Abn logo
Jun 5 2020 @ 03:53AM

ఏడాదంతా ఇంతేనా?

కరోనా మహమ్మారి ధాటికి కుదేలైన క్రీడారంగం లాక్‌డౌన్‌ ముగిశాక కూడా వెంటనే గాడిలో పడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధానంగా కబడ్డీ, బాక్సింగ్‌, రెజ్లింగ్‌లాంటి బాడీ కాంటాక్ట్‌ స్పోర్ట్స్‌కు ఈ ఏడాదంతా గడ్డుకాలమే అంటున్నారు ఆ క్రీడల ప్రముఖులు. వ్యాక్సిన్‌ వస్తే తప్ప కాంటాక్ట్‌ క్రీడల టోర్నమెంట్లు, లీగ్‌లను నిర్వహించే సాహసం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాయ్‌, రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థలు ఈ ఏడాది సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించి యువ ఆటగాళ్లను అకాడమీల్లోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై కూడా ఇప్పటివరకూ ఒక నిర్ణయానికి రాకపోవడం బాడీ కాంటాక్ట్‌ స్పోర్ట్స్‌ క్రీడాకారుల పాలిట శాపంగా మారింది.


బాడీ కాంటాక్ట్‌ క్రీడలకు గడ్డుకాలం

కబడ్డీ, బాక్సింగ్‌, రెజ్లింగ్‌పై తీవ్ర ప్రభావం

లీగ్‌ల నిర్వహణ అనుమానమే


(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)   

కొవిడ్‌-19 దెబ్బకి మూతపడ్డ స్టేడియాలు, క్రీడా సముదాయాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన అనుమతులతో కొన్ని సమాఖ్యలకు తమ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు వెసులుబాటు లభించింది. అయితే, బాడీ కాంటాక్టు క్రీడలైన కబడ్డీ, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, ఖో-ఖో, జూడో తదితర క్రీడా సంఘాలు మాత్రం ఇప్పట్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేది లేదంటున్నాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేశాక క్రీడాకారుల ఫిట్‌నెస్‌ మెరుగుదలకు చర్యలు తీసుకుం టాం తప్ప వచ్చే ఆర్నెల్లలో ఎలాంటి పోటీలు జరిగే అవకాశాలు లేవంటున్నాయి.


కబడ్డీ కూత కష్టమే..

 ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) తర్వాత ఆ స్థాయిలో ఆదరణ సంపాదించిన దేశవాళీ లీగ్‌ ‘ప్రొ కబడ్డీ’. విజయవంతంగా ఏడు సీజన్లను పూర్తి చేసుకున్నా ప్రొ కబడ్డీ 8వ సీజన్‌కు కరోనా సెగ గట్టిగానే తాకింది. వాస్తవానికి ప్రతీ ఏడాది ఏప్రిల్‌లో ఆటగాళ్ల వేలం, మే, జూన్‌ నెలల్లో శిక్షణ శిబిరం, జూలైలో పోటీలు ప్రారంభమయ్యేవి. ఈసారి ఇంతవరకు ఆటగాళ్ల వేలమే పూర్తి కాలేదు. జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ కూడా ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి లీగ్‌ నిర్వహించేందుకు సాహసం చేయలేమని చెబుతోంది. కబడ్డీ అనేది పూర్తిగా టీమ్‌ ఈవెంట్‌. కబడ్డీలో భౌతిక దూరం పాటించడానికి అవకాశమే లేనందున వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఆటను పూర్తిగా నిలిపేయడం తప్ప మరో మార్గం లేదంటున్నారు కబడ్డీ సమాఖ్య ప్రతినిధులు. పరిస్థితులు చక్కబడితే అక్టోబరు తర్వాత కార్యకలాపాలను ప్రారంభిస్తామని అంటోంది. అయితే, ఈ లీగ్‌ల మీదే ఆధారపడి ఉన్న యువ ఆటగాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కబడ్డీ సంఘం తమను ఆదుకోకపోతే కెరీర్‌ ఇంతటితో ముగిసిపోతుందని ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు.


కుస్తీ పట్టు లేనట్టే..

  ఒలింపిక్స్‌తో సహా అన్ని ప్రధాన పోటీలు వాయిదా పడడంతో మల్ల యోధులు ఎవరూ ప్రస్తుతానికి వ్యాయామశాలల వైపే చూడడం లేదు. ఇద్దరు లేకుండా తలపడకుండా సాధన చేయలేని ఈ క్రీడలోనూ ఇప్పట్లో ఎలాంటి పోటీలు నిర్వహించే ఆస్కారం కనిపించడం లేదు. ఐపీఎల్‌, ప్రొ కబడ్డీ స్ఫూర్తితో 2015లో ‘ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌’ను ప్రారంభించారు. తొలి రెండు సీజన్లు విఫలమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకొంది. ఈ లీగ్‌ జరగకపోతే తాము రోడ్డున పడతామని యువ రెజ్లర్లు వాపోతున్నారు. కరోనా కారణంగా లోకల్‌ క్లబ్‌లు, స్థానిక టోర్నమెంట్లు కూడా ఏమీ జరగడం లేదు. దీంతో సాధన నిలిచిపోవడంతో పాటు ఆర్థికంగా కూడా వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు.


బాక్సర్లకు తమ ప్రతాపాన్ని ఈ ఏడాది పంచ్‌ బ్యాగ్‌ల మీద చూపడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదు. భారత బాక్సింగ్‌ ఫెడరేషన్‌, సాయ్‌ తమ శిక్షణా శిబిరాలను రద్దు చేయడంతో ఇళ్లలోనే సాధన చేస్తున్నారు. ఎదురుగా ప్రత్యర్థి ఉన్నాడని భావించి షాడో ప్రాక్టీస్‌ చేయడం, మూమెంట్స్‌ వేగం పెంచుకోవడానికి వారు ఈ విరామాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే, ప్రొఫెషనల్‌ టోర్నమెంట్లు, ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌ వంటి దేశవాళీ పోటీలు ఇప్పట్లో జరిగే సంకేతాలు కనిపించడం లేదు. దేశంలో బాక్సింగ్‌ వాణిజ్య పరంగా ఇంకా విజయవంతం కాకపోవడం..ఈ క్రీడలోకి వచ్చే వారు ఎక్కువ శాతం పేద కుటుంబాలకు చెందినొళ్లే కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement