Abn logo
Oct 30 2020 @ 04:41AM

వేరుశనగ నష్టం రూ.100 కోట్లు

Kaakateeya

 వరుస వానలతో సగానికి పైగా తగ్గిన దిగుబడి

 ఆదుకోకుంటే అన్నదాత అప్పులపాలే


రాయచోటి / సంబేపల్లె, అక్టోబరు 29: రాయచోటి నియోజకవర్గంలోని వేరుశనగ రైతు నెత్తిన ఖరీఫ్‌ రూ.100 కోట్ల నష్టాన్ని రుద్దింది. ఇటీవల కురిసిన వర్షాలకు వేరుశనగ పంట చూడ్డానికి ఏపుగా.. పచ్చగా ఉన్నా.. దిగుబడి మాత్రం పడిపోయి.. రైతులను నష్టాల ఊబిలోకి నెట్టింది. కనీసం పెట్టుబడులు కూడా రాక రైతులు ఆవేదన చెందుతున్నారు. వివరాలిలా..రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లె, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు మండలాల్లో ప్రధాన పంట వేరుశనగ. ఇక్కడ రైతులు ఖరీ్‌ఫలో వర్షాధారం కింద వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తారు. ఈ ఏడాది ఖరీప్‌ సీజన్‌లో సుమారు 50వేల ఎకరాల్లో సాగు చేశారు. పంట దిగుబడి దశలో భారీగా కురిసిన వర్షాలు రైతును నిలువునా ముంచాయి. వేరుశనగ ఏపుగా పెరిగిందే కానీ వాటికి కాయలు ఊరలేదు. దీనికి తోడు పెరికిన వేరుశనగ వర్షానికి పొలంలోనే తడిసి కుళ్లి పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయింది.


పెరిగిన సాగు ఖర్చు

గతంతో పోలిస్తే ఈ ఏడాది వేరుశనగ సాగు ఖర్చు పెరిగింది. దుక్కి చేసేందుకు గతంలో ఎకరాకు రూ.650 ఉంటే ఈ ఏడాది రూ.800 చేశారు. మిల్లర్‌కు గంటకు రూ.1000, కలుపు నివారణకు కూలీలకు రోజుకు రూ.350 ఉంటే రూ.500 అయింది. ఇలా ప్రతి ఒక్కటి ధర పెరగడంతో సాగు ఖర్చు పెరిగిపోయింది. ఎకరాకు సుమారు రూ.15 వేల వరకు ఖర్చు చేసినట్లు రైతులు తెలిపారు.


వర్షాలకు తగ్గిన దిగుబడి

ఈదఫా సరైన సమయంలోనే వర్షాలు పడ్డాయి. దీంతో సుమారు 50వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. దుక్కులు, విత్తనాలు, ఎరువులు, కూలీలు కలిపి ఎకరాకు సుమారు రూ.15వేల వరకు ఖర్చు చేశారు. గింజలు భూమిలో వేసినప్పటి నుంచి వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట ఏపుగా పెరిగిందే కానీ దిగుబడి సగానికిపైగా తగ్గిపోయింది. ఎకరాకు 15 నుంచి 20 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 7 నుంచి 10 బస్తాల దిగుబడి వచ్చిందని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో విత్తనకాయలు రూ.2500 పెట్టి కొనుగోలు చేస్తే ప్రస్తుతం రూ.1900 నుంచి రూ.2100 మాత్రమే విత్తన నాణ్యతను బట్టి ధర ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.


రూ.100 కోట్ల నష్టం

50వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయడానికి ఎకరాకు రూ.15వేల చొప్పున రూ.75 కోట్ల వరకు వ్యయం చేశారు. ఎకరాకు సరాసరిన 18 బస్తాల దిగుబడి వచ్చి, బస్తా రూ.2000 అనుకున్నా రైతుకు రూ.36 వేలు వచ్చేది. అంటే 50వేల ఎకరాలకు రూ.180 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు ఎకరాకు సరాసరిన 8 బస్తాలే దిగుబడి వచ్చింది. అంటే రూ.16వేలు. ఈ లెక్కన 50 వేల ఎకరాలకు గాను వచ్చింది రూ.80 కోట్లు. అంటే రైతులు దాదాపు రూ.100 కోట్లు నష్టపోయారు. దీంతో రైతులు అటు పెట్టుబడి.. ఇటు ఆదాయం కూడా కోల్పోయారు.  ప్రభుత్వం తమను ఆదుకోకపోతే అప్పుల్లో మునిగిపోతామని రైతులు వాపోతున్నారు. 

Advertisement
Advertisement