Abn logo
Oct 30 2020 @ 04:46AM

భూదాతలకు సంకెళ్లు వేయడం దారుణం

Kaakateeya

 ప్రభుత్వ తప్పునకు నిదర్శనం పోలీసుల సస్పెన్షన్‌

 అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలి

 ఎమ్మెల్సీ బీటెక్‌ రవి


పులివెందుల టౌన్‌, అక్టోబరు 29: రాజధాని నిర్మాణం కోసం తమ జీవనాధారమైన వేల ఎకరాల భూములను ఇచ్చిన భూదాతలకు రౌడీలకు, కేడీలకు వేసినట్లు సంకెళ్లు వేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. రాజధాని రైతుల అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆయన గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ గురుబాబుకు వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పను, మడమ తిప్పను అని కాకమ్మ కథలు చెప్పి రైతుల విషయంలోనే తప్పాడన్నారు. దివంగత నేత వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవం అని చెప్పి నేడు అన్నదాతలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ దివంగత నేత మనసు క్షోభించేలాగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత రైతులు వేల ఎకరాలు ఇస్తే వారిపైనే అక్రమకేసులు పెట్టి సంకెళ్లు వేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. రైతులకు సంకెళ్లు వేసి అమానవీయంగా వ్యవహరించిన డీఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరుగురు పోలీసులను డీజీపీ సస్పెండ్‌ చేయడమే ప్రభుత్వం తప్పుచేసిందన్న విషయానికి నిదర్శనమని అన్నారు. రైతులపై అక్రమ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే టీడీపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement