Abn logo
Oct 30 2020 @ 04:38AM

ఇసుక ‘బ్లాక్‌’..!

Kaakateeya

 నిల్వలు ఖాళీ అవడంతో రీచ్‌ల మూసివేత

 డిపోలలో అరకొర

 రెట్టింపు ధరతో బ్లాక్‌లో పుష్కలం

 ఇసుక దొరక్క ఆగినపోయిన భవన నిర్మాణాలు

 పనుల్లేక కార్మికుల పస్తులు

 కొత్త రీచ్‌లు గుర్తించినా అందుబాటులోకి రాని ఇసుక

 పర్యావరణ కమిషనర్‌ వద్ద ఆరు రీచుల అనుమతులు పెండింగ్‌


(కడప- ఆంధ్రజ్యోతి): మైనింగ్‌ అధికారులు గుర్తించిన రీచుల్లో ఇసుక నిల్వలు ఖాళీ అయ్యాయి. వాటిని మూసి వేశారు. భారీ వర్షాలకు నదుల్లో వరద ప్రవాహం తగ్గడం లేదు. ఫలితంగా ఇసుక కొరత వల్ల భవన నిర్మాణాలు ఆగిపోతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నారు. ఇసుక అత్యవసరం అయితే బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. టిప్పరు ఇసుకకు అదనంగా రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తోంది. అదైనా సకాలంలో  దొరకడం లేదు. వారం పది రోజులు ఆగాల్సి వస్తుంది. కొత్త రీచులు గుర్తించినా అందుబాటులోకి రాక నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఆరు రీచులు పర్యావరణ అనుమతుల వద్దే ఆగిపోయాయి. ఇసుక కొరతపై ప్రత్యేక కథనం.


జిల్లాలో పెన్నా, బహుదా, పాపాఘ్ని, చిత్రావతి, మాండవ్య తదితర నదులలో ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఇసుక నిల్వలు ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ఎంత పరిమాణంలో ఇసుక ఉంది..?  సమీప బోరుబావులకు నీటి సమస్య వస్తుందా..? సమీపంలో రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయా..? వంటి కోణాల్లో పరిశీలించి నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాల కోసం 19 రీచులకు అనుమతులు ఇచ్చారు. ఆ రీచుల నుంచి మైదుకూరు, పోరుమామిళ్ల, బద్వేలు, కడప, సీకేదిన్నె, రాయచోటి, పులివెందుల స్టాక్‌ పాయింట్స్‌ (ఇసుక డిపోలు)కు తరలించి.. బుక్‌ చేసుకున్న వినియోగదారులకు అక్కడి నుంచి ఆన్‌లైన్లో సరఫరా చేస్తున్నారు. గత సీజన్లో గుర్తించిన ఇసుక రీచుల నుంచి 20 లక్షల టన్నులు సరఫరా చేశారు. అందులో ఇతర జిల్లాలకు 3.50 లక్షల టన్నులు సరఫరా చేయగా.. జిల్లాలో ఆయా ప్రాంతాలకు 16.50 లక్షల టన్నులు సరఫరా చేశారు. రీచుల్లో నిల్వలు ఖాళీ కావడంతో మూసివేశారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణాలు ఆగిపోతున్నాయి. 


పర్యావరణ అనుమతుల కోసం నిరీక్షణ 

వివిధ నదులలో 13 ప్రాంతాల్లో ఇసుక నిల్వలు ఉన్నట్లు మైనింగ్‌, రెవిన్యూ అధికారులు గుర్తించారు. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అవరోధాలు లేని కొండాపురం మండలంలో 2, ప్రొద్దుటూరు మండలంలో 2, ఎర్రగుంట్ల, చాపాడు, కమలాపురం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున గుర్తించి ఇటీవలే అనుమతులు ఇచ్చారు. మరో ఆరు రీచులకు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. నదుల్లో వరద ప్రవాహం తగ్గకపోవడంతో అనుమతి ఇచ్చిన రీచుల్లో తవ్వకాలు చేయలేని పరిస్థితి ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా డిపోల్లో నిల్వ చేయడంలో అధికారుల వైఫల్యం కారణంగా భవన నిర్మాణదారులు, ఆ రంగంపై ఆధారపడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక, ప్రత్యామ్నాయ పనుల్లేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


బ్లాక్‌లో పుష్కలంగా..!

ప్రభుత్వ డిపోల్లో ఇసుక కొరతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అడిగి డబ్బులు ఇస్తే కావలసినంత ఇసుక రాత్రికిరాత్రే సరఫరా చేస్తున్నారు. రాజంపేట, రైల్వే కోడూరులో అధికార పార్టీ అండతో ఇసుక అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. ఒకప్పుడు రూ.9,300లకే టిప్పరు ఇసుక లభిస్తే.. కడప డిపో నుంచి రూ.15 వేలకు దొరికేది. కొరత బూచి చూపి అక్రమార్కులు బ్లాక్‌లో రాజంపేటలో టిప్పరు రూ.25-30 వేలకు సరఫరా చేస్తే రైల్వే కోడూరులో రూ.40 వేలకు సరఫరా చేస్తున్నారు. కుందూ, పెన్నా నదులు సమీపంలో ఉన్నా ప్రొద్దుటూరు వాసులు ఇసుకను నల్లబజారులో కొనాల్సిందే. అధికార పార్టీ నాయకులు మధ్యదళారులను నియమించుకొని ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. టిప్పరు ఇసుక రూ.34-25 వేలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఇసుక కోసం ఆన్‌లైన్లో బుక్‌ చేస్తే వారం పది రోజులైనా రాదు. అదే అక్రమ రవాణాదారులను అశ్రయిస్తే రాత్రికి రాత్రే ఇంటికి చేరుతోంది. ఇదెలా సాధ్యం..? అన్న ప్రశ్నకు అధికారులే సమాధానం చెప్పాలి. కాగా.. కడప, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, రాయచోటి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో వేలాది భవన నిర్మాణాలు ఇసుక కొరతతో మధ్యలోనే ఆగిపోయాయి.


కార్మికులు పస్తులు ఉంటున్నారు ..చంద్రారెడ్డి, భవన నిర్మాణం, ఇతర రంగాల కార్మికుల ఫెడరేషన్‌ జిల్లా కో-కన్వీనర్‌, కడప

ఇసుక కోసం ఆన్‌లైన్లో బుక్‌ చేస్తే పది రోజులైనా ఇవ్వరు. ట్రాక్టరు 4.5 టన్నులు అయితే 3.5-3.70 టన్నులకు మించి ఇవ్వరు. అదైనా వస్తుందా అంటే రోజులు గడిచినా సరఫరా చేయరు. బ్లాక్‌లో క్షణాల్లో తెస్తారు. ఇసుక కొరత వల్ల జిల్లా అంతటా వేలాది భవన నిర్మాణాలు ఆగిపోయాయి. కార్మికులకు ఉపాధి లేదు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తప్పిదం కార్మికులకు శాపంగా మారింది. పనుల్లేక పస్తులు ఉంటున్నారు. 


నిర్మాణాలు ఆగిపోయాయి .. ఎన్‌.గంగరాజు, భవన నిర్మాణదారులు, కడప

ఆన్‌లైన్లో ఇసుక బుక్‌ చేసిన వారం పది రోజులకు కూడా సరఫరా చేయరు. ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. బ్లాక్‌లో ట్రాక్టరు రూ.4,300-4,500లకు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికే నాల్గు భవన నిర్మాణాలు ఆపేశాను. భవన యజమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కార్మికులు కూడా పనుల్లేక ఇతర పనులు వెతుక్కోవాల్సి వస్తోంది. 


ఇసుక ఖాళీ అవడంతో మూసివేశాం.. మోహన్‌రావు, మైనింగ్‌ శాఖ ఏడీ, కడప

ఇసుక నిల్వలు ఖాళీ కావడంతో 19 రీచులు మూసివేశాం. వివిధ నదుల్లో కొత్తగా మరో 13 ఇసుక నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించగా ఏడింటికి అనుమతులు వచ్చాయి. మరో ఆరింటికి పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. త్వరలో ఇసుక కొరత సమస్య తీరుతుంది. ఈ ఏడాది 20 లక్షల టన్నుల ఇసుక సరఫరా చేశాం. అందులో 3.5 లక్షల టన్నులు ఇతర జిల్లాలకు ఇచ్చాం.

Advertisement
Advertisement