కమల్‌హాసన్‌: మీ ప్రేమాభిమానాలకు దాసుడను

ఇటీవల కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఐసోలేషన్‌ వార్డు నుంచి బయటకు వచ్చారు. ఆస్పత్రి వైద్యులతో కలిసి ఒక గ్రూపు ఫోటో దిగారు. కాగా, గత నెల 22న కమల్‌ హాసన్‌కు కరోనా సోకింది. ఇటీవల అమెరికాకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన స్వల్ప అస్వస్థతకు లోనవడంతో కరోనా పరీక్షలు చేయగాపాజిటివ్‌ అని తేలింది. అప్పటి నుంచి శ్రీరామచంద్రా మెడికల్‌ సెంటరులో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కమల్‌ కరోనా నుంచి కోలుకున్నట్టు ఈ నెల ఒకటో తేదీన ఆస్పత్రి ఒక మెడికల్‌ బులిటెన్‌ను రిలీజ్‌ చేసింది. అయితే, ఈ నెల 3వ తేదీ వరకు ఆయన ఐసోలేషన్‌లో ఉంటారని తెలిపింది. శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి మరో వైద్య బులిటెన్‌ను రిలీజ్‌ చేసింది. ‘కరోనా వైరస్‌ బారినుంచి కమల్‌ హాసన్‌ పూర్తిగా కోలుకోవడంతో ఆయన్ను శనివారం డిశ్చార్జ్‌ చేశాం. ఇకపై ఆయన రోజువారీ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించుకోవచ్చు’ అని అందులో పేర్కొంది. ఇదిలావుంటే, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత కమల్‌ హాసన్‌ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆస్పత్రిలో ఐసోలేషన్‌ ముగియడంతో ఇంటికి క్షేమంగా చేరుకున్నాను. నేను త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, నా ప్రాణస్నేహితుడు రజనీకాంత్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులకు కృతఙ్ఞతలు. నేను క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలతో పాటు అన్నదానాలు చేసిన అభిమానులకు, మక్కల్‌ నీది మయ్యం కార్యకర్తలకు ధన్యవాదాలు. మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయో లేదో నాకు తెలియదు. కానీ, ప్రేమాభిమానాలకు దాసుడను. నా మీద ఎనలేని ప్రేమచూపించిన మీ మంచి మనసులకు కృతఙ్ఞతలు’’ అంటూ కమల్‌ పేర్కొన్నారు.  


Advertisement