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకపోవడంతో నిర్దోషిగా బయటపడ్డాడు. బెదిరింపులు, అపహరణలు, హత్యలు, రాజకీయం, రియలెస్టేట్‌ వ్యాపారంతో ఎవరూ కన్నెత్తిచూడలేని స్థాయికి అతడు ఎదిగిపోయాడు. ఇప్పుడు కూడా పోలీసులు అతడిని అరెస్టుచేయడానికి పోయే ముందు, ఒక వ్యాపారినుంచి దోచుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని బతిమలాడే ప్రక్రియ ఒకటి కొంతకాలం సాగిందని అంటారు. రెండుమూడు విడతలుగా ఇలా ప్రయత్నించి, చావుదెబ్బలు తినడంతో చివరకు డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో యాభైమంది బృందం వెళ్ళి కాల్పులకు గురికావాల్సి వచ్చింది. దూబేకు స్థానిక పోలీసు అధికారులనుంచి లభిస్తున్న సహకారంపై ఈ డీఎస్పీ గతంలో ఉన్నతాధికారులకు రాసిన లేఖ ఇప్పుడు వివాదం సృష్టిస్తున్నది. ఎడాపెడా ఎన్‌కౌంటర్లు చేసిపారేసి, రక్షకుడిగా పేరు సంపాదించుకోవాలన్న యావ తప్ప, నిఘావ్యవస్థనీ, పోలీసువ్యవస్థనీ ప్రక్షాళించాలని ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. ఐదువేల ఎన్‌కౌంటర్లు, వందకుమించిన మరణాలు, పదిహేడువేలమంది నేరగాళ్ళ లొంగుబాటుతో రాష్ట్రాన్ని గాడినపెట్టానని చెప్పుకుంటున్న యోగి ఆదిత్యనాథ్‌కు ఈ ఘటన పెద్ద ఎదురుదెబ్బ. ఆయన సగర్వంగా చెప్పుకొనే ఎన్‌కౌంటర్లతో నేరసామ్రాజ్యాలేమీ కూలిపోలేదనీ, చిల్లర నేరగాళ్ళు, అమాయకులు మాత్రమే బలైనారని తేలిపోయింది. నేరాలు తగ్గకపోగా పెరిగాయన్న వాదనకు మరింత బలం చేకూరుతున్నది. దూబేను సజీవంగా పట్టుకోవడంతో పాటు, పోలీసు వ్యవస్థ సమగ్ర ప్రక్షాళనకు యోగి ఆదిత్యనాథ్‌ సంకల్పించడం అవసరం.

Advertisement
Advertisement
Advertisement