Abn logo
Oct 18 2020 @ 14:19PM

ఇసుక మెక్కేశారు..

Kaakateeya

52 వేల టన్నులు మాయం

క్వారీల నుంచి డంప్‌ల దాకా అక్రమాలు

ఇసుకాసురులపై చర్యలేవి ?


(కడప-ఆంధ్రజ్యోతి): సహజ వనరులైన మట్టి, ఇసుక, గ్రావెల్‌ను దోచుకుంటున్నారు. అఽధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలను దండుకుంటున్నారు. అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా కోట్లాది రూపాయల విలువ చేసే ఇసుకను కొంతమంది ఘనులు మెక్కేశారు. ఇసుక పాలసీలో పారదర్శకత, అక్రమాలకు తావు లేకండా అందరికీ అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. అది ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నిఘా కళ్లకు గంత లు కట్టి క్వారీ నుంచి డంప్‌లకు రావాల్సిన ఇసుక మార్గమధ్యంలోనే దారి మళ్లుతుండగా మరికొన్నిచోట్ల నిర్దేశించిన పరిమాణం కన్నా ఎక్కువ తవ్వేసి ఇసుకలో కాసులు గలగలలాడిస్తున్నారు. మరికొందరైతే తూకాల్లో కిరికిరి చేసి మోసాలకు పాల్పడుతున్నారు. చివరికి వినియోగదారుడు నష్టపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అదే సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకున్న నేతలు మాత్రం కోట్లు పోగేసుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 52 వేల టన్నుల ఇసుక దారి మళ్లించి కోట్లాది రూపాయలు పోగేసుకుంటున్నట్లు చెబుతున్నారు.


తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత

ఇసుక తవ్వకాలకు ప్రభుత్వ క్వారీలతో పాటు పట్టా భూముల్లో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఏపీఎండీసీ పర్యవేక్షణలో తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే కొందరు ఇసుకాసురులు నిబంధనలు ఉల్లంఘించి రీచ్‌లలో సూచించిన పరిమాణం కన్నా ఎక్కువ తవ్వేస్తున్నారు. ఉదాహరణకు మైనింగ్‌ శాఖ నాలుగు హెక్టార్లలో తవ్వకాలకు అనుమతినిస్తే అదనంగా తవ్వేస్తున్నారు. అలాగే నిర్దేశించిన పరిమాణం కన్నా ఎక్కువ లోతు తవ్వేసి కోట్లు గడిస్తున్నారు. ఇసుక తవ్వకాల నుంచి డంపింగ్‌ వరకూ పటిష్టమైన నిఘా ఉంచామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అంత సీన్‌ లేనట్లు అంటున్నారు. ఇటీవల మైనింగ్‌ రీజనల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ పెండ్లిమర్రి మండలంలోని కొండూరు రీచ్‌, నందలూరులోని కిచ్చమాంబపురం రీచ్‌లను తనిఖీ చేయగా అక్కడ నిర్దేశించిన దానికంటే ఎక్కువ తవ్వడం, బయట తవ్వడాన్ని గుర్తించారు. హద్దుల ప్రకారం కాకుండా బయట తవ్వేసినట్లు తేలింది. కొండూరు రీచ్‌కు 54 లక్షలు, కిచ్చమాంబపురం రూ.3.47 కోట్లు జరిమానా విఽధించారు. ఈ రెండు చోట్ల తనిఖీల్లోనే ఇంత భారీగా తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే పరిస్థితి చాలా చోట్ల నెలకొన్నట్లు ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ కొరవడడం, అధికార పార్టీకి చెందిన ప్రముఖ నే తల అభయహస్తం ఉండడంతో ఇసుకాసురులు చెలరేగిపోతున్నట్లు విమర్శలు ఉన్నాయి. 


మధ్యలోనే మాయం

ఇసుక రీచ్‌ల తవ్వకాల్లో అవకతవకలు ఒక ఎత్తయితే, రీచ్‌ నుంచి డిపోకు వచ్చిన ఇసుక మాయమవుతున్నట్లు విజిలెన్స్‌ బృందం గుర్తించింది. తవ్విన ఇసుకకు డిపోలో ఉన్న ఇసుకకు, విక్రయించిన ఇసుకకు తేడాలు వస్తున్నాయి. కడపలో 38 వేల టన్నులు మాయమవడంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు ఫిర్యాదు చేసింది. దీంతో ఐదు మందిని అరెస్టు చేశారు. అవకతవకలపై రిమ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. బద్వేలులో 8 వేల టన్నులు మాయమయ్యాయి. కడప పరిధిలోని సీకేదిన్నె పరిధిలో డిపోలలో కూడా 6 వేల టన్నుల ఇసుక మాయమైనట్లు చెబుతున్నారు. క్వారీల నుంచి డిపోల వద్దకు రాకుండానే మార్గమధ్యంలో బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డంప్‌లలో కూడా మాయాజాలం జరుగుతున్నట్లు చెబుతున్నారు. నాలుగు టన్నుల ఇసుక కొనుగోలుకు డబ్బులు కడితే 3.5 టన్నులు మాత్రమే ఇసుక లోడు చేస్తున్నారని విమర్శలున్నాయి. కొన్నిచోట్ల ఇసుకకు, ట్రాన్స్‌పోర్టుకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


జరిమానా విధించాం.. 

నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరుపుతుండడంతో కొండూరు, కిచ్చమాంబపురంలలో తనిఖీలు నిర్వహించి జరిమానా వేశాం. కొండూరులో 54 లక్షలు, కిచ్చమాంబపురంలో 3.47 కోట్ల రూపాయలు జరిమానా విధించాం.

- డి.రవిప్రసాద్‌, ఏడీ, మైనింగ్‌ రీజనల్‌ స్క్వాడ్‌Advertisement
Advertisement